వైట్‌టాప్ రోడ్లు ఎంతో మేలు

Sun,October 13, 2019 02:04 AM

-సత్ఫలితాలిస్తున్న వీడీసీసీ రోడ్లు
-హైదరాబాద్‌లో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ
-ముంపు ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నాణ్యత, మన్నిక విషయంలో వైట్‌టాప్ రోడ్లు ఎంతో మెరుగ్గా ఉన్నట్టు తేలింది. తవ్వకాలు జరుపకుంటే ఈ రోడ్లు దీర్ఘకాలంపాటు మన్నే అవకాశమున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడవడంతో అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ముంపుప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటినే వ్యాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్ (వీడీసీసీ) రోడ్లుగా కూడా పిలుస్తారు. సుమారు ఐదేండ్ల క్రితం బంజారాహిల్స్ రోడ్ నంబర్-10తోపాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన వీడీసీసీ రోడ్లతో మంచి ఫలితాలు రావడంతో ఈ రోడ్లు క్రమంగా హైదరాబాద్ అంతటా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టుప్రాంతాల్లో నీరు నిలువడంవల్ల బీటీరోడ్లు కొట్టుకుపోతుండటంతో అధికారులు వైట్‌టాప్ రోడ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. టీఎస్ ఐఐసీ, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కూడా తమ పరిథిలో వీడీసీసీ రోడ్లను అధికంగా ఏర్పాటు చేస్తున్నాయి.

వీడీసీసీ రోడ్ల ప్రత్యేకత

అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతోకూడిన కాంక్రీట్ ఫ్లోర్‌ను ఏర్పాటు చేయడం వీడీసీసీ రోడ్ల ప్రత్యేకత. రోడ్డు ఏర్పాటుచేసిన వెంటనే ప్రత్యేక యంత్రం ద్వారా కాంక్రీట్‌లో వైబ్రేషన్ కలిగించి అదనంగా ఉన్న నీటిని పంప్‌ద్వారా బయటికి పంపుతారు. వ్యాక్యూమ్ ప్రక్రియ ద్వారా కాంక్రీట్‌లోని నీటిని తొలిగించి త్వరగా ఆరిపోయేలా చేస్తారు. దీనివల్ల రోడ్ల దృఢత్వం పెరిగి ఎక్కువకాలం మన్నుతాయని అధికారులు తెలిపారు.

ఖర్చు ఎక్కువైనా..

సాధారణ కాంక్రీట్ రోడ్డు ఏర్పాటుకు ప్రతి కిలోమీటర్ లేన్‌కు రూ.30 లక్షలు ఖర్చయితే.. వీడీసీసీ రోడ్డు ఏర్పాటుకు అదనంగా మరో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చవుతుంది. అయినప్పటికీ వీడీసీసీ రోడ్డుకు ఇరువైపులా ఒక్కో మీటరు చొప్పున ఖాళీ వదలడంతోపాటు పైప్‌లైన్ ఏర్పాటుకోసం ప్రతి కిలోమీటర్‌కు ఓచోట క్రాసింగ్‌లు వదులుతుండటంతో కేబుళ్లు, పైప్‌లైన్ల కోసం తవ్వాల్సి వచ్చినప్పుడు రోడ్డును పాడుచేయకుండా తవ్వుకునేందుకు వీలుంటుంది. క్రాసింగ్‌ల వద్ద పేవర్ బ్లాక్స్ ఏర్పాటుచేయడంవల్ల రోడ్డును తవ్వాల్సిన అవసరం ఉండదు. అందుకే జీహెచ్‌ఎంసీ మరిన్ని ప్రాంతాల్లో వీడీసీసీ రోడ్లను ఏర్పాటుచేస్తున్నది. పెద్ద స్ట్రెచ్‌లలో వీడీసీసీ రోడ్లను ఏర్పాటుచేయాలంటే భారీ యంత్రసామగ్రి అవసరమవుతుంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా భారీస్థాయిలో వీడీసీసీ రోడ్లను ఏర్పాటుచేసే వీలులేకపోవడంతో చిన్న యంత్రాలతో చిన్నచిన్న స్ట్రెచ్‌లపై వైట్‌టాప్ రోడ్లను ఏర్పాటుచేస్తున్నాం.
- జియావుద్దీన్, చీఫ్ ఇంజినీర్

464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles