అన్నారం నుంచి సుందిల్లకు గోదారమ్మ పరుగులు


Sun,July 21, 2019 03:10 AM

Wet run of Annaram pump house motors begins

-కాసిపేటలోని అన్నారం పంప్‌హౌస్‌లో వెట్న్ సక్సెస్
-మొదటి మోటర్ ప్రారంభం
-నేడు రెండో మోటర్ వెట్న్
-ఆనందంలో ఇంజినీర్లు, సిబ్బంది
-మేడిగడ్డలో ఐదుగేట్లు మూసివేత
-కన్నెపల్లిలో నేడు మోటర్లు ఆన్‌చేసే అవకాశం!

మంథని, నమస్తే తెలంగాణ/మంథని రూరల్: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని అన్నారం పంప్‌హౌస్‌లో ఇంజినీర్లు శనివారం రాత్రి 40 మెగావాట్ల మొదటి మోటర్ ద్వారా నిరంతర ఎత్తిపోతలను ప్రారంభించారు. అన్నారం నుంచి పైకి ఎగిసిపడిన గోదావరి జలాలు సుందిల్ల బరాజ్‌వైపు పరుగులుపెట్టాయి. అంతకుముందు ఈఎన్సీ వెంకటేశ్వర్లు, నీటిపారుదల సలహాదారు పెంటారెడ్డి పర్యవేక్షణలో శుక్రవారం సాయంత్రం మొదలైన మొదటి మోటర్ వెట్న్ ప్రక్రియ శనివారం సాయంత్రం 3:45 గంటలకు పూర్తయింది. నిర్ణీత సమయానికి 214ఆర్పీఎం (రెవొల్యూషన్స్ పర్ మినిట్)కు చేరుకొని, పది నిమిషాల్లోనే 83.33 క్యూమెక్స్ నీటిని ఎత్తిపోసింది. మోటర్‌ను ఆన్ చేయడంతోనే డెలివరీ సిస్టర్న్ వద్ద రెండు పైపుల ద్వారా బయటికి వచ్చిన నీళ్లు డెలివరీ చానల్ గుండా సుందిల్ల కెనాల్ డ్రాప్ పాయింట్ వద్దకు చేరుకొని పరవళ్లు తొక్కుతూ బరాజ్‌లో కలిశాయి.
Godavri-water2
రెండు బరాజ్‌లు దాటుకొని దాదాపు 74 కిలో మీటర్ల మేర ఎదురెక్కిన గోదావరి జలాలు అన్నారం పంప్‌హౌస్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంప్‌హౌస్‌లో మినిమం డ్రా లెవల్ 116.500కు చేరువగా నీరు చేరడంతోనే మొదటి మోటర్ వెట్న్‌న్రు నిర్వహించారు. అనంతరం నిరంతర ఎత్తిపోతలను శనివారం రాత్రి ప్రారంభించారు. గోదారి జలాలు సుందిల్ల బరాజ్‌లోకి చేరే అద్భుతమైన దృశ్యాన్ని ఇంజినీర్లు, మెగా సిబ్బంది ఉద్వేగంగా చూస్తూ కేరింతలు కొడుతూ నదీమాతకు పూలను సమర్పించారు. జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. కాళేశ్వరం జిందాబాద్.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ సిబ్బంది పెద్ద పెట్టున నినదించారు. పైకి ఎగిసిపడే నీళ్లను చూడాలనే ఉత్కంఠ, ఉద్వేగం.. మేమే సాధించామనే ఆనందం వారి ముఖాల్లో కనిపించింది.

సీఎం కేసీఆర్ పర్యవేక్షణలోనే విజయవంతం

సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలోనే విజయవంతం అవుతున్నాం. ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు, గ్రావిటీ కెనాల్స్‌తోపాటుగా ప్రతి ఒక్క విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. వారి సలహాలు సూచనలతోనే వేగంగా పనులు పూర్తిచేశాం. ఇంజినీర్లంతా ఎంతో చిత్తశుద్ధితో పనిచేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ అనేక నిద్రలేని రాత్రులను సైతం గడిపారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో పనిచేసే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
- నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు

మేడిగడ్డలో ఐదుగేట్లు మూసివేత

-మూడు గేట్ల ద్వారా దిగువకు వెళ్తున్న గోదారమ్మ
-బరాజ్‌లో 7 టీంఎసీల నీరు

మేడిగడ్డ బరాజ్‌లో ఇంజినీరింగ్ అధికారులు ఐదు గేట్లను మూసివేశారు. మరోపక్క కన్నెపల్లి పంప్‌హౌస్‌లో బుధవారం నుంచి మోటర్ల రన్నింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత జలాలు మేడిగడ్డ బరాజ్‌లోకి చేరుతున్నాయి. మేడిగడ్డ నుంచి ఈనెల 18న 8 గేట్లను ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన ఇంజినీర్లు.. క్రమంగా నదీప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం 4 గేట్లు, శనివారం మరో గేటును మూసివేశారు. ప్రస్తుతం మూడు గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల నీరు కన్నెపల్లి ద్వారా అన్నారం బరాజ్‌కు వెళ్తున్నది. కాగా శనివారం బరాజ్‌లో 8.6 మీటర్ల ఎత్తులో 7 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు డీఈ వెంకటరమణారెడ్డి తెలిపారు.
Godavri-water1

కన్నెపల్లిలో నేడు మోటర్లు ఆన్‌చేసే అవకాశం!

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఆదివారం మోటర్లను ఆన్‌చేసే అవకాశం ఉన్నది. మోటర్లను మాన్యువల్ నుంచి ఆటోమోడ్‌లోకి తీసుకొచ్చేందుకు గత నాలుగు రోజులుగా తాత్కాలికంగా నిలిపివేశారు. పంప్‌హౌస్‌లో ఇప్పటికే ఒకటో నంబర్ మోటర్ ఆటోమోడ్‌లోకి వచ్చింది. రెండో మోటర్‌ను ఏక్షణంలోనైనా ప్రారంభించే అవకాశం ఉన్నది. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో కొద్దిరోజులు 1,3,4,5,6 వ నంబర్ మోటర్లు నడవడంతో అన్నారం బరాజ్‌కు 5.65 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం బరాజ్ నిండుకుండలా ఉన్నది.

ఆల్మట్టికి 26,299 క్యూసెక్కుల వరద

కృష్ణా బేసిన్‌లో క్రమంగా ఇన్‌ఫ్లోలు తగ్గుముఖం పడుతున్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టికి కేవలం 26,299 క్యూసెక్కుల వరద వస్తున్నది. కొన్నిరోజుల కిందట లక్ష క్యూసెక్కులకు పైగా ఉన్న వరద క్రమంగా తగ్గుతున్నది. 129.72 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఆల్మట్టిలో ప్రస్తుతం 114.56 టీఎంసీల నిల్వ ఉన్నది. కరంటు ఉత్పత్తి ద్వారా 834 క్యూసెక్కులు దిగువకు వదులుతున్న కర్ణాటక అధికారులు... కాల్వలకు మరో 128 క్యూసెక్కులను వదులుతున్నారు. దిగువన నారాయణపూర్‌కు కేవలం 1,226 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తున్నది. 37.64 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ప్రస్తుతం 33.86 టీఎంసీల నిల్వ ఉన్నది. తుంగభద్రకు 5,890 క్యూసెక్కులు, ఉజ్జయినికి 3,176 క్యూసెక్కుల వరద వస్తున్నది.
Godavri-water3
మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో అక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లి తద్వారా నాగార్జునసాగర్‌కు వరద మొదలైంది. శనివారం నాగార్జునసాగర్ వద్ద 2,567 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయింది. గోదావరిలోనూ క్రమంగా ఇన్‌ఫ్లోలు తగ్గుతున్నాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా సింగూరుకు స్వల్పంగా వరద రావడం మొదలైంది. సింగూరుకు 767 క్యూసెక్కులు, నిజాంసాగర్‌కు 77 క్యూసెక్కులు, కడెంకు 70 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 345 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఇంద్రావతి కలిసిన తర్వాత పేరూరు దగ్గర 31782 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. దిగువన ధవళేశ్వరం వద్ద 26,172 క్యూసెక్కుల వరద నమోదయింది. అధికారులు ధవళేశ్వరం నుంచి 12,417 క్యూసెక్కుల జలాల్ని దిగువన సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నీటి సంవత్సరంలో ఇప్పటివరకు 57.837 టీఎంసీల గోదావరిజలాలు సముద్రంలోకి కలిశాయి.

తుంగభద్ర ప్రాజెక్టుకు స్వల్పంగా ఇన్‌ఫ్లో

అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద నీరు స్వల్పంగా కొనసాగుతున్నది. శనివారం టీబీ డ్యాంలోకి 5,890 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 193 క్యూసెక్కులు తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 16.110 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువన వానలు తగ్గుతుండటంతో వరద స్వల్పంగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.

2853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles