అంకితభావంతో పనిచేస్తాం


Fri,February 22, 2019 02:21 AM

We work with dedication says cabinet ministers

-బాధ్యతల స్వీకరణలో నూతన మంత్రులు
-విద్యారంగాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా: మంత్రి జగదీశ్‌రెడ్డి
-రైతును రాజుగా చూడటమే లక్ష్యం: మంత్రి నిరంజన్‌రెడ్డి
-చిత్తశుద్ధితో పనిచేస్తా: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
-శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నూతనంగా నియమితులైన మంత్రులు జగదీశ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం సచివాలయం డీ బ్లాక్‌లో వారికి కేటాయించిన చాంబర్లలో వేద పండితుల ఆశీర్వాచనాల మధ్య బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంత్రులు కుటుంబసభ్యులతో కలిసి ఆయా చాంబర్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యాశాఖ మంత్రిగా జగదీశ్‌రెడ్డి మొదటి ఫ్లోర్‌లోని 237 చాంబర్‌లో బాధ్యతలు స్వీరించారు. ఈ సందర్భం గా కేజీబీవీలలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతి పాఠాలు బోధించడానికి అనుమతి ఇస్తూ తొలి సంతకంచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా రంగాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పా రు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలశాఖ మంత్రిగా సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డీ బ్లాక్ మొదటి ఫ్లోర్ 261 చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను రాజులుగా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు. చదువుకున్న యువతకు ఉద్యోగం లభించడం ద్వారా ఎంత భవిష్యత్ ఉంటుందో.. ఆవిధంగానే రైతులకు వ్యవసాయం ద్వారా పూర్తి భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నట్టు తెలిపారు. రైతుబంధు దేశంలోనే గొప్ప పథకంగా నిలిచిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సమ్మకాన్ని నిలుబెడుతానని తెలిపారు.

vemula-PRASHANTH-REDDY

సీఎం కేసీఆర్ దైవ సమానులు: మంత్రి వేముల

మంత్రివర్గంలో స్థానం కల్పించిన సీఎం కేసీఆర్ అడుగుజాడల్లోనే ఊపిరున్నంతవరకు నడుస్తానని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తనకు దైవసమానులని స్పష్టంచేశారు. సచివాలయం డీ బ్లాక్‌లోని రెండో ఫ్లోర్ 313 చాంబర్‌లో రోడ్లు, భవనాలు, రవాణా, హౌసింగ్‌శాఖల మంత్రిగా, అసెంబ్లీలో తనకు కేటాయించిన చాంబర్‌లో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన హౌసింగ్‌శాఖ, ఆర్టీసీ ఫైళ్లపై సంతకం చేసి మంత్రిగా బాధ్యతలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను వంద శాతం పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన మంత్రులను పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉద్యోగ సంఘాల నేతలు, సచివాలయ ఉద్యోగులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

NIRANJAN-REDDY
మంత్రులను అభినందించినవారిలో హోంమంత్రి మహమూద్ అలీ, చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, కోనేరు కోనప్ప, పద్మాదేవేందర్‌రెడ్డి, హన్మంతు షిండే, నల్లమోతు భాస్కర్‌రావు, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీజీగౌడ్, మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ మంత్రులు జూప ల్లి కృష్ణారావు, పీ రాములు, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు దేవీప్రసాద్, మహ్మద్ సలీం, గుండు సుధారాణి, బండా నరేందర్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, రాకేశ్, గాంధీనాయక్, లింగంపల్లి కిషన్‌రావు, గ్రూప్-1 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, హౌసింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రెగేట్ట మల్లికార్జున్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్‌రెడ్డి, సచివాలయం భద్రతా ప్రధానాధికారి త్రినాథ్ తదితరులు ఉన్నారు.

825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles