కన్నెపల్లిలో ఇక ఆటోమోడ్


Thu,July 18, 2019 02:18 AM

Water Levels Increased At Medigadda and Annaram Barrage

-మన ఇంజినీర్లే మోటర్లను నడిపే అవకాశం
-ఇప్పటికే ఆటోమోడ్‌లోకి ఒకటో మోటర్
-పూర్తిస్థాయి నిల్వసామర్థ్యానికి చేరువగా అన్నారం
-బరాజ్‌లో 5.65 టీఎంసీలకు చేరిన నీటినిల్వ
-కన్నెపల్లి వద్ద తాత్కాలికంగా మోటర్ల నిలిపివేత
-మేడిగడ్డ బరాజ్‌లో 7.26 టీఎంసీల నిల్వ

కాళేశ్వరం/ మహదేవపూర్: గత ఐదారు రోజులుగా మోటర్లను నిర్విఘ్నంగా నడుపుతున్న కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లను ఆటోమోడ్‌లో పనిచేయించేందుకు ఇంజినీర్లు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇప్పటివరకు మాన్యువల్‌గా మోటర్లను నడుపగా.. ఇకపై ఆటోమోడ్‌లో రన్ చేసేందుకు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, అండ్రీజ్, ఏబీబీ కంపెనీ ఇంజినీరింగ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తేబోతున్నారు. ఆస్ట్రియా, ఫిన్‌లాండ్ దేశాలనుంచి ప్రత్యేకంగా ఇంజినీరింగ్ అధికారులను రంగంలోకి దింపారు. వారు కాళేశ్వర్వానికి చేరుకుని పనులను మొదలుపెట్టారు. ఆటోమోడ్‌లోకి తేవడంతో మన ఇంజినీర్లు సైతం మోటర్లను నడిపే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఒకటో నంబర్ మోటర్‌ను మాన్యువల్ నుంచి ఆటోమోడ్‌లోకి తెచ్చారు.

kannepalli2

పూర్తిస్థాయి నిల్వ సమీపానికి అన్నారం

ప్రాణహిత జలాలను పంప్‌హౌస్ నుంచి నిరవధికంగా ఎత్తిపోయడంతో అన్నారం బరాజ్‌లో నీటినిల్వ 5.65 టీఎంసీలకు చేరుకున్నది. బరాజ్ దాదాపు నిండుతుండటం, ఆటోమోడ్‌లోకి మోటర్లను తెచ్చే పనితో అధికారులు బుధవారం కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద మోటర్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉదయంవరకు నాలుగు మోటర్లు నడువగా, 9 గంటలకు 1, 4వ నంబర్ మోటర్లను నిలిపివేశారు. తదుపరి 11.30కు 3వ, 5వ మోటర్లు ఆఫ్‌చేశారు. నాలుగు మోటర్ల నుంచి సుమారు 4000 క్యూసెక్కులను గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బరాజ్‌లోకి పంపారు. 2వ నంబర్ మోటర్‌తో ఏ క్షణంలోనైనా నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి. గురువారం 2వ, 6వ పంప్ నుంచి అన్నారం బరాజ్‌కు నీటిని తరలించనున్నారు. మాన్యువల్ నుంచి ఆటోమోడ్‌లోకి తెచ్చేక్రమంలో మోటర్లను నిలిపివేశామని ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. అన్నా రం పంప్‌హౌస్‌లోకి గోదావరి నీరు చేరడంతో ఒకట్రెండురోజుల్లో నీటిని ఎత్తి సుందిల్ల బరాజ్‌కు తరలించనున్నారు. కాళేశ్వరంవద్ద 10,000 క్యూసెక్కుల వరకు ప్రవాహం ఉన్నదని ఇంజినీర్లు తెలిపారు. మేడిగడ్డ బ్యాక్‌వాటర్ 28 కిలోమీటర్లకు చేరుకున్నాయి.

kannepalli3

మేడిగడ్డలో 7.26 టీఎంసీలు

మేడిగడ్డ బరాజ్‌లో నీటి నిల్వ బుధవారం సాయంత్రానికి 7.26 టీఎంసీలకు చేరుకున్నది. మంగళవారం నుంచి ఎలాంటి నీటి ప్రవాహం రాలేదని, బరాజ్‌లో నీటి నిల్వ నిలకడగానే ఉన్నదని డీఈ సురేశ్ తెలిపారు. ప్రతిరోజూ బరాజ్‌లో నీటిమట్టంపై ఇంజినీర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇదిలాఉంటే.. మంగళవారం రాత్రి మేడిగడ్డ బరాజ్‌లోని 40 గేట్లను ఐదు నిమిషాలపాటు సైరన్ కూతతో ఎత్తి పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

kannepalli4

ఆల్మట్టికి 57 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కనీసం 30-40వేల క్యూసెక్కులున్నా జూరాలకు వారంపదిరోజుల్లో నీరు
కృష్ణాబేసిన్‌లో ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఆల్మట్టికి 57,086 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో జలాశయంలో నీటిమట్టం పెరుగుతున్నది. రాబోయే నాలుగురోజుల్లో ఇదే ఇన్‌ఫ్లో కొనసాగితే ఆల్మట్టి, నారాయణపూర్ నిండే అవకాశం ఉన్నది. గత రెండ్రోజుల్లో ఇన్‌ఫ్లో తగ్గిన నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న వరద కొనసాగుతుందా లేదా అనే అంశంపైనే ఇది ఆధారపడి ఉన్నది. గురువారం ఇన్‌ఫ్లో 50వేల కంటే కొంచెం తగ్గే అవకాశం ఉన్నదని ఆల్మట్టి అధికారులు చెప్తున్నారు. కనీసం 30-40వేల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా.. ఎనిమిది రోజుల్లో ఆల్మట్టి, నారాయణపూర్ నిండి, జూరాలకు నీరు వచ్చే అవకాశం ఉంటుందని జూరాల ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హెచ్‌టీ శ్రీధర్ తెలిపారు. ప్రస్తుతం ఆల్మట్టి రిజర్వాయర్‌లో 129.721 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికిగాను 107 టీఎంసీల పైగా నీరు చేరుకున్నది.

దిగువకు 22,836 క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్‌కు అదేస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండగా.. 37.464 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయం 31.31 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర డ్యాంకు కూడా ఇన్‌ఫ్లో తగ్గుతున్నది. ప్రస్తుతం 10,776 క్యూసెక్కుల వరద వస్తున్నది. భీమాకు ఇంకా ఆశించిన మేర వరద రావడంలేదు. ఉజ్జయిని ప్రాజెక్టు సామర్థ్యం 117.24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 47.75 టీఎంసీల సామర్థ్యానికి చేరుకున్నది. ప్రస్తుతం 4270 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. మరోవైపు గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. కడెంకు 109, ఎల్లంపల్లికి 475 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. ధవళేశ్వరం వద్ద 44,219 క్యూసెక్కులుగా నమోదైంది.

3309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles