హక్కున్నా విరాసత్ చేస్తలేరు


Sun,June 16, 2019 03:24 AM

Warangal Urban District Women Farmer Suffering Revenue Officers Neglect Land Registration

-భర్త కష్టార్జితాన్ని భార్యకు కాకుండా చేస్తున్నారు
-మామ మాయాజాలం.. కోడలికి శాపం
-ధర్మగంటను ఆశ్రయించిన వరంగల్ అర్బన్ జిల్లా రెవెన్యూ బాధితురాలు

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తికి చెందిన బిట్ల పద్మకు ఆమె భర్త కొన్న భూమిని విరాసత్ చేయడానికి రెవెన్యూ అధికారులు మూడేండ్ల నుంచి ముప్పుతిప్పులు పెడ్తున్నారు. తన మామ(లింగయ్య) మాట విని తన భూమిని తనకు కాకుండా చేస్తున్నారని పద్మ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం శివారులోని సర్వే నంబర్ 725/1లో 1.14 ఎకరాలు, 725/సీలో 1.14 ఎకరాలు, 725/ఈ లో మూడు గుంటలు, 725/ఎఫ్‌లో మూడు గుంటలు, 725/జీ లో 0.27 గుంటలు, 725/బీ లో 0.27 గుంటలు, సర్వే నంబర్ 725/డీ1/ఏ లో మూడు గుంటలు చొప్పున మొత్తం 4.11 ఎకరాల వ్యవసాయభూమిని ఎల్కతుర్తికి చెందిన బిట్ల వెంకటేశర్లు కొనుగోలు (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 1411/2015, తేదీ 1-2-2015, 4729/2015 తేదీ: 22-09-2015) చేశారు. ఆ తరువాత రెవెన్యూ అధికారులు అన్నీ సక్రమంగా ఉన్నాయని పట్టాదారు పాస్‌పుస్తకం నంబర్ 571847, పట్టానంబర్ 1759 జారీచేశారు. బిట్ల వెంకటేశ్వర్లు జూలై 1, 2016లో విద్యుదాఘాతంతో మరణించారు. అనంతరం ఆయన భార్య బిట్ల పద్మ తన భర్త కొన్న భూమిని తన పేరిట విరాసత్ చేయాలని కోరుతూ ఎల్కతుర్తి తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొన్నది. 2017 నుంచి తాసిల్దార్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు పనిచేయడంలేదని ఆమె వాపోతున్నారు. పసివాళ్లయిన తన ఇద్దరు పిల్లలకోసమైనా భూమి ఇప్పించాలని వేడుకొంటున్నారు.
Dharmaganta

మూడేండ్లుగా తిప్పుతున్నారు

నవంబర్ 19, 2009న మా పెండ్లి జరిగింది. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసే నా భర్త (వెంకటేశ్వర్లు) విద్యుత్‌షాక్‌కు గురై చనిపోయారు. మా పెండ్లయిన ఆరేండ్లకు ఈ భూమిని కొన్నం. రిజిష్ర్టేషన్ పూర్తికాగానే ఎల్కతుర్తి తాసిల్దార్ పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీచేశారు. నా భర్త ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్న క్రమంలో అసహజ మరణం చెందడంతో ఎల్‌ఐసీ నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వచ్చినా నాకు కాకుండా చేశారు. తీరా నా భర్త పేర అదీ తన కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమిని నా ఇద్దరు పిల్లల మొహం చూసైనా విరాసత్ చేయాలని కోరుతుంటే అధికారులు తిప్పుకుంటున్నారే కానీ చేయట్లేదు. నీ పిల్లలు మైనర్లు కాబట్టి వారి పేరునచేయడానికి ఒప్పుకోబోమని రెవెన్యూ అధికారులు చెప్పారు. కనీసం వారిపేరుతో చేస్తూ నన్ను గార్డియన్‌గా పెట్టి చేయమన్నా చేయడంలేదు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఇద్దరు పిల్లలతో ఎల్కతుర్తి కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో అప్పటి జిల్లా కలెక్టర్ అమ్రపాలికి మొరపెట్టుకుంటే అన్ని రికార్డులు పరిశీలించి పద్మ పేరుమీద విరాసత్‌చేయాలని ఆమె స్వయంగా తాసిల్దార్ మల్లేశం (ఇటీవలే రిటయ్యారు)ను కలెక్టరేట్‌కు పిలిపించి హెచ్చరిస్తే తప్పకుండా చేస్తాను అని ఆమె ముందు చెప్పి.. ఆ తర్వాత కలెక్టరే చేసిస్తారు పో అంటూ నాపై కోపానికి వచ్చాడు. తర్వాత ఆర్డీవో వెంకారెడ్డి సారు దగ్గరికి వెళితే ఆయన కూడా మీకు న్యాయంగా రావాల్సిన భూమే. నేను చేయిస్తా.. అని చెప్పినా తాసిల్దార్ కార్యాలయంలో ఉన్న ఒకరిద్దరు అధికారులు మా మామ (బిట్ల లింగయ్య) మాటలు విని, నాకు చేయకుండా చేస్తున్నారు.

చిన్నతనంలో పెండ్లి అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి కనీసం మంచి విద్యాబుద్ధులు అయినా చెప్పించాలని ఎంత ప్రాధేయపడినా నా సమస్య పరిష్కారం కావడంలేదు. ఇప్పటికి మూడేండ్లు అవుతుంది. అన్నీ సక్రమంగా ఉన్నా, నిజమైన హక్కుదారులం మేమే అయినా రెవెన్యూ అధికారులు మాత్రం మా మొర ఆలకించడంలేదు.. మా మామ సన్నిహితుడైన బొల్లు శ్రీనివాస్ పేరుతో లీగల్ నోటీస్ పంపించారు. బొల్లు శ్రీనివాస్ దగ్గర నా భర్త (వెంకటేశ్వర్లు) అప్పు తీసుకున్నాడని ఓ ప్రామిసరీ నోటు సృష్టించారు. ఆ ప్రామిసరీ నోటు మీదున్న సంతకం నా భర్తది కానే కాదు. దొంగ సంతకం పెట్టించి ఆ భూమిని కాజేయాలని చూస్తున్నారు. మరోవైపు ఎల్కతుర్తి తాసిల్దార్ నీ పేరు మీద పట్టా చేయను. మీ మామ పేరుమీద చేస్తాను. అవసరం అయితే కోర్టు కేసు కూడా తీసి వేయిస్తాను అని బెదిరించారు. అందరూ కూడబలుక్కొని నా భర్త కష్టార్జితాన్ని, నా పిల్లల భవిష్యత్‌ను నా నుంచి దూరం చేయడానికి కుట్ర పన్నారని అర్థమయింది. నా మొహం చూడకపోయినా ఫర్వాలేదు కానీ నా పిల్లల మొహం చూసైనా (కన్నీళ్లు తుడుచుకుంటూ) మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా.
- బిట్ల పద్మ , ఎల్కతుర్తి
Padma1

సమస్యల్లేని భూమిని ఆన్‌లైన్‌లో నమోదుచేశాం

బిట్ల పద్మ, ఆమె మామ లింగయ్య, మరో వ్యక్తి మధ్య భూ తగాదా కేసు కోర్టులో నడుస్తున్నది. ఎలాంటి సమస్యలేని సర్వే నంబర్ 725/ఇలో 3 గుంటలు, 725/బీ1లో 27 గుంటల భూమికి గతంలో ఉన్న తాసిల్దార్ ప్రొసీడింగ్ ఇవ్వగా, ఇటీవలే ఆన్‌లైన్‌లో సైతం పద్మ పేరిట ఆ భూమిని నమోదుచేశాం. కోర్టులో కేసు ఉన్న కారణంతోనే మేము మిగతా భూమి విషయంలో జోక్యం చేసుకోవడంలేదు.
- వెంకటరమణ, తాసిల్దార్, ఎల్కతుర్తి

2810
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles