బావ పేరిట పట్టా చేసిండ్రు


Thu,May 23, 2019 01:51 AM

Vro neglects on inheritance land

-వారసత్వ భూమిపై వీఆర్వో నిర్వాకం
-ఎనిమిదేండ్లుగా తాసిల్దార్ కార్యాలయం చుట్టూ వితంతువు ప్రదక్షిణలు

దేవరకొండ, నమస్తే తెలంగాణ: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్‌కు చెందిన మాడ్గుల బాలమణి నిరక్షరాస్యురాలు. భర్త చనిపోవడంతో కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నది. నలుగురు పిల్లల ఆలనాపాలనా బాధ్యతలు మోస్తూనే.. వారసత్వ భూమి కోసం ఏండ్ల తరబడి పోరాటం చేస్తున్నది. పోలేపల్లి రాంనగర్‌కు చెందిన మాడ్గుల చంద్రయ్యకు గ్రామంలోని సర్వేనంబరు 14లో 4 ఎకరాల భూమి ఉన్నది. ఆయనకు నలుగురు కుమారులు మాడ్గుల లక్ష్మయ్య, రాములు, సత్తయ్య, పోచ య్య చంద్రయ్య ఉన్నారు. చంద్రయ్య చనిపోయాక నాలుగెకరాల భూమిని నలుగురు కొడుకులు ఒక్కోఎకరం చొప్పున భాగం పంచుకున్నా రు. అయితే పంచుకున్న భూములకు హద్దులు పెట్టుకున్నప్పటికీ పట్టా మాత్రం చేసుకోలేదు. రెండోకుమారుడు మాడ్గుల రాములు 1989లో చనిపోయాడు. అతడి భాగంపంపిణీలో వచ్చిన భూమిలో భార్య బాలమణి కాస్తులో ఉన్నది. 2011లో బాలమణికి చెందిన ఎకరం భూమిని చంద్రయ్య పెద్దకుమారుడు మాడ్గుల లక్ష్మయ్య పేరున సర్వేనంబర్‌ను 14/1గా మార్చి వీఆర్వో అక్రమంగా పట్టాచేశాడు.

న్యాయం కోసం కార్యాలయం చుట్టూ

భర్త మరణాంతరం మామపేరిట ఉన్నభూమిని తనపేరున మార్చాలని కోరగా.. సరేనన్న అప్పటి వీఆర్వో సత్యవర్ధన్‌రెడ్డి తరువాత అక్రమంగా బావ మాడ్గుల లక్ష్మయ్య పేరుమీదికి మార్చాడని బాలామణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేండ్లుగా తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. తన భర్తకు భాగంకింద ఇచ్చిన భూమిలోనే అత్తామామల సమాధులతోపాటు తనభర్త రాములు సమాధి కూడా ఉన్నదని తెలిపారు. అక్రమ పట్టా చేయించుకున్న తరువాత బావ లక్ష్మయ్య భర్త సమాధిని కూల్చివేసే ప్రయత్నం చేయగా.. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదయిందని పేర్కొన్నారు. సత్యవర్ధన్‌రెడ్డి సస్పెండ్ అయ్యాక వచ్చిన వీఆర్వో కూడా తనకు న్యాయంచేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు.


మాడ్గుల బాలామణి

ఇంకెన్నేండ్లుగా తిరుగాలో..

వారసత్వంగా వచ్చిన భాగంలో ఏండ్లుగా మేమే కాస్తులోఉన్నాం. వీఆర్వో అక్రమంగా పట్టా చేయడంతో కొత్తపాస్ పుస్తకం మా బావ పేరుమీదే వచ్చింది. రైతుబంధు సాయం కూడా ఆయనకే అందుతున్నది. పంచనామా కూడా చేసి వాస్తవాలు తెలుసుకోవాలని అధికారులకు దరఖాస్తులు చేసిన. ఆఫీసుల చుట్టూ తిరిగి మోకాళ్ల చిప్పలు అరిగి దవాఖాన పాలయ్యా. వీఆర్వో, తాసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ అందరినీ కలిశా. నడువలేని పరిస్థితిలో కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు.
- మాడ్గుల బాలామణి

విచారణ జరిపి న్యాయం చేస్తాం

బాలమణి భూమి విషయం నా దృష్టికి రాలేదు. వాస్తవంగా కాస్తులో ఉన్నవారికే భూమి దక్కాలి. బాధితులు కాస్తులో ఉండి వారికే భూమి దక్కాల్సి ఉంటే విచారణ జరిపించి న్యాయంచేసేలా చర్యలు తీసుకుంటా.
- గుగులోతు లింగ్యానాయక్, ఆర్డీవో దేవరకొండ

472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles