పల్లె ఓటర్లే అత్యధికం


Fri,March 15, 2019 11:43 AM

Village voters are the highest In telangana

-ఓటరు జాబితాలో గ్రామీణ ఓటర్లదే పైచేయి
-రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2.95 కోట్లు
-గ్రామీణ ప్రాంతాల్లో 1.53 కోట్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సాధారణంగా చదువుకున్నవారిలో ఎక్కువ చైతన్యం ఉంటుందని అందరూ భావిస్తుంటారు. కానీ ఓటు హక్కు వినియోగంలో మాత్రం చదువుకోనివారికంటే.. చదువుకున్నవారే బద్దకస్తులుగా వ్యవహరిస్తున్నట్టు ఎన్నికల గణాంకాలు చెప్తున్నాయి. అక్షర జ్ఞానం తక్కువగా ఉండే గ్రామాల్లో ఓటు చైతన్యం పెరిగింది. ఓటు విలువ తెలుసుకోవడంలో గ్రామీణ ఓటర్లే ముందున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ఓటర్లు మరింతగా పెరిగారు. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితాల్లో పల్లె ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. గ్రామ గ్రామాన ఓటర్ల నమోదుకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు పట్టణ ప్రాంతాల కంటే పల్లెల్లోనే కలిసి వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 2,95,29,954 మంది ఓటర్లున్నట్టు లెక్క తేలింది. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,53,28,974 మంది ఓటర్లున్నారు.

ఇటీవల పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదలచేసిన తుది జాబితాలో గ్రామీణ ఓటర్ల లెక్క తేల్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాలవారీగా ఓటరు జాబితా ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీల పరిధిలో 1,53,28,974 మంది ఓటర్లున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో 1,37,13,495 మంది ఓటర్లుండగా.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం కల్పించి, సప్లిమెంటరీ జాబితా తయారుచేశారు. దీంతో 16,15,479 మందితో మొదటి, రెండో సప్లిమెంటరీ జాబితా విడుదలచేశారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 99 వేలు, నిజామాబాద్ జిల్లాలో 97 వేలు, నల్లగొండ జిల్లాలో 96 వేల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. అతి తక్కువగా మేడ్చల్ మల్కాజిగిరిలో 15 వేలు, వరంగల్ అర్బన జిల్లాలో 24 వేలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 26 వేల మంది నమోదయ్యారు.

ఓటు నమోదు పల్లె నుంచే ఎక్కువ

ఓటు నమోదులో, ఓటు హక్కును వినియోగించుకోవడంలో పల్లె ప్రజలే ముందుంటున్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ఓటు నమోదు కూడా వెనుకబడింది. ఓట్లు వేయడంలో నియోజకవర్గంలో పరిధిలోని సగం మంది కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం లేదని అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓట్లు పోలవుతున్నట్టు ఇటీవల జరిగిన పంచాయతీ పోలింగ్‌లో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో సగటున 90 నుంచి 93 శాతం పోలింగ్ నమోదవుతుండగా.. పట్టణ ప్రాంతాల్లో 49 శాతం దాటడంలేదు. ఇక ఓటు నమోదులో కూడా పల్లె ప్రజలే ముందుంటూ ఓటు హక్కుకు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 1,42,00,980 మంది ఓటర్లున్నట్టు లెక్క తేలింది. వీరిలో అత్యధికంగా హైదరాబాద్‌లోనే 39 లక్షల మంది ఓటర్లున్నారు. మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఉంటున్నట్టు గుర్తించారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో పల్లెల్లోనే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక ఈ నెల 25న ఓటరు తుది జాబితా విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అప్పటి వరకు ఓటరు నమోదు కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. దీంతో గ్రామాల్లో ఓటరు నమోదుకు మరింత అవకాశం దక్కింది. కొత్తగా నియమితులైన పంచాయతీల పాలకవర్గాలు ఓటరు జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. వచ్చే పరిషత్ ఎన్నికలకు ప్రతి ఓటు అవసరమేననే ధోరణితో ఓటు నమోదు చేపట్టారు. ఓటరు తుది జాబితా నాటికి గ్రామీణ ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.

అసెంబ్లీ జాబితా ఆధారంగానే..

అసెంబ్లీ ఓటరు జాబితాను మదర్ రోల్‌గా కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసిన జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,95,29,954 మంది ఓటర్లున్నారు. పురుషులు 1,48,42,619, మహిళలు 1,46,74,977తో పాటు 1,380 థర్డ్ జెండర్స్‌తోపాటు సర్వీసు ఓటర్లు, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంత ఓటర్లు 1,53,28,974 మంది ఉన్నారు. అసెంబ్లీ ఓటరు జాబితా ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో 1,37,17,469 మంది ఉన్నారు. ఆ తర్వాత అక్టోబర్ వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించడంతో 12,34,589 మంది కొత్తగా నమోదయ్యారు. దీంతో సప్లిమెంటరీ జాబితాతో కలిపి మొత్తం 1,49,52,058 మంది ఓటర్లు గ్రామీణ ఓటర్లున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ నెల 3 తేదీ వరకు ఓటు హక్కు కోసం ప్రత్యేక కార్యక్రమాలుచేపట్టారు. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో 3,76,921 మంది కొత్తగా నమోదైనట్లు తేలింది. అయితే చాలా మంది ఓటర్లు పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు మళ్లించుకున్నారు. దీంతో ప్రస్తుతం గ్రామీణ ఓటరు జాబితా 1,53,28,974 చేరింది.
TANDUR12

1120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles