విజయారెడ్డి హత్యకేసులో.. నిందితుడు సురేశ్ మృతి

Fri,November 8, 2019 02:47 AM

-కాలిన గాయాలతో నాలుగు రోజులపాటు ఉస్మానియా దవాఖానలో చికిత్స
-స్వగ్రామం గౌరెల్లిలో అంత్యక్రియలు పూర్తి
-ఉస్మానియా దవాఖానలో మృత్యువాత
-నాలుగు రోజులుగా బర్నింగ్ వార్డులో చికిత్స
-మృతదేహానికి గౌరెల్లిలో అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ సుల్తాన్‌బజార్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తాసిల్దార్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు సురేశ్ గురువారం ఉస్మానియా దవాఖానలో మృతిచెందాడు. గత సోమవారం విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పటించిన క్రమంలో మంటలు అంటుకోవడంతో 65 శాతం గాయాలయిన అతడు నాలుగు రోజులుగా చికిత్స పొందాడు. సురేశ్ తెల్లవారుజామునే మృతిచెందినట్టు వచ్చిన వార్తలను వైద్యులు ఖండించారు. ముఖం, ఛాతీ పైభాగం, చేతులు, కాళ్లు పూర్తిగా కాలిపోవడంతోపాటు శ్వాసనాళాలు దెబ్బతినడంతో సురేశ్‌కు వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. కాగా, మధ్యాహ్నం 3:40 గంటల ప్రాంతంలో అతడు మృతిచెందినట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు.

సురేశ్ మృతదేహానికి ఫోరెన్సిక్ విభాగం హెచ్‌వోడీ టకీఉద్దీన్ పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సురేశ్ మృతితో ఈ ఘటనలో మరణించిన వారిసంఖ్య మూడుకు చేరింది. విజయారెడ్డి, ఆమె డ్రైవర్ గురునాథం మృతిచెందగా.. చంద్రయ్య, నారాయణ గాయాలతో చికిత్స పొందుతున్నారు. సురేశ్ మృతి వార్త తెలియగానే ఆయన భార్య లత దవాఖాన ఆవరణలో స్పృహ తప్పిపడిపోయారు. తన భర్త అమాయకుడని.. ఎవరో ఉసిగొల్పడం వల్లే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె రోదించారు. సురేశ్ మృతితో పాప, బాబు, తాను ఒంటరివారమయ్యామని తెలిపారు. సురేశ్ పరిస్థితి విషమంగా ఉన్నదనే సమాచారంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు ఉస్మానియా దవాఖానకు చేరుకొన్నారు. తనకు ఒక్కడే కొడుకు అని, భూమికోసం తిరిగి బంగారం, నాలుగు లక్షల నగదు పోగొట్టుకున్నాడని సురేశ్ తల్లి పద్మ రోదించింది.
SURESH1

రెచ్చగొట్టిందెవరు..!

విజయారెడ్డి హత్యకేసులో పోలీసుల విచారణ కొనసాగుతున్నది. కోర్టు అనుమతి ద్వారా నిందితుడు సురేశ్ మరణవాంగ్మూలాన్ని విశ్లేషించి దర్యాప్తు కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడ్ని ఎవరైనా ఉసిగొల్పినట్టు ప్రాథమిక ఆధారాలు లభిస్తే ఈ కేసులో అరెస్టులు జరిగే అవకాశం ఉన్నది. ఈ విషయంలో ఇప్పటికే అనుమానితులు కొంతమందిని ప్రశ్నించినట్టు తెలిసింది. రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ప్రేరేపించడం వల్లే తనభర్త ఇలా చేశాడంటూ భార్య లత ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు. అతడు తిరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల వివరాలు సేకరించిన పోలీసులు అందులో పలువురిని విచారించారు. గౌరెల్లిలో సురేశ్ స్నేహితుల నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.

భూమి వ్యవహారం నేనే చూసుకున్నా: కృష్ణ, సురేశ్ తండ్రి

సోమవారం ఉదయం 9 గంటలకు ఇంటినుంచి వెళ్లిన కొడుకు ఇలా మృతదేహంగా తిరిగి వస్తాడని అనుకోలేదని అతడి తండ్రి కృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. భూ వ్యవహరానికి, అతడికి ఎలాంటి సంబంధం లేదని, ఇలా ఎందుకు చేశాడో తెలియదని చెప్పారు. 9 గుంటల స్థలం అమ్మకంలోనూ అతడికి ఏమీ తెలియదని, ఆ స్థలాన్ని తానే అమ్మానని కృష్ణ చెప్పారు.

8338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles