లోరావాన్‌తో లేదిక బెంగ!

Mon,November 11, 2019 03:01 AM

-సాంకేతికతతో సమస్యలకు చెక్
-స్మార్ట్‌సిటీస్ రూపకల్పనలో కీలకపాత్ర
-తెలంగాణలోని పలురంగాల్లో పైలట్ ప్రాజెక్టుగా వినియోగం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వ్యవసాయం నుంచి స్మార్ట్ సిటీస్ రూపకల్పన వరకు అన్నిరంగాల్లోనూ సాంకేతికత అవసరం ఎంతగానో ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకున్నప్పుడే సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు టెక్నాలజీ వాడకం ద్వారా నీటి సమస్య, విద్యుత్ నిర్వహణ, కాలుష్యం, మౌలిక వసతులు, రవాణా, ట్రాఫిక్ వంటి ఎన్నో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో వాటర్ పైపుల ద్వారా నీటి వృథాను తగ్గించేందుకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) టెక్నాలజీ వినియోగంలో భాగంగా లోరావాన్ టెక్నాలజీ స్మార్ట్‌వాటర్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా ఏటా ఒక బిలియన్ లీటర్ల నీటి వృథాను అరికడుతున్నారు. భారతదేశాన్ని టెక్నాలజీ వినియోగంలో గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టాలనే ఉద్దేశంతో లోరావాన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. ఐటీ హబ్స్, సైబర్ ఐ సంస్థల ఆధ్వర్యంలో తెలంగాణలోనూ పలురంగాల్లో ఈ టెక్నాలజీని వినియోగిస్తూ పైలట్ ప్రాజెక్టులను చేపడుతున్నారు.

లోరావాన్.. అధునాతన టెక్నాలజీ

లోరావాన్ టెక్నాలజీ అధునాతనమైంది. ఇది వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ పరిధిలో డాటాను అందించగలుగుతుంది. ప్రస్తుతం మనం ఉపయోగించే సెన్సర్ల జీవితకాలం, డాటా సరఫరా చేసే పరిధి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి నిరంతర విద్యుత్ అవసరం. కానీ, లోరావాన్ టెక్నాలజీలో సెన్సర్లు బ్యాటరీతో పనిచేస్తాయి. ఇవి పదేండ్లపాటు 100 నుంచి 120 కి.మీ. పరిధిలో డాటాను సమర్థంగా సరఫరా చేస్తాయి. ఈ సెన్సర్లను ఎక్కడైనా అమర్చి ఫోన్‌ద్వారాగానీ, కంప్యూటర్‌ద్వారాగానీ డాటాను సేకరించవచ్చు. నీటి నిర్వహణ, నగరాల్లో స్మార్ట్ లైటింగ్, నీటివృథాను అరికట్టడం, యంత్రాల క్షీణత, జంతువుల కదలికలు, అగ్ని ప్రమాదాలను గుర్తించి రిమోట్ ద్వారానే అరికట్టడం చేయొచ్చు. వ్యవసాయం, స్మార్ట్‌సిటీస్, భవనాలు, పార్కులు, ఎయిర్‌పోర్టులు, అడవుల్లో దీని ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

భవిష్యత్‌లో 18 బిలియన్ ఐవోటీ పరికరాలు

ఐవోటీ టెక్నాలజీ వినియోగిస్తూ యూరోపియన్ దేశాలు సత్ఫలితాలు సాధిస్తున్నాయి. 141 దేశాల్లో ఈ టెక్నాలజీని వాడుతున్నారు. నెదర్లాండ్స్ దేశంలో మొదటిసారి దీన్ని వినియోగించారు. రెండేండ్ల నుంచి మన దేశంలోనూ ఈ టెక్నాలజీని పలురంగాల్లో పైలట్ ప్రాజెక్టుగా వాడుతున్నారు. భవిష్యత్‌లో ఐవోటీ, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. 2022 కల్లా ప్రపంచవ్యాప్తంగా 29 బిలియన్ల సాంకేతిక పరికరాలు వాడకంలో ఉంటే, అందులో 18 బిలియన్ పరికరాలు ఐవోటీకి సంబంధించినవే ఉంటాయని ఎరిక్‌సన్ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాంకేతిక పరికరాల అనుసంధానంలో లోరావాన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుంది.

స్మార్ట్‌సిటీల్లో ఇలా...

Lora1
స్మార్ట్‌సిటీల్లో నీటి కొరత, ట్రాఫిక్ ప్రధాన సమస్యలు. లోరావాన్ టెక్నాలజీ వినియోగంలో భాగంగా నగరంలోని కాలనీల్లో వాటర్ మీటర్లను అమర్చడం ద్వారా నీటి వినియోగం, పైపుల లీకేజీ ద్వారా నీటి వృథాను గుర్తించి నీటి కొరతను తగ్గించే వీలుంటుంది. లోరావాన్ ఆధారిత స్మార్ట్ మీటర్ అమరిక ద్వారా వాటర్ మీటర్ రీడింగ్‌ను రిమోట్ ద్వారా సేకరించవచ్చు. పార్కింగ్ సెన్సార్లను ఏర్పాటుచేసి రిమోట్ కంట్రోల్ ద్వారా నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యలను అరికట్టవచ్చు. స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్, స్మార్ట్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టం, స్మార్ట్ బస్ షెడ్యూల్ వంటి ఎన్నో సమస్యలకు ఈ టెక్నాలజీతో పరిష్కారం లభిస్తుంది. అతి తక్కువ ఖర్చుతో పట్టణాలను స్మార్ట్‌సిటీస్‌గా రూపొందించేందుకు దోహదంచేస్తుంది.

వ్యవసాయంలో..

లోరావాన్ టెక్నాలజీతో భూమిలో సెన్సార్లను అమర్చడం ద్వారా భూమిలోని తేమ, నైట్రోజన్ శాతం ఏ ప్రాంతంలో తక్కువున్నాయో, ఎక్కడ ఎక్కవున్నాయో తెలుస్తుంది. ఈ వివరాల ద్వారా రైతులు అవసరం మేరకు నీటిపారుదల, ఎరువులను వాడుకోవచ్చు.

పరిశ్రమల్లో..

పరిశ్రమల్లోని యంత్రాల పనితీరు తెలుసుకునేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. యంత్రాల నాణ్యత, పనితీరు క్షీణిస్తున్న సమయంలో హెచ్చరిస్తుంది. యంత్రాలు పాడవకముందే గుర్తించి మరమ్మతులకు అవకాశం ఇస్తుంది. పరిశ్రమల్లో అసెట్ ట్రాకింగ్ చేసేందుకు ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. ఈ ట్రాకర్‌ను అమర్చితే యంత్రాలనుగానీ, పరికరాలనుగానీ మార్చేటప్పుడు వాటిని ట్రాకింగ్ చేయొచ్చు. పరిశ్రమల్లోని యంత్రాలను ట్రాక్ చేసినట్టుగానే ఎయిర్‌పోర్టుల్లోనూ అసెట్ ట్రాకింగ్ ద్వారా వస్తువులను గుర్తించవచ్చు.

భవనాల్లో...

భవనాల్లో వాటర్‌మీటర్లు, విద్యుత్ మీటర్లను అమర్చుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీలోనూ లోరావాన్ టెక్నాలజీ ఆధారిత విద్యుత్ మీటర్ల ద్వారా ఎవరెవరు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో సేకరించవచ్చు. అగ్ని ప్రమాదాలు సంభవించినా క్షణాల్లో తెలుసుకొని.. ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది.

పార్కులు, అడవుల్లో...

దేశంలో వైల్డ్ లైఫ్ పార్కుల్లోని పులులను సంరక్షించేందుకు ట్రాకర్లను వాడినట్టుగానే విదేశాల్లో అడవి జంతువులను వేటగాళ్ల బారినుంచి రక్షించేందుకు లోరావాన్ టెక్నాలజీ దోహదపడుతుంది. జంతువుల కదలికలతోపాటు వాటిని వేటాడేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే కనిపెట్టొచ్చు. పార్కుల చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను దాటడానికి ప్రయత్నించినా, ధ్వంసం చేయాలని చూసినా తెలుసుకోవచ్చు. అడవుల్లో వేసవికాలంలో జరిగే అగ్ని ప్రమాదాలను గుర్తించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఎక్కువ అగ్ని ప్రమాదాలు సంభవించి వేల ఎకరాల అడవులు ఆహుతవుతున్నాయి. అడవుల్లో లోరావాన్ టెక్నాలజీ సెన్సార్లను అమర్చడం ద్వారా అగ్నిప్రమాదం తక్కువస్థాయిలో ఉన్నప్పుడే మనల్ని హెచ్చరిస్తుంది. దీనిద్వారా ప్రమాదం తీవ్రరూపం దాల్చకుండా అరికట్టవచ్చు.

ఐవోటీతో అద్భుత ఫలితాలు

-జయేశ్‌రంజన్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి
ఐవోటీ టెక్నాలజీతో దేశం ఆర్థికాభివృద్ధి సాధిస్తుంది. ఈ టెక్నాలజీతో అతి తక్కువ ఖర్చుతో స్మార్ట్ సిటీలను రూపొందించడం సులభతరం అవుతుంది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన విద్యుత్ పొదుపు, హెల్త్‌కేర్, వాతావరణ పర్యవేక్షణ వంటి రంగాల్లో ఐవోటీ టెక్నాలజీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

టెక్నాలజీ బలోపేతమే లక్ష్యం

-రాంగణేశ్, సీఈవో, సైబర్‌ఐ
అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ వాడకంతో ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా లోరావాన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. ఆయారంగాల్లో ఎదురయ్యే సవాళ్లను టెక్నాలజీ వినియోగంతో పరిష్కరించడంపై దృష్టిసారిం చాం. రాబోయే రోజుల్లో దేశం స్మార్ట్ ఇండియాగా మారుతుంది.

1917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles