మన ఓటు భద్రం


Fri,December 7, 2018 03:38 AM

Use of high technology EVMs

-అత్యాధునిక ఈవీఎంలు వినియోగం
-వీవీప్యాట్‌లతో మరోసారి చెక్ చేసుకునే అవకాశం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అపోహలు వద్దు.. అనుమానాలకు తావివ్వొద్దు.. మన ఓటు భద్రంగా ఉంటుంది. మనకు నచ్చి న.. సమర్థుడని మనం మెచ్చిన అభ్యర్థికే మన ఓటు చేరుతుంది. పోలింగ్‌పై ఓటర్లలో ఉన్న అపోహలు తొలిగించడంతోపాటు ఓటును పారదర్శకంగా వేసుకున్నామనే భరోసా కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అత్యాధునిక ఈవీఎంలు, వీవీప్యాట్‌లను వినియోగిస్తున్నది. ఇప్పటికే వాటి పనితీరుపై మాక్ పోలింగ్‌లు నిర్వహించింది. అధికారులకు శిక్షణ ఇచ్చింది. అధికారులు మొబైల్ వ్యాన్లలో తిరుగుతూ ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. మన దేశంలో 1982 నుంచి ఈవీఎంల సహాయంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ 36 ఏండ్లలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్యాంపరింగ్ వంటి లోపాలు తలెత్తలేదు. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తం గా ఇప్పటివరకు వేసిన కేసుల్లో ఒక్కటి కూడా నిరూపితం కాలేదు. మన వేసిన ఓటు భద్రంగా పటుతుందని అధికారులు చెప్తున్నారు.

మరోసారి చెక్ చేసుకుందాం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వాడుతున్న ఈవీఎంలు అత్యాధునిక టెక్నాలజీతో తయారైనవి. చాలా భద్రతతో కూడుకున్నవి. డిఫెన్స్ కంపెనీలు అన్నికోణాల్లో వీటిని పరీక్షించాయి. మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు మొదటిసారిగా వీవీప్యాట్లను వినియోగిస్తున్నారు. దీంతో మన ఓటు మనం వేసిన వ్యక్తికే పడిందో లేదో మరోసారి చెక్ చేసుకునే అవకాశం కలిగింది. వీవీప్యాట్ ఒక ప్రింటర్ వంటి యంత్రం. మనం బ్యాలెట్ యూనిట్‌లో ఓటు వేసిన తర్వా త మనం ఏ అభ్యర్థికి వేశామో తెలుపుతూ వీవీప్యాట్‌లో ఒక చిన్న రసీదు ప్రింట్ అవుతుంది. అభ్యర్థి గుర్తు, సీరియల్ నంబర్ దానిపై ఉంటాయి. ఈ రసీదు వీవీప్యాట్‌కు ఏర్పాటు చేసిన డిస్‌ప్లేపై ఏడు సెకన్లు కనిపిస్తుంది. ఆ తర్వాత వీవీప్యాట్‌లోనే ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లో పడుతుంది. అంటే మనం వేసిన ఓటు సరైన వ్యక్తికే చేరిందో లేదో మరోసారి చెక్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఒకవేళ ఓటు తప్పుగా పడితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి.

1130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles