13 జిల్లాల్లో అకాల వర్షం

Tue,December 3, 2019 04:09 AM

- చాలాచోట్ల నేలకొరిగిన పంట
- అక్కడక్కడా తడిసిన ధాన్యం
- పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లో భారీగా నష్టం
- ఆందోళనలో రైతన్న
- అత్యధికంగా భూపాలపల్లి జిల్లాలో 3 సెం.మీ. వర్షపాతం

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సోమవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. దాదాపు అన్నిచోట్ల కోతకు వచ్చిన పంట నేలకొరగా.. మార్కెట్‌కు తరలించిన ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు ఏడు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. అత్యధికంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో 3 సెం. మీ., వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు సుల్తానాబాద్‌, జూలపల్లి, ఎలిగేడు, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం, రామగుండం, మంథని, ముత్తారం, కమాన్‌పూర్‌, రామగిరి మండలాల్లో కోతకు వచ్చిన వరితోపాటు కల్లాల్లోని ధాన్యం, కొనుగోలు కేంద్రాలకు చేర్చిన ధాన్యం తడిసిముద్దయింది. 30వేల ఎకరాల్లో వరి కోతలు చేపట్టాల్సి ఉండగా, పెద్ద మొత్తంలో పొలాల్లోనే పంట నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని ధాన్యం దాదాపు 12 వేల క్వింటాళ్లు తడిసినట్టు అధికారులు తెలిపారు. 28 వేల ఎకరాల పత్తి ఏరాల్సి ఉండగా వర్షానికి తడిసినట్టు అధికారులు పేర్కొన్నారు.
rain1

భద్రాద్రి జిల్లాల్లో ఏడు వేల ఎకరాల్లో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన వర్షానికి దాదాపు ఏడు వేల ఎకరాల్లో పంట నేల వా లిం ది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కూడా తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం నగర కేంద్రంతోపాటు సమీ ప మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రెండువేల ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్టు సమాచారం. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని ఆయా మండలాల్లో వర్షం కురవగా, కల్లాల్లోని ధాన్యం తడిసింది. కొన్నిచోట్ల వరిపంట నేలవాలింది. ములుగు జిల్లాలో జల్లులు కురిశాయి. మహబూబాబాద్‌ జిల్లాలో కోతకు వచ్చి న వరితోపాటు కోసిన వరి మెదళ్లు, చేతికొచ్చిన పత్తి పంట తడిసింది.
rain2

గణపురంలో భారీ వర్షం..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కురిసిన వర్షానికి పొలాల్లోని వరి పంట నేలవాలింది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కూడా అక్కడక్కడా తడిసింది. జిల్లా కేంద్రంలోని ఓసీపీ-2లో సోమవారం మూడు షిఫ్టుల్లో 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా గణపురం మండలంలో 3 సెం.మీ., చిట్యాల మండలం లో 2.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం వర్షం పడింది. జిల్లా కేం ద్రంలో 1.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా మరికల్‌లో ఓ మోస్తరు వర్షం కురిసింది. నల్లగొండ జిల్లాలో జల్లులు కురవగా, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసింది. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్‌, ఆత్మకూర్‌.ఎస్‌, తిరుమలగిరి, హుజూర్‌నగర్‌, మఠంపల్లి మండలాల్లో జల్లులు పడ్డాయి. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌కు 40,326 బస్తాల ధాన్యం రాగా అందులో కొంత మేర తడిసింది. వికారాబాద్‌ జిల్లాలో తేలికపాటి వర్షం కురిసింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌కు వర్షసూచన

- రాగల 24గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీగా..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో సోమవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, తార్నాక, నేరెడ్‌మెట్‌, కాప్రా, దిల్‌సుఖ్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాగల 24 గంటల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

2028
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles