ఏకతాటిపై పల్లెలు

Fri,January 11, 2019 02:30 AM

-360 తొలివిడుతలో ఏకగ్రీవ పంచాయతీలు!
-పలు గ్రామాలకు సింగిల్ నామినేషన్లు
-ఈ నెల 13న అధికారిక జాబితా ప్రకటన
-ప్రభుత్వ ప్రోత్సాహక నిధులతో అభివృద్ధికి బాటలు

తంగళ్లపల్లి సంపత్, హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పల్లె ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఒక్కతాటిపైకి వచ్చారు. ఎన్నికల పేరుతో కులం, మతం, వర్గంగా విడిపోయే అవకాశం ఇవ్వకుండా.. గ్రామాభివృద్ధి అనే ఏకైక నినాదంతో ఒక్కటయ్యారు. అందరూ కలిసి చర్చించుకొని ఏకగ్రీవంగా పంచాయతీ పాలకవర్గాన్ని ఎన్నుకొని ఐక్యమత్యాన్ని నిరూపించుకున్నారు. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తొలి విడుత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం బుధవారంతో ముగిసింది. గురువారం నామినేషన్లను పరిశీలించారు. శుక్రవారం అప్పీల్‌కు అవకాశం ఉంది. ఇప్పటివరకు 360కిపైగా గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు సింగిల్ నామినేషన్ దాఖలైనట్టు సమాచారం. ఆయా గ్రామాల్లో వార్డు స్థానాలకు కూడా ఒక్కొక్కరే నామినేషన్లు వేశారు. దీంతో అవన్నీ ఏకగ్రీవం కానున్నాయి. ఈ నెల 13న పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ జాబితా ప్రకటన అనంతరం ఏకగ్రీవంగా నిలిచిన పంచాయతీలను అధికారికంగా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 2013లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో మొత్తం 540 గ్రామాలు ఏకగ్రీవమైతే... ఈసారి మొదటి విడుతలోనే 360కి పైగా ఏకగ్రీవంగా నిలువడం విశేషం.

కొత్త చట్టం.. కొత్త మార్పులు

గ్రామాల్లో రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల సమయంలో ఇవి తీవ్రం అవుతాయనే అభిప్రాయం ఉంది. చాలా గ్రామాల్లో పార్టీల పరంగా, కుల, మత, వర్గ ప్రాతిపాదికన విడిపోతారని చెప్తుంటారు. గ్రామ రాజకీయ కక్షలకు బలైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. అన్నిచోట్ల అభివృద్ధి నినాదమే ప్రధానంగా వినిపిస్తున్నది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పంచాయతీ రాజ్ చట్టమే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ చట్టం ద్వారా పంచాయతీల పాలకవర్గాలకు అనేక బాధ్యతలను అప్పగించారు. అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా కల్పించారు. కొత్త చట్టం ప్రకారం ప్రతినెలా గ్రామసభలు నిర్వహించాల్సి ఉంటుంది. వరుసగా మూడుసార్లు గ్రామసభ జరుగకపోతే సర్పంచ్‌పై వేటు పడుతుంది. గ్రామ అభివృద్ధి ప్రణాళికను గ్రామసభల్లో వివరించి ఆమోదింపజేయాల్సి ఉంటుంది. గ్రామాభివృద్ధి కమిటీలకు ప్రాధాన్యం ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలను భాగస్వాములను చేశారు. దీంతో కొత్త చట్టం గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని తీసుకొచ్చింది. చాలా రోజులుగా పార్టీల పేరుతో విడిపోయిన వారిని కూడా అభివృద్ధి కోసం ఒక్కటిగా చేసింది. ఇన్నేండ్లు వెనకబడి ఉన్న తమ గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుకొనేందుకు ఏకతాటిపైకి వస్తున్నారు.

రూ.50 లక్షల వరకు నిధులు

ఏకగ్రీవ గ్రామాల్లో ఈ ఏడాది రూ.50 లక్షల వరకు నిధులు రానున్నాయి. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఒక్కో గ్రామానికి రూ.20 లక్షలకుపైగా నిధులు వస్తాయి. ఏకగ్రీవమైతే ప్రభుత్వం నజరానా కింద రూ.10 లక్షలు ఇస్తున్నది. మరోవైపు ఎమ్మెల్యేలు బంపర్ అఫర్లు ప్రకటించారు. ఏకగ్రీవ గ్రామాలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. ఇలా ఏకగ్రీవ గ్రామాలకు తొలి ఏడాదిలోనే దాదాపు రూ.50 లక్షల నిధులు రానున్నాయి. మొదటి విడుత స్ఫూర్తితో మూడో విడుత పూర్తయ్యేసరికి వెయ్యికిపైగా పంచాయతీలు ఏకగ్రీవమవుతాయని అంచనా వేస్తున్నారు.

ఆదర్శంగా నూతన గ్రామాలు

నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం రాష్ట్రంలో 4,383 గ్రామాలు కొత్తగా ఆవిర్భవించాయి. ఇన్నాళ్లూ సమస్యలతో సావాసం చేసిన గిరిజన ఆవాసాలు, తండాలు, శివారు గ్రామాలు పంచాయతీలుగా ఆవిర్భవించాయి. దీంతో వారంతా తమ గ్రామాభివృద్ధే ప్రధానాంశంగా ఒక్కటిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఏకగ్రీవమవుతున్న పంచాయతీల్లో కొత్త గ్రామాలు, గిరిజన తండాలే అధికంగా ఉంటున్నాయి. మెదక్ జిల్లాల్లో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే, ఇందులో ఆరు తండాలే ఉండటం గమనార్హం. కొత్త గ్రామాల్లో అందరినీ ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతను యువత తీసుకుంటున్నది. మరోవైపు పంచాయతీ పోటీలోకి విద్యావంతుల రాక పెరిగింది. గతంలో ఒక్కో సర్పంచ్ స్థానానికి పదివరకు నామినేషన్లు వచ్చేవి. ఇప్పుడు చాలాచోట్ల సర్పంచ్ స్థానాలకు ఇద్దరు ముగ్గురే నిలబడ్డారు.

అభ్యర్థులూ.. మీరే తేల్చుకోండి

గోవిందాయపల్లి తండావాసుల వినూత్న ప్రయత్నం
ఏకగ్రీవం.. ప్రస్తుతం రాష్ట్రమంతటా వినిపిస్తున్న నినాదం. ముఖ్యంగా తండాలు, కొత్త పంచా యతీలు ఇందుకోసం పోటీ పడుతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండలం గోవిందాయపల్లి తండా ప్రజలు వినూత్న ప్రయత్నంతో చర్చనీయాంశంగా మారారు. 628 మంది ఓటర్లు న్న ఆ తండాలో సర్పంచ్‌గా పోటీకి మాజీ సర్పంచ్ రాములునాయక్, మన్యానాయక్, శైలానాయక్, సేవ్యానాయక్, దేశ్యానాయక్ ముందుకొచ్చారు. దీంతో తండా పెద్దలు, ఓటర్లు కలిసి ఏకగ్రీవం కోసం వారితో చర్చించారు. తొలిసారి పంచాయతీగా మారిన తమ తండాలో ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకొందామని ప్రతిపాదించారు. ప్రభుత్వ నజరానాతోపాటు, ఎమ్మెల్యే అందించే ప్రోత్సాహకంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. అయితే ఐదుగురు ఆశావహుల్లో ఎవరూ బెట్టు వీడలేదు. దీంతో తండావాసులంతా కలిసి మీ ఐదుగురు కలిసి ఎక్కడికైనా వెళ్లి చర్చించుకోండి. సర్పంచ్‌గా, ఉప సర్పంచ్‌గా ఎవరుంటారో తేల్చుకొని రండి. తండాలో మాత్రం చర్చలు, గొడవలు వద్దు అని తేల్చిచెప్పారు. దీంతో ఆ ఐదుగురూ వెల్దండ మండలంలోని శిరసనగండ్ల శ్రీరామాలయానికి వెళ్లి చర్చిం చుకొంటున్నారు.

తెరపైకి స్థానిక వాదం

కల్వకుర్తి నియోజకవర్గంలోనే మాడ్గుల మండలంలో జనరల్ స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా ఉంది. హైదరాబాద్‌లో స్థిరపడినవారిలో కొందరు గ్రామాలకు తిరిగి వచ్చి పోటీచేయాలని భావిస్తున్నారు. అయితే స్థానిక ఆశావహులు మాత్రం స్థానికంగా ఉంటున్న తమనే గెలిపించాలని కోరుతున్నారు. మాడ్గుల, ఇర్విన్, నాగిళ్ల, కొలుకులపల్లి, కలకొండలో ఈ పరిస్థితి కనిపిస్తున్నది.

అంతా బంధుగణమే

అనేక పంచాయతీల్లో బంధువులే బరిలో నిల్చారు. శామీర్‌పేట మండలం లకా్ష్మపూర్‌లో అన్నాదమ్ములు సింగం ఆంజనేయులు, సింగం సత్తయ్య పోటీపడుతుండగా, వారి అల్లుడు క్యాతం మధుకృష్ణ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా వరుసకు బాబాయ్ అబ్బాయ్ అయ్యే ఎల్ రాంప్రసాద్, ఎల్ కృష్ణమూర్తి సైతం నామినేషన్లు వేశారు. ఇలా ఒకే ఇంటికి చెందిన వారు బరిలో నిలువడం చర్చనీయాంశంగా మారింది.

2067
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles