ఇద్దరు టీఆర్‌ఎస్ కార్యకర్తల దుర్మరణం

Mon,September 3, 2018 07:10 AM

-ప్రగతి నివేదన సభకు వెళ్తూ..
-భిక్షపతి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి కేటీఆర్

చిలుపూరు/పోచమ్మమైదాన్/ఎంజీఎం/అబ్దుల్లాపూర్‌మెట్: ప్రగతి నివేదన సభకు వెళ్తూ ఇద్దరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు దుర్మరణం చెందారు. వరంగల్ అర్బన్ జిల్లా పోచమ్మమైదాన్‌కు చెందిన గాడుపు భిక్షపతి(39) కొంగరకలాన్ సభకు ఆదివారం తోటి కార్యకర్తలతో కలిసి బయల్దేరాడు. జనగామ జిల్లా చిన్న పెండ్యాల వద్ద వాహనం ఆపి మూత్రవిసర్జన కోసం రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భిక్షపతిని వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భిక్షపతికి భార్య అనిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భిక్షపతి మరణవార్త తెలుసుకున్న మంత్రి కేటీఆర్ అతడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నట్టు ప్రకటించారు. మరో ఘటనలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మాదారం గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం(30) డీసీఎం వాహనంలో సభకు బయలుదేరాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో ని మయూరి కాంట వద్ద డీసీఎం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం తో వాహనంలో ఉన్న రహీం కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలోని దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

అదుపుతప్పిన బస్సు: 30 మందికి స్వల్ప గాయాలు

ప్రగతి నివేదన సభకు వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లడంతో 30మందికి స్వల్పగాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ నుంచి మూడు స్కూల్ బస్సుల్లో కార్యకర్తలు సభకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు మెదక్ జిల్లా నార్సింగ్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లిపోయింది. దీంతో బస్సులో ఉన్న 30 మందికి స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.

8571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles