కృష్ణమ్మ పరవళ్లు


Fri,October 13, 2017 02:53 AM

Two spillway gates of Srisailam Project opened

రెండేండ్ల తరువాత నిండుకుండలా శ్రీశైలం
ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు
56 వేల క్యూసెక్కుల నీటి విడుదల
రెండు విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్త్తి
ఎంజీకేఎల్‌ఐ, పోతిరెడ్డిపాడు,
హంద్రీ-నీవాకు కొనసాగుతున్న నీటి తరలింపు

KrishnaRiver
నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: శివుడు జటాజూటం నుంచి రెండు పాయలను విడదీసి గంగమ్మను కిందకు వదిలినట్టుగా శ్రీశైల మల్లన్న పాదాల వద్దనున్న జలాశయం నుంచి రెండు గేట్లు తెరుచుకుని కృష్ణమ్మ దిగువకు పరుగులు పెట్టింది. కృష్ణమ్మ పరవళ్లకు ఆకాశంలో హరివిల్లు విరిసింది. ఉత్తుంగ తరంగాలుగా ఎగిసెగిసిపడుతూ పరుగులు పెడుతున్న కృష్ణా జలాలను చూసేందుకు రెండు కండ్లూ చాలడం లేదు. రెండేండ్ల తరువాత తన ఒడి చేరేందుకు ఉరుకులు పరుగులపై వస్తున్న కృష్ణవేణి కోసం నాగార్జునసాగరం పరవశంతో ఎదురుచూస్తున్నది. ఈ నీటికోసం ఎన్ని వివాదాలు.. ఎన్ని ఆక్షేపణలు.. ఎంత జలచౌర్యాలు.. ఎన్ని అనుమానాలు.. అన్నింటినీ అధిగమించి కృష్ణవేణి సాగర్‌వైపు జలజలా పొంగింది. జాలువారుతున్నది.

ఏడేండ్ల తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండింది. 2009లో వచ్చిన వరదల తర్వాత ఈసారి పూర్తిస్థాయిలో శ్రీశైలం నిండటంతో గురువారం రెండు గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు పవర్ జనరేషన్‌తో సాగర్‌కు నీటి విడుదల చేస్తుండగా.. మూడేండ్ల తర్వాత ఈ ఏడాది శ్రీశైలం గేట్లు తెరిచారు. అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తడం ఇది మూడోసారి. శ్రీశైలం గేట్ల నుంచి 55 వేల క్యూసెక్కులు, పవర్ హౌజ్ నుంచి 75 వేల క్యూసెక్కులు దిగువన ఉన్న నాగార్జునసాగర్‌వైపు తరలివెళ్తున్నాయి. నెలరోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల, సుంకేసుల, తుంగభద్ర, హంద్రీ నది నుంచి భారీగా వస్తున్న వరదతో ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకున్నది. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేసి.. రెండు గేట్లను పది మీటర్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215టీఎంసీలు కాగా 885అడుగుల గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేయొచ్చు.

KrishnaRiver1
ఈ వర్షాకాలంలో మొదటిసారిగా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. గత రెండేండ్లలో తొలిసారిగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల కావడం విశేషం. 2015లో శ్రీశైలం నుంచి నీళ్లు సాగర్‌కు వచ్చాయి. ఆ తరువాత ఆ జలాశయం పూర్తిస్థాయిలో నిండలేదు. 2015లోనూ రెండు గేట్లే తెరిచినప్పటికీ, మూడురోజుల్లోనే ఇన్‌ఫ్లో తగ్గిపోవటంతో మూసివేశారు. కర్ణాటకతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి గత నెల మొదటివారం నుంచి వరద ప్రవాహం మొదలైంది. సెప్టెంబర్ మొదటివారంలో ప్రాజెక్టు నీటి నిల్వ 775 అడుగులు ఉండగా నెల రోజుల్లో 110 అడుగులు పెరిగింది. బుధవారం రాత్రి వరకు రిజర్వాయర్ పూర్తిగా నిండింది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 530.80 అడుగుల నీటిమట్టం కొనసాగుతున్నది. 169.7124 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 1,30,007 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,350 క్యూసెక్కులుగా ఉన్నది. ఒక్కరోజులోనే సుమారు 10 టీఎంసీల నీటి నిల్వ పెరిగింది. దీంతో ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్‌కు 56 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి (ఎంజీకేఎల్‌ఐ)కి 1600 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 338 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 11 వేల క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల కొనసాగుతున్నది.

శ్రీశైలం కుడి, ఎడమ గట్టు పవర్ ప్రాజెక్టుల ద్వారా విద్యుదుత్పత్త్తి కొనసాగుతున్నది. ఎడమ గట్టు పవర్ హౌస్ నుంచి ఆరు యూనిట్లలో 150 మెగావాట్ల చొప్పున రోజుకు 900 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి 43,378 క్యూసెక్కుల నీరు ఉపయోగిస్తున్నారు. కుడిగట్టు పవర్‌హౌస్‌లో ఏడు యూనిట్ల ద్వారా 104 మెగావాట్ల చొప్పున 728 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. రెండు పవర్‌హౌస్‌లలో మొత్తం 1628 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుండగా దీనికోసం 31,795 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో ద్వారా బయటకు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి మధ్యాహ్నం వరకు 1,42,985 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లో ద్వారా బయటికి వెళ్తున్నది. కాగా, జూరాల నుంచి 68,235 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 45,324, హంద్రీ నది నుంచి 3,750 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1,17,309 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. మరో వారంపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, శ్రీశైలంలో మరిన్ని గేట్లు తెరుచుకునే అవకాశం ఉన్నది.

హైదరాబాద్, నల్లగొండకు తీరనున్న నీటి సమస్య..

సాగర్‌కు కృష్ణమ్మ చేరుతుండటంతో రాజధాని హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తాగునీటి సమస్య తీరనుండటంతోపాటు నల్లగొండ జిల్లాకు సాగునీటి సమస్యకు పరిష్కారం లభించనున్నది.
KrishnaRiver2

2201

More News

VIRAL NEWS

Featured Articles