ఇంద్రావతిలో మరో రెండు నక్సల్స్ మృతదేహాలు


Thu,April 26, 2018 02:28 AM

Two more bodies of Naxals recovered from Indravati river

-విస్తృతంగా పోలీసు బలగాల కూంబింగ్
-గడ్చిరోలిలోనే మకాం వేసిన ఉన్నతాధికారులు
-ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న వారికి పతకాలు ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్
maoists
చంద్రాపూర్: మహారాష్ట్ర గడ్చిరోలిలోని ఇంద్రావతి నదిలో బుధవారం మరో రెండు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో రెండు ఎన్‌కౌంటర్లలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 39కి పెరిగింది. కొన్ని శరీర భాగాలు కూడా లభ్యమవడంతో మొసళ్లు తిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ఎన్‌కౌంటర్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. గడ్చిరోలి జిల్లాలోని కాసన్‌సూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్‌కౌంటర్ జరగగా, 16 మృతదేహాలు లభ్యమయ్యాయి. తప్పించుకున్న వారికోసం పోలీసులు వెతగ్గా మంగళవారం ఇంద్రావతి నదిలో 15 మృతదేహాలు లభ్యమై మొత్తం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి సంఖ్య 31కి చేరింది. సోమవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 37గా ప్రకటించారు. తాజాగా బుధవారం ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందులో మహిళా మావోయిస్టు మృతదేహం ఉన్నట్టు సమాచారం. లభ్యమైన కొన్ని శరీరభాగాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు గౌతమి, ఇంద్రావతి నదీతీరాన్ని పోలీస్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇందుకోసం రక్షణశాఖ హెలికాప్టర్‌ను ప్రత్యేకంగా వాడుతున్నారు. గడ్చిరోలి దవాఖానలో భద్రపరిచిన తొమ్మిది మంది మావోయిస్టుల మృతదేహాలను బుధవారం వారి బంధువులకు అప్పగించారు.

కుళ్లిపోయినందుకే గుర్తింపులో జాప్యం: ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్

ఇంద్రావతి నీటిలో కుళ్లినందునే మావోయిస్టుల మృతదేహాల గుర్తింపులో జాప్యమవుతుందని గడ్చిరోలి ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్ తెలిపారు. అడిషనల్ డీజీపీ కనకరత్నం, ఐజీ శరద్ శైలర్, డీఐజీ అంకుష్ షిండే జిల్లాలోనే ఉండి ఎప్పటికప్పుడూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. గడిచిన ఐదేండ్లలో జిల్లాలో 120 మంది మావోయిస్టులు హతమయ్యారని చెప్పారు. ఇప్పటికైనా మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహకారం అందిస్తామని తెలిపారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమవడంతో జిల్లా పోలీస్ బాస్ అభినవ్ దేశ్‌ముఖ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయి రక్షణ, పోలీస్ ఉన్నతాధికారులు ఎస్పీని ప్రశంసిస్తున్నారు.

సిబ్బందికి పతకాలు ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్

ఈ ఎన్‌కౌంటర్‌ను పర్యవేక్షించిన ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్‌కు రాష్ట్ర డీజీపీ మెడల్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో కీలకమైన నలుగురు అధికారులకు రాష్ట్ర శౌర్యపతకాలను ప్రకటించింది. వీరిలో నాయక్ శ్రీనివాస్, జితేంద్ర మార్గటే, మధుకర్ హన్మంతు, గజేంద్ర ఉన్నారు. అలాగే ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 571 మంది సిబ్బందిని మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చేనెల 1న ప్రత్యేకంగా సన్మానించాలని నిర్ణయించింది.

910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS