హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు దోషులకు ఉరి


Tue,September 11, 2018 02:37 AM

Two Gets Death Sentence By NIA Court For Twin Bomb Blast Case

-11 ఏండ్ల తర్వాత అనిక్ షఫీక్ సయ్యిద్,
-అక్బర్ ఇస్మాయిల్ చౌదరికి శిక్షలు
-దోషులకు ఆశ్రయమిచ్చిన నిందితుడు తారీఖ్ అంజుమ్‌కు జీవిత ఖైదు
-తుది తీర్పును వెల్లడించిన ప్రత్యేక కోర్టు
-పరారీలో భత్కల్ సోదరులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/చర్లపల్లి: హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినిపార్కు బాంబు పేలుళ్ల కేసులో దోషులకు రెండో అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు ఉరి శిక్షను ఖరారు చేసింది. దోషులుగా తేలిన అనిక్ షఫీక్ సయ్యిద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరికి ఉరి శిక్షను విధిస్తూ సోమవారం చర్లపల్లి జైలులోని ప్రత్యేక కోర్టు హాల్‌లో న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. శిక్షలు ఖరారు సందర్భంగా ఉదయం దోషులు అనిక్ షఫీక్ సయ్యిద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరితోపాటు నిందితులకు ఆశ్రయం కల్పించిన కేసులో తారీఖ్ అంజుమ్‌ను కోర్టులో హాజరుపరిచారు. శిక్ష ఖరారు చేసే ముందు న్యాయమూర్తి వారి తరఫు వాదనలను విన్నారు. సుదీర్ఘంగా జరిగిన వాదోపవాదాల అనంతరం న్యాయమూర్తి శ్రీనివాసరావు దోషులకు ఉరిశిక్ష, బాంబు పేలుళ్ల నిందితులుగా ఉన్న వారికి ఢిల్లీలో ఆశ్రయం కల్పించినందుకు తారీఖ్ అంజుమ్‌కు జీవిత ఖైదు శిక్షను విధించారు. గోకుల్ చాట్, లుంబిని పార్కు పేలుళ్లు, దిల్‌సుఖ్‌నగర్‌లో పేలని బాంబు కేసుల్లో నమోదైన ఐపీసీ సెక్షన్లతోపాటు అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (చట్టవ్యతిరేక చర్యలు) సెక్షన్‌లో నమోదుచేసిన అభియోగాలపై ఉరి, మిగతా సెక్షన్లలో జీవితఖైదు శిక్ష, రూ.10 వేలు జరిమాన విధించింది. ఈ కేసుల్లో 11 ఏండ్ల తర్వాత తుది తీర్పులో శిక్షలు వెల్లడయ్యాయి.

ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఫారూఖ్ షర్ఫుద్దీన్, సాధిక్ ఇస్రార్ అహ్మద్‌ను కోర్టు సెప్టెంబర్ 4న నిర్దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. ఇతర కేసుల్లో కూడా వీరు నిందితులుగా ఉండటంతో జైలు నుంచి విడుదల కాలేదు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్‌తోపాటు అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్, అనుచరుడు అమీర్ రాజా ఇంకా పరారీలోనే ఉన్నారు.

11 ఏండ్ల కిందట ఏం జరిగిదంటే..

ఆగస్టు 25, 2007 రాత్రి 7:32 గంటలకు లుంబిని పార్కులో, 7:47 గంటలకు గోకుల్ చాట్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. గోకుల్ చాట్ వద్ద 32 మంది, లుంబిని పార్కులో 12 మంది మృతి చెందగా, 68 మంది తీవ్రంగా గాయపడ్డారు. దిల్‌సుఖ్‌నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్డి వద్ద ఓ పేలని బాంబు లభించింది. మొత్తం నాలుగు కేసులను నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆక్టోపస్‌కు బదిలీ చేయడంతో పేలుళ్లకు మొత్తం ఏడుగురు పాల్పడినట్టు తేల్చింది. నిందితులుగా ఏ1-అనిక్ షఫీక్ సయ్యిద్, ఏ2-అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, ఏ3-రియాజ్ భత్కల్, ఏ4 ఇక్బాల్ భత్కల్, ఏ5-ఫారూఖ్ షర్ఫుద్దీన్, ఏ6-సాధిక్ ఇస్రార్ అహ్మద్, ఏ7-అమీర్ రాజాను గుర్తించింది. వీరికి ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజుమ్‌పై ఇదే కేసులో వేరుగా అభియోగాన్ని మోపింది.

దర్యాప్తులో రియాజ్ భత్కల్ గోకుల్ చాట్‌లోని వాటర్‌కూలర్‌పై బాంబు పెట్టగా, అనిక్ షఫీక్ సయ్యిద్ లుంబిని పార్క్‌లో బాంబు పెట్టినట్టు తేలింది. దిల్‌సుఖ్‌నగర్‌లో పేలని బాంబును అక్బర్ ఇస్మాయిల్ చౌదరి ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద పెట్టినట్టు విచారణలో పోలీసులు గుర్తించి ఆధారాలను పొందుపర్చారు. హైదరాబాద్‌లో ఇండియన ముజాహిదీన్ సంస్థ మొదటిసారిగా ఈ పేలుళ్లకు పాల్పడిందని పోలీసులు చార్జిషీట్‌లో వివరించారు. బాంబుపేలుళ్లు జరిగిన మూడేండ్ల తర్వాత పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి చర్లపల్లి జైలులో పెట్టారు. దాదాపు 11 ఏండ్లపాటు సాగిన విచారణలో పోలీసు అధికారులు మొత్తం 286 మంది సాక్షులను విచారించి వెయ్యికిపైగా పత్రాలను ఆధారాల కింద కోర్టులో సమర్పించారు. ఈ కేసు విచారణ గత నెల 27న పూర్తయి తీర్పుకు చేరింది. ఈ నెల 4న ఇద్దరు నిందితులను దోషులుగా, మరో ఇద్దరిని నిర్దోషులుగా తేల్చిన కోర్టు, దోషులకు సోమవారం ఉరిశిక్షను ఖరారు చేసింది.
CASE

అక్బర్ ఇస్మాయిల్ చౌదరి

మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి వృత్తిపరంగా కంప్యూటర్ మెకానిక్. మహారాష్ట్రలోని పుణెకు చెందిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరీ విధ్వంసకర్తలకు డ్రైవర్‌గా పని చేస్తూ సానుభూతిపరుడిగా చలామణి అయ్యాడు. గతంలో ఉగ్రవాదుల సూచనల మేరకు మంగళూరు నుంచి పేలుడు పదార్థాలను సేకరించి పుణె మీదుగా అహ్మదాబాద్, ముంబై ప్రాంతాలకు రవాణా చేశాడు.

అనీక్ షఫీక్ సయ్యిద్

పుణెకు చెందిన అనీక్ మారు పేరు ఖలీద్.. సూరత్, అహ్మదాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఇతడు కీలక పాత్ర పోషించాడు. ఇండియన్ ముజాహిదీన్‌లో సీనియర్ సభ్యుడిగా ముద్రపడ్డాడు. పుణెలో మొబైల్ షాపును నిర్వహించేవాడు. లుంబిని పార్క్‌లో బాంబును పెట్టేందుకు అనీక్ తన పేరును సతీశ్‌గా మార్చుకున్నట్టు దర్యాప్తులో తెలిసింది.

తారీఖ్ అంజుమ్

తారీఖ్ అంజుమ్ కర్ణాటక భత్కల్‌లోని అంజుమన్ కాలేజీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. 1998లో సిమి సభ్యుడిగా చేరి ఉగ్రవాదం వైపు ఆసక్తి చూపాడు. 2001లో రియాజ్ భత్కల్‌తో కలిసి ఇండియన్ ముజాహిదీన్‌లో చేరాడు. కోల్‌కతా దాడిలో తారీఖ్ అంజుమ్ కీలకంగా వ్యవహరించాడు.

అప్పీలుకు వెళ్తాం

గోకుల్ చాట్, లుంబిని పార్కు బాంబు పేలుళ్లు, దిల్‌సుఖ్‌నగర్ పేలని బాంబు కేసుల్లో రెండో అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు దోషులు అనిక్ షఫీక్ సయ్యిద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరికి ఉరిశిక్షను ఖరారుచేసింది. ఉగ్రవాద సానుభూతి పరులకు ఆశ్రయం కల్పించిన కేసులో తారీఖ్ అంజుమ్‌కు జీవిత ఖైదు పడింది. నిర్దోషులుగా తేలిన వ్యవహారంలో కూడా జడ్డిమెంట్ కాపీని పూర్తిగా పరిశీలించిన తర్వాత అప్పీలుకు వెళ్తాం. ఈ జడ్జిమెంట్ నివేదిక ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లిన తర్వాత శిక్షను విధించే తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. ఈ కేసులో దోషులుగా ఉన్నవారు తాము అమాయకులమని, మాకేం పాపం తెలియదని, కావాలని ఇరికించారని, పదేండ్ల నుంచి జైలులో ఉన్నామని శిక్షను తగ్గించాలని కోర్టును కోరారు. వారి వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. నేరం రుజువు కావడంతో వారికి శిక్ష పడింది.
- సురేందర్, చల్లా శేషురెడ్డి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కౌంటర్ ఇంటెలిజెన్స్

2249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles