భట్టి.. ఉట్టిమాటలు కట్టిపెట్టు

Thu,November 14, 2019 03:04 AM

-మిషన్ భగీరథలో ఖర్చుచేసిందే 29వేల కోట్లు..
-50 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది?
-మంత్రి ఎర్రబెల్లి విమర్శ

వరంగల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంపై కాంగ్రెస్ నేతలు ఉనికికోసం ఆరోపణలు చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మిషన్ భగీరథ పథకానికి రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చుచేసిందే రూ.29 వేల కోట్లు అని.. అందులో రూ.50 వేలకోట్ల అవినీతికి ఎలా పాల్పడు తారో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకే తెలియాలని మండిపడ్డారు. భట్టి ఉట్టిమాట లు కట్టిపెట్టాలని హితవుపలికారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రతి పనిని చాలెంజ్‌గా తీసుకొని అమలుచేస్తుంటే కండ్లుకుట్టిన కాంగ్రెస్ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అ న్నారు.

బుధవారం హన్మకొండలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలోనూ అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేయడమే కాంగ్రెస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ దేశంలోనే గొప్ప పథకమని కేంద్రమంత్రులు, అనేక రాష్ర్టాల ముఖ్యమంత్రులు పేర్కొన్నారని.. రెండురోజుల క్రితం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. మిషన్ భగీరథను దేశవ్యాప్తంగా అమలుచేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులకు మాత్రం అవగాహన లేకుండా మాట్లాడటం అలవాటుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గతంలో తాగునీటి బోర్లు వేసేందుకు, బోర్లు, మోటర్ల మరమ్మతులకు ఏటా రూ.4వేల కోట్లు ఖర్చు చేసేవారని, అయినా మంచినీళ్లు అందేవి కాదని.. మిషన్ భగీరథతో ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతం కాదని ఎర్రబెల్లి చెప్పారు.


కష్టపడి పనిచేసినవారికి ప్రోత్సాహకాలు..

ఇటీవల 30 రోజుల్లో గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ విజయవంతమైందని, ఇదేస్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి ఎర్రబెల్లి సర్పంచ్‌లను కోరారు. బాగా పనిచేసినవారికి ప్రోత్సాహకాలుంటాయని, ప్రజలు జీవితకాలం గుర్తుంచుకునేలా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఉపాధి హామీ నిధుల్ని సక్రమంగా వినియోగించుకొని గ్రామాల రూపురేఖలు మార్చేందుకు తోడ్పడాలన్నారు. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లాలోని 50 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు ఒడితెల సతీశ్‌కుమార్, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, జెడ్పీచైర్మన్ సుధీర్‌కుమార్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.

635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles