రవిప్రకాశ్‌కు ఎదురుదెబ్బ


Thu,May 23, 2019 02:12 AM

TV9 Ravi Prakash releases video alleges false cases filed against him

- ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
- చట్టప్రకారం విచారణకు హాజరుకావాలని ఆదేశం


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫోర్జరీ, డాటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేశారని, పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రవిప్రకాశ్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు బుధవారం తిరస్కరించింది. విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు రవిప్రకాశ్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దల్జీత్‌సింగ్ అహ్లూవాలియా వాదనలు వినిపిస్తూ రవిప్రకాశ్‌పై కుట్రపూరితంగా మూడుకేసులు నమోదుచేశారని పేర్కొన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) వద్ద కేసు పెండింగ్‌లో ఉండగా.. అక్కడ వాదనలు వినిపించకుండా దానికి సంబంధించిన అంశాలపై కేసులు పెట్టారని తెలిపారు. తప్పుడు తేదీలతో షేర్ల మార్పిడి, ఫోర్జరీ సంతకాలు తదితరాలన్నీ తప్పుడు ఆరోపణలని పేర్కొన్నారు.

పోలీసుల ఎదుట హాజరైతే అరెస్ట్‌చేసే అవకాశం ఉన్నదని.. ముందస్తు బెయిల్ మంజూరుచేస్తే విచారణకు సహకరిస్తారని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించలేదని, అరెస్ట్‌చేస్తామని కూడా ఎక్కడా చెప్పలేదన్నారు. మొదట జారీచేసిన నోటీసులకు స్పందించకపోవడంతో సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం తమ ఎదుట హాజరై వివరాలు సమర్పించాలని మరోమారు నోటీసులు ఇచ్చారని తెలిపారు. కానీ, రవిప్రకాశ్ తప్పించుకుని తిరుగుతున్నారని, సామాజికమాధ్యమాల్లో అందుబాటులో ఉం టూ నోటీసులకు స్పందించడంలేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, ముం దస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ravi-prakash1

టీవీ9ను ప్రారంభించిందే నేను: రవిప్రకాశ్

టీవీ9ను ప్రారంభించింది తానేనని.. అలాంటి తనపై లోగో ఎత్తుకెళ్లాడని, కొత్త యాజమాన్యం తప్పుడు కేసులు పెట్టిందని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పేర్కొన్నారు. అజ్ఞాతంలోఉన్న ఆయన బుధవారం ఓ వీడియోను విడుదలచేశారు. 15 ఏండ్ల కిందట నేనే టీవీ9 ప్రారంభించా. బయటినుంచి ప్రైవేటు ఈక్విటీ ప్లేయర్‌గా శ్రీనిరాజు ఆర్థికంగా ప్రోత్సాహమిచ్చారు. సంస్థ నుంచి లాభాలతో బయటకు వెళ్లాలనుకుంటున్నానని శ్రీనిరాజు చెప్పారు. నేను అంగీకరించి చాలామందిని కలిశా. ఒక్క రూపాయి ఆశించకుండా ఈ డీల్ (టీవీ9ను షేర్ల విక్రయం) చేద్దామనుకున్నా. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి నన్ను కలిశారు. నలుగురు మిత్రులతో కలిసి, 20% పెట్టుబడి పెడతాం. స్వేచ్ఛగా ఎడిటోరియల్‌ను నడిపే బాధ్యత ఇస్తామన్నారు. తర్వాత శ్రీనిరాజు లాభాలతో బయటకు వెళ్లారు. మెగా కృష్ణారెడ్డి తన స్నేహితులతో కలిసి వస్తారనుకుంటే.. మెజారిటీ వాటాదారుడిగా రామేశ్వరావు టీవీ9 సంస్థ ఏబీసీఎల్‌లో చేరారు. టీవీ9లో మైనార్టీ షేర్ హోల్డర్‌గా ఉన్నానని, ఇద్దరి మధ్య షేర్ హోల్డర్ అగ్రిమెంట్ కావాలని రామేశ్వర్‌రావును అడి గా. నువ్వు ఉద్యోగిగానే పనిచేయాలని.. ప్రతిఘటిస్తే, టీవీ9 నుంచి బయటికి వెళ్లేలా చేస్తానని రామేశ్వర్‌రావు హెచ్చరించారు. అందుకే నామీద మూడు దొంగ కేసులు పెట్టారు.

తీవ్రవాదిలా ఎయిర్‌పోర్టు, నౌకాశ్రయాల్లో అలర్ట్‌లు పెట్టారని తెలుస్తున్నది. శివాజీకి, నాకు మధ్య ఒప్పందంపై ఎన్సీఎల్టీలో కేసు ఉన్నది. రెండోకేసులో రామేశ్వరావు మనుషులే దేవేందర్ అగర్వాల్‌ను కిడ్నాప్ చేశారు. నేను దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని హాస్యాస్పదమైన కేసుపెట్టారు. రామేశ్వర్‌రావు సంతకాన్నో, మెగా కృష్ణారెడ్డి సంతకాన్నో ఫోర్జరీ చేసి వాళ్ల ఆస్తులు కొట్టేసేందుకు ప్రయత్నించానంటే అర్థం ఉండేది. టీవీ9 లోగోను దొంగించుకుపోయానని మూడోకేసు పెట్టారు. అసలు టీవీ9లోగోను సృష్టించిందే నేను. దానిని వినియోగించుకొనేందుకు నాకే రాయల్టీ చెల్లించాలి. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు మైహోం గ్రూప్‌లో ఒకభాగమైనట్టు కనిపిస్తున్నది. దొంగ కేసులు, పోలీసుల వేధింపులు ఉన్నాయిఅని రవిప్రకాశ్ వీడియో లో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో కౌంటర్ మెసేజ్‌లు వైరల్

- టీవీ9ను స్థాపించింది నేనే: శ్రీనిరాజు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ద్వారా టీవీ9ను స్థాపించి నీకు సీఈవోగా ఉద్యోగం ఇచ్చారు. సంస్థ సక్సెస్‌లో వందల మంది కష్టం ఉన్నది. అత్యంత లాభాల్లో ఉన్న సంస్థల సీఈవోలు సంపాదించినదానికంటే ఎక్కువగా టీవీ9 సీఈవోగా నువ్వు సంపాదించావు. బ్యాంకు అకౌంట్ చూసుకో, నిజం నీకళ్లు తెరిపిస్తుంది.

- టీవీ9 లోగో సృష్టికర్తను నేనే: కాపీరైట్ చట్టం నిబంధనల ప్రకారం లోగోను డిజైన్ చేసిన, లేదా చేయించిన వ్యక్తి ఆథర్ అవుతారు. ఉద్యోగిగా కంపెనీ జీతం తీసుకుని నువ్వుచేసిందిదే. లోగోను, కంపెనీ పేరు మీద అసైన్ చేస్తూ ట్రేడ్‌మార్క్, కాపీరైట్ సంస్థల అధికారులకు ఎన్నోఏండ్ల క్రితం నీ అంతట నువ్వే అన్నిపత్రాలు సమర్పించావు. టీవీ9 లోగోలు మొదటి నుంచి ఏబీసీఎల్ పేరుమీదే ఉన్నా యి.. రవిప్రకాశ్ పేరుపై లేవు.

- మెగా కృష్ణారెడ్డి స్థానంలో రామేశ్వర్‌రావు: కొత్తగా టీవీ9 హిందీ ఛానల్ భారతవర్ష్ ప్రారంభించడానికి రూ.70 కోట్ల మూలధనాన్ని రామేశ్వరరావు నుంచి తీసుకున్నప్పు డు అభ్యంతరం లేదు. సంస్థ నిర్వహణలో పారదర్శకత పాటించాలని కోరితే విలువలు గుర్తొస్తున్నాయా? కొత్త డైరెక్టర్లు వస్తే అవకతవకలు బయటపడతాయన్న భయం నీది.

- దేవేందర్ అగర్వాల్ పార్ట్‌టైమ్ ఉద్యోగి: దేవేందర్ అగర్వాల్ టీవీ9 సంస్థలో కంపెనీ సెక్రటరీ హోదాలోఉన్న పూర్తిస్థాయి ఉద్యోగి. కొత్త యాజమాన్యానికి ఫోర్జరీ ఒప్పందాలతో శివాజీతో కలిసి నువ్వు అడ్డంకులు సృష్టిస్తుంటే సంస్థ డైరెక్టర్ హోదాలో ఉన్నవ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్పా?

- భవిష్యత్ తరాలు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి: విలువల గురించి నువ్వు చెబుతున్న మాటలకు సిగ్గేస్తున్నది. టీవీ9 అమ్మకం పూర్తయ్యాక పాతయాజమాన్యం ఉద్యోగులకు పంచాలని, రూ.12 కోట్లిస్తే ఎంతమందికి పంచావో తెలిస్తే.. ఏమాత్రం విలువలు పా టించావో అర్థమవుతుంది. ఇకనైనా గాలి క బుర్లుమాని, చట్టప్రకారం వ్యవహరిం చంటూ ఆ మెసేజ్‌లో సెటైర్లు ఉన్నాయి.

ఏపీలోని రిసార్టులో..!

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఆంధ్రప్రదేశ్‌లోని ఓ రిసార్టులో ఉన్నట్టు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు సమాచారం అందినట్టు తెలిసింది. విజయవాడకు సమీపంలోని ఓ ఖరీదైన రిసార్టులో పదిరోజులుగా ఉంటున్నట్టు సమాచారం. తన ఫోన్లు వాడకుండా ఇతరుల హాట్‌స్పాట్స్ ద్వారా ఇంటర్నెట్‌తో వాట్సాప్‌లో తన సన్నిహితులకు టచ్‌లో ఉంటున్నట్టు తెలిసింది. రవిప్రకాశ్ బుధవారం విడుదల చేసిన వాట్సాప్ వీడియో కూడా రిసార్టులో రికార్డు చేసిందేనని సమాచారం. పోలీసులు రిసార్టును తనిఖీ చేయడానికి సరైన ఆధారాల కోసం వేచి చూస్తున్నట్టు తెలిసింది. తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో రవిప్రకాశ్ అరెస్టుకు లైన్‌క్లియర్ అయ్యిందని చర్చ జరుగుతున్నది. కాగా, రవిప్రకాశ్, శివాజీ కలిసి ఉన్నారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు.

1157
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles