కేంద్రం దృష్టికి పసుపు రైతుల సమస్య

Thu,October 10, 2019 03:21 AM

-పరిష్కారానికి కృషిచేస్తా
-రాష్ట్ర పసుపు రైతుల సంఘం ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: రాష్ట్రంలో పసుపు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తెలిపారు. బుధవారం రాజ్‌భవన్‌లో పసుపు రైతుల సంఘం ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించింది. గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా ఆమెను పసుపురైతు సంఘం ప్రతినిధులు సత్కరించారు. కనీస మద్దతుధర, పసుపు బోర్డు ఏర్పాటుకు చొరవ చూపాలని కోరినట్లు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు అనంతరం మీడియాకు తెలిపారు. పసుపు రైతులు, గల్ఫ్ బాధితులపై ప్రచురించిన పుస్తకాలను గవర్నర్‌కు అందజేశామని వివరించారు. పసుపు రైతుల సమస్యలు తమకు తెలుసునని వాటి పరిష్కారానికి తాను కృషిచేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు నరసింహంనాయుడు వెల్లడించారు.

ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 80 శాతం భారతదేశంలోనే పండుతుందని.. అందులోనూ తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో అత్యధికంగా పండుతుందని గవర్నర్‌కు వివరించామని పేర్కొన్నారు. 2010 డిసెంబర్‌లో క్వింటాల్‌కు రూ.18వేల ధర పలికిన పసుపు 2019లో రూ.4,500 కు పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. గవర్నర్‌ను కలిసినవారిలో నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల సంఘం అధ్యక్షులు పీ తిరుపతిరెడ్డి, నందిపేట పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు నాగలింగం, ఆర్మూర్ పసుపు రైతుల సంఘం అధ్యక్షులు నక్కల చిన్నారెడ్డి, పసుపు రైతుల సంఘం రాష్ట్ర సలహాదారు హన్మాండ్లు , ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమసంఘం సలహాదారులు బాలయ్య , ప్రభాకర్, సామేందర్ ఉన్నారు.

300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles