అప్పుల ఊబిలో ఆర్టీసీ

Mon,November 11, 2019 03:12 AM

-రూ.47 కోట్లతో సమస్య పరిష్కారం కాదు
-సంస్థకు రూ.2209 కోట్ల బకాయిలున్నాయి
-ఐడీ చట్టం ప్రకారం నిర్దిష్ట అధికార సంస్థకు రిఫర్ చేయండి
-యూనియన్లు మొండివైఖరితో వెళ్తున్నాయి
-అయోధ్య తీర్పు సందర్భంగా శాంతిభద్రతలకు తీవ్ర ఆటంకం కలిగించారు
-ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడం.. ప్రజలకు అసౌకర్యం కల్పించడమే యూనియన్ల ఉద్దేశం
-హైకోర్టుకు కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేసిన సీఎస్ ఎస్కే జోషి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. రూ.2209.66 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉన్నదని స్పష్టంచేసింది. ఆగస్టు 31, 2019 నాటికి టీఎస్‌ఆర్టీసీ రూ.5269.25 కోట్ల నష్టాన్ని చవిచూసిందని తెలియజేసింది. సంస్థకు అదనపు ఆదా యం వచ్చే దసరా పండుగను వదులుకొని సమ్మెకు పోయినందువల్ల సంస్థ మరింత నష్టపోయినట్లు వెల్లడించింది. రూ.47 కోట్లతో ఆర్టీసీ సమస్య పరిష్కారం కాదని నివేదించింది. ఆర్టీసీ విషయంపై హైకోర్టులో సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రభు త్వం తరపున ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి అన్ని వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్‌ను సమర్పించారు. టీఎస్‌ఆర్టీసీకి సంబంధించిన ఆర్థిక వివరాలను, ఆర్టీసీ యూనియన్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవను వివరించారు.

సంస్థ మరింత నష్టపోయేలా యూనియన్లు సమ్మెచేస్తున్నాయని తెలిపారు. సంస్థ ఆర్థిక పరిస్థితులు బాగాలేవని తెలిసినప్పటికీ, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు మొండిగా ముందుకు వెళ్తున్నారన్నారు. లేబర్ కమిషనర్ సమ్మె చట్టవ్యతిరేకమని చెప్పినప్పటికీ యూనియన్లు వినిపించుకోలేదని చెప్పారు. శనివారం అయోధ్య తీర్పు నేపథ్యంలో సున్నిత ప్రాంతమైన హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రజల భద్రతను ప్రమాదంలో పడేసేలా వ్యవహరించారని తెలిపారు. ప్రభుత్వం తరపున సమ్మెకు వెళ్లకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సాధ్యం కాని డిమాండ్లను ముందుపెట్టి మొండిగా ప్రవర్తించినట్లు వెల్లడించారు. యూనియన్లు లేవనెత్తిన డిమాండ్లు పారిశ్రామిక వివాదాలకు సంబంధించిన విషయం కాబట్టి ఐడీ యాక్ట్ ప్రకారం నడుచుకునే నిర్దిష్ట అధికారసంస్థకు అంశాన్ని రిఫర్‌చేయాలని హైకోర్టును కోరారు. సీఎస్ జోషి తన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాల వివరాలు..

యూనియన్లకు అన్నీ తెలుసు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత, 10,460 బస్సులతో టీఎస్‌ఆర్టీసీ ఏర్పడింది. జూలై 17, 2012 నాటి సర్క్యులర్ సూచనల ప్రకారం, బస్సులను రిప్లేస్‌చేయాలంటే గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షల కిలోమీటర్లు, నగరాల్లో 13 లక్షల కిలోమీటర్లు లేదా 15 ఏండ్ల కాలం (ఏది ముందు అయితే అది)గా నిర్ణయించారు. ఈ నిబంధన ప్రకారం, 2,609 బస్సులు అత్యవసరంగా రిప్లేస్ చేయాల్సి ఉన్నది. దీనికోసం రూ.750 కోట్ల రూపాయలు ఇప్పటికిప్పుడు కావాలి. మార్చి 2020 నాటికి మరొక 476 బస్సులను రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. కాలం చెల్లిన బస్సులు తక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి. వాటిని నడిపించడం వల్ల భద్రతా సమస్యలు, కాలుష్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంచెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను రిప్లేస్ చేయకుండా తొలగించినట్లయితే.. బస్సుల సంఖ్య తగ్గి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కసారిగాచేయాల్సిన మార్పు కాదు ఇది.

తరుచూ జరగాల్సిన ప్రక్రియ. దీనికి అవసరమైన నిధులను భరించాల్సిన అవసరం టీఎస్‌ఆర్టీసీపై ఉన్నది. సరిపడా వనరులు లేకపోవటం వల్ల ఇది పెద్ద సవాల్‌గా మిగిలిపోతున్నది. దీంతోపాటు తక్షణ, మధ్యతరహా, దీర్ఘకాలిక బాధ్యతలతో కూడిన బకాయిల వల్ల ఆర్టీసీ సతమతమవుతున్నది. 8.11.2019 వరకు ఆర్టీసీకి ఉన్న తక్షణ చెల్లింపులతోపాటు, సంస్థాగత చెల్లింపులకు సంబంధించిన ఆర్థిక వివరాలను సమర్పిస్తున్నాం. పట్టికలో 1- 4 వరకు పేర్కొన్నట్లు ఉద్యోగులకు సంబంధించి రూ.1521.25 కోట్ల బకాయిలున్నాయి. ఆగస్టు 31, 2019 నాటికి టీఎస్‌ఆర్టీసీ రూ. 5269.25 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కార్పొరేషన్‌ను ఇలాగే నష్టాల్లో కొనసాగిస్తే, సంస్థకు ఉన్న రూ. 1786.81 కోట్ల రుణాలను బ్యాంకులకు, ఇతర సంస్థలకు ఎలా చెల్లిస్తారు. యూనియన్లకు ఈ అంశంపై పూర్తి అవగాహన ఉన్నది. తెలియనట్లు నటించలేరు.

ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది..

సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం 01.10.2019 నాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ), ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, ట్రాన్స్‌పోర్టు ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యులుగా ఒక కమిటీని నియమించింది. యూనియన్లతో జరిగిన సమావేశంలో ఈ కమిటీ.. ఆర్టీసీ ప్రమాదకరమైన ఆర్థిక పరిస్థితి, నష్టాల గురించి వివరించింది. దసరా పండుగ నేపథ్యంలో ప్రజలకు కలిగే తీవ్రమైన అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని, సమ్మెకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ యూనియన్లు సమ్మెకు వెళ్లాయి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనంచేస్తామని సూత్రప్రాయంగా అంగీకరిస్తూ రాతపూర్వకంగా ఇవ్వాలని యూనియన్లు డిమాండ్‌చేశాయి. దీన్ని కమిటీ తిరస్కరించింది.

కార్పొరేషన్ భవిష్యత్, ప్రజల సౌకర్యాల గురించి బాధపడకుండా యూనియన్లు సమ్మెకు వెళ్లాయి. 4.10.2019 నాడు జంటనగరాల జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ముందు యూనియన్లు, ఆర్టీసీ యాజమాన్యం తరపు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1971 గురించి అధికారులు చెప్పి, చర్చల ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో సమ్మెకు వెళ్లొద్దని సూచించారు. ప్రభుత్వం కమిటీ కూడా వేసిందని.. జేఏసీ డిమాండ్లపై కమిటీ అధ్యయనం చేస్తున్నప్పుడు సమ్మెకు వెళ్లడం సమంజసంకాదని పేర్కొన్నారు. లేబర్ కమిషనర్ విజ్ఞప్తులను పట్టించుకోకుండా చర్చల ప్రక్రియనుంచి యూనియన్లు అర్ధంతరంగా వెళ్లిపోయి సమ్మెను ప్రారంభించాయి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం, ఎస్మా ప్రకారం సమ్మె.. చట్టరీత్యానేరం.

శాంతిభద్రతలకు ఆటంకం

సుప్రీంకోర్టు అయోధ్య కేసులో తీర్పు ప్రకటించే రోజున యూనియన్లు అవలంబించిన ధిక్కారచర్యలను గమనిస్తే వారి వైఖరి అర్థమవుతుంది. ఆ రోజున దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉంటుందని తెలిసి కూడా జేఏసీ చేపట్టిన చర్యలు పరిస్థితిని మరింత సున్నితంచేశాయి. హైకోర్టు 11న హియరింగ్ ఉంటుందని చెప్పినప్పటికీ ఆగలేదు. సున్నితమైన రాజధాని నగరంలో శాంతి భద్రతలు కాపాడుకోవటంలో పోలీసులు నిమగ్నమై ఉన్న సమయంలో జేఏసీ చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చింది. లా అండ్ ఆర్డర్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి కలిగించి, ప్రజల అభద్రతతో చెలగాటం ఆడుకున్నది.

ప్రత్యామ్నాయ చర్యలను దెబ్బతీశారు

కార్మికులు సమ్మెచేస్తున్న నేపథ్యంలో.. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక సిబ్బంది ద్వారా సేవలను కొనసాగించేందుకు ఆర్టీసీ యజమాన్యం చేసిన ప్రయత్నాలను దెబ్బతీయడానికి యూనియన్లు ప్రయత్నించాయి. తాత్కాలిక సిబ్బందిపై దాడులుచేశారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి ఈ దాడులకు సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియా ద్వారా ప్రచారంచేశారు. దీనికి కారణమైనవారిపై కేసులు కూడా నమోదయ్యాయి.

ఎన్నిసార్లు ఆదుకోవాలి?

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో కీలకమైన నాలుగు డిమాండ్లను పరిష్కరించడానికి రూ.47 కోట్లు ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం కోర్టుపై గౌరవంతో సానుకూల దృక్పథంతో లోతుగా పరిశీలించింది. కానీ ఈ రూ.47 కోట్లతో పెద్ద నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సమస్యను తీర్చలేమని అర్థమైంది. ఇప్పటికే ఆర్టీసీ భారీ నష్టాలలో ఉన్నది. పెద్ద ఎత్తున బకాయిలున్నాయి. కార్పొరేషన్‌ను రక్షించాలంటే ఈ పెద్ద సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. గతంలో సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ప్రస్తుత బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆ సహాయాన్ని విడుదల చేయలేని పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఎన్నిసార్లు సంస్థను ఆదుకునేందుకు ప్రయత్నం చేయగలదన్నది ముఖ్యమైన అంశం.

మరింత నష్టాల్లోకి ఆర్టీసీ

బతుకమ్మ, దసరా, దీపావళి వంటి పండుగ సమయాల్లో సమ్మెకు దూరంగా ఉండాలని ఆర్టీసీ యూనియన్లకు, కార్మికులకు ప్రభుత్వం విజ్ఞప్తిచేసినప్పటికీ యూనియన్లు అక్రమంగా సమ్మెకు వెళ్లాయి. సాధారణ రోజులకంటే ఎక్కువ ఆదాయం వచ్చే పండుగ రోజుల్లో సమ్మెచేశాయి. కార్పొరేషన్ ఆర్థికభారాన్ని తగ్గించే అవకాశం దీని వల్ల కోల్పోవాల్సి వచ్చింది. ఆర్టీసీ ఆర్థిక సమస్యలు ఉద్యోగులకు పూర్తిగా తెలిసినప్పటికీ సమ్మెకు వెళ్లారు. తద్వారా ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మరింత నష్టాల్లోకి వెళ్లింది. పీఎఫ్ బకాయిలను చెల్లించనందుకు 15.11.2019 నాడు తమ ముందు హాజరుకావాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీకి హైదరాబాద్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ నోటీసులు జారీచేసింది. 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి మోటర్ వాహన పన్ను రూ.452.36 కోట్లు చెల్లించాలని రాష్ట్ర రవాణా అథారిటీ నోటీసులు జారీచేసింది. దీంతోపాటు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి ఆర్టీసీ రూ.200 కోట్లు చెల్లించాలని హైకోర్టు సూచించింది. అద్దె బస్సుల ఓనర్ల సంఘానికి రూ.25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ నోటీసు జారీచేసింది.

యూనియన్ల మొండివైఖరి

హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 26 న 21 డిమాండ్లను చర్చించడానికి ప్రభుత్వం యూనియన్లను చర్చలకు పిలిచింది. చర్చలకు వచ్చిన యూనియన్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేయాలన్న డిమాండ్‌పై పట్టుబట్టాయి. అన్ని డిమాండ్లను చర్చించాలన్నాయి. యూనియన్ల మొండివైఖరి వల్ల చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. విలీనం డిమాండ్ చర్చలకు షరతు కాదని హైకోర్టులో సమర్పించిన యూనియన్లు ఆ తర్వాత తమ డిమాండ్లపై వెనక్కు తగ్గేది లేదని, లేదంటే సమ్మె కొనసాగిస్తామంటూ పత్రికల ముందు చెప్పాయి.

67 శాతం వేతనాలు పెంచాం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేండ్లలో రాష్ట్ర రోడ్డు రవాణా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 67శాతం వేతనాలు పెంచడం జరిగింది. కార్పొరేషన్లను ప్రభుత్వంలో విలీనంచేయడం సాధ్యంకాదని చెప్పినప్పటికీ ఇదే డిమాండ్‌ను పదేపదే తీసుకువస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు రవాణ సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటాము.

నిర్దిష్ట అధికార సంస్థకు రిఫర్ చేయండి

ప్రస్తుత ప్రతిష్టంభన అధిగమించడానికి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఈ అంశాన్ని నిర్దిష్ట అధికార సంస్థకు రిఫర్‌చేయాలని కోరుతున్నాము. తద్వారా ఈ వివాదానికి సత్వర పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. యూనియన్లు లేవనెత్తిన డిమాండ్లు పారిశ్రామిక వివాదానికి సంబంధించినవి కాబట్టి.. వాటిని దృష్టిలో ఉంచుకొని తగిన ఉత్తర్వులు జారీచేయాలని కోరుకుంటున్నాము.

ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే..

కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో, ప్రజల అసౌకర్యాలను పట్టించుకోకుండా యూనియన్లు చట్టరీత్యా నేరమైన సమ్మెను తలపెట్టాయి. పండుగలు లేదా పరీక్షలు, ఇతర ముఖ్యమైన వేడుకలరోజు యూనియన్లు ఇలాంటి సమ్మె చేయడం అలవాటుచేసుకున్నాయి. సాధారణంగా యూనియన్ ఎన్నికలు వస్తున్న సమయంలో ఇలాంటి వ్యూహాలను అనుసరిస్తారు. అందువల్ల యూనియన్లు, ఉద్యోగులకు సమ్మెకు వెళ్లడానికి సరైన కారణం ఉండటంలేదు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ సమ్మెచేయడం వెనుక రవాణా నిర్వహణను కష్టతరం చేయడం, తద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చడం వంటి కారణాలే ఉన్నాయి.
TSRTC-BUS

రవాణా అధికారులపై అక్కసు ఎందుకు?

-ఉద్యోగుల నేతను విమర్శిస్తే సహించం
-అశ్వత్థామరెడ్డి ఆరోపణలపై మండిపడుతున్న ఉద్యోగసంఘాలు
-రవాణాశాఖ ఉద్యోగుల సంఘాల సమావేశంలో ఆగ్రహం

ప్రజారవాణాకు ఆటంకాలు రాకుండా ఉండేందుకు రవాణాశాఖ అధికారులు దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ ఆదేశాల మేర కు పనిచేస్తున్నవారిపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఉద్యోగసంఘాలు మండిపడ్డాయి. ఆదివారం రవాణాశాఖతోపాటు.. పలు ఉద్యోగ సంఘాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. రవాణాశాఖ ఎంవీఐ అసోసియేషన్, రవాణాశాఖ గెజిటెడ్ అధికారుల సంఘం, రవాణాశాఖ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం, గ్రూప్-1 అధికారుల సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భం గా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీసీ పాపారావుపై అశ్వత్థామరెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అర్థంలేని ఆరోపణలుచేస్తూ ప్రభుత్వాన్ని, రవాణాశాఖను బద్నాంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రత్యామ్నాయాలు కల్పించడం కనీస బాధ్యత

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజారవాణా సాఫీగా సాగడానికి నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడుపుతున్నామని ఉదోగసంఘాల నేతలు వెల్లడించారు. ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న రవాణాశాఖ అధికారులను వ్యక్తిగతంగా టార్గెట్‌చేసి విమర్శించడం ఆర్టీసీ జేఏసీ నేతలకు తగదని తెలిపారు. రవాణాశాఖలో కిందిస్థాయి నుంచి కమిషనర్ వరకు ఉద్యోగులందరూ ప్రజారవాణాకోసం చేస్తున్న కృషిని గుర్తించాలన్నా రు. సమస్యలకోసం సమ్మెచేస్తే ప్రత్యామ్నాయమార్గాలు కల్పించడం ప్రభుత్వ, అధికారుల కనీస బాధ్యత అని గుర్తుచేశారు. అశ్వత్థామరెడ్డి కార్పొరేషన్ కార్మికుల సంఘం నేత మాత్రమేనన్నారు. రవాణాశాఖ అధికారులు, ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసిన పాపారావుపై విమర్శలుచేస్తే వారికే నష్టమన్నారు. అశ్వత్థామరెడ్డి సమ్మెపేరిట తమ ను బలిచేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు గుర్తిస్తున్నారని, చందాలపేరిట కార్మికుల నుంచి డబ్బులు వసూలుచేసి వాటితో జల్సాలుచేసినట్టు ఇటీవల ముషీరాబాద్ డిపోకు చెం దిన ఓ కార్మికుడు బహిరంగంగా విమర్శలుచేయడం.. ఇదేవిషయాన్ని అశ్వత్థామరెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన విషయాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయని పేర్కొన్నారు.

పాపారావుపై చేసిన ఆరోపణలను అశ్వత్థామరెడ్డి నిరూపించాలని.. లేకుంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. తమశాఖలో అన్నివర్గాల ఉద్యోగుల సంక్షే మం కోసం సంఘం అధ్యక్షుడిగా పాపారావు కృషిచేశారని ప్రశంసించారు. మరోసారి వ్యక్తిగత ఆరోపణలకు దిగితే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ మోటర్ వాహనాల తనిఖీ అధికారుల సం ఘం అసోసియేట్ ప్రతినిధులు, రవాణాశాఖ గెజిటెడ్ అధికారులసంఘం అధ్యక్షుడు పీ రవీంద్రకుమార్, ఎం సురేశ్‌రెడ్డి, శ్రీనివా స్, రవాణాశాఖ ఎస్టీ, ఎస్సీ ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు భద్రునాయక్, అసోసియేట్ అధ్యక్షుడు ఎం కిషన్, ప్రధానకార్యద ర్శి పర్విందర్ రాజు, తెలంగాణ గ్రూప్ -1 అధికారులసంఘం ప్రధాన కార్యదర్శి హనుమంత్‌నాయక్ సమావేశంలో పాల్గొన్నారు.

7569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles