మెరుగ్గా ప్రజారవాణా

Wed,November 20, 2019 02:24 AM

-ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పెరిగిన బస్సులు
-నిరంతరం పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో యాజమాన్యం తీసుకుంటు న్న చర్యలతో ప్రజలు ఇబ్బందుల్లేకుండా రాక పోకలు సాగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని రూట్లలో బస్సులను నడిపించే విధంగా అధికారులు పక్కా చర్యలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల పూర్తిస్థాయిలో బస్సులను నడిపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7 వరకు 6,489 బస్సులు నడవగా, ఇందులో 4,579 ఆర్టీసీ, 1,910 అద్దె బస్సులు ఉన్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం 4,579 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,489 మంది తాత్కాలిక కండక్టర్లు విధులు నిర్వర్తించినట్టు వివరించారు. మంగళవారం 72.51 శాతం బస్సులు నడిచినట్టు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ బస్సులు 1,154, మ్యాక్సీ క్యాబ్‌లు 3,834, హైదరాబాద్ పరిధిలో సెట్విన్ సర్వీసులు 100 నడిపించినట్టు రవాణా శాఖ అధికారులు ప్రకటించారు.

-వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. మంగళవారం తొమ్మిది డిపోల పరిధిలో 703 బస్సులు వివిధ రూట్లలో ప్రజలకు సేవలందించాయి. కరీంనగర్ రీజియన్‌లోని నాలుగు జిల్లాల్లో 476 ఆర్టీసీ, 190 అద్దె బస్సుల చొప్పున 666 బస్సులు నడిపారు. మెదక్ రీజియన్‌లోని మూడు జిల్లాల్లో 526 బస్సులు, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం డిపో నుంచి 136, సత్తుపల్లి డిపోలో 104, మధిర డిపోలో 54 బస్సులు నడిచాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు డిపోల పరిధిలో 223 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. నల్లగొండ జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 276 బస్సులు, సూర్యాపేట డిపో పరిధిలో 101 బస్సులు, కోదాడ డిపో నుంచి 73 బస్సులు ఆయా రూట్లలో నడిచాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 147 బస్సులు ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేశాయి. వికారాబాద్ జిల్లాలో 205 బస్సులు వివిధ ప్రదేశాలకు తిరిగాయి.

-మహబూబ్‌నగర్ జిల్లాలో వంద బస్సులు తొమ్మిదివేల మందికిపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. వనపర్తి డిపో నుంచి 96 బస్సులు, నారాయణపేట జిల్లాలో 92 బస్సులు నడిచాయి. నిర్మల్, భైంసా డిపోల పరిధిలో 304 సర్వీసులతో ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాయి.

బస్సుల మెయింటనెన్స్‌కు ప్రాధాన్యం

సమ్మె కారణంగా తాత్కాలిక సిబ్బందితో నడిపిస్తున్న ఆర్టీసీ బస్సుల రోజువారీ మెయింటనెన్స్‌పై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే సమయంలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు బస్సుల మెయింటనెన్స్‌కు ప్రాధాన్యమిస్తున్నది. బ్యాటరీ, బ్రేకులు, స్టీరింగ్, లైట్స్ తదితర ప్రాథమిక స్థాయికి సంబంధించిన నిర్వహణను దశల వారీగా చేయిస్తూ బస్సులను కండిషన్‌లో ఉంచడానికి డిపో మేనేజర్లు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నది.

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Pashaa
నర్సంపేట,నమస్తేతెలంగాణ: సమ్మెలో ఉన్న వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట డిపో డ్రైవర్ యాకూబ్‌పాషా(52) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌కు చెందిన యాకూబ్‌పాషా 30 ఏండ్లుగా నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్షాల రాజకీయం

-ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల
RTCbuses1
వంగూరు: ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఎలాంటి వేదికలు లేక ఆర్టీసీ సమ్మెను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, వారు కార్మికుల శ్రేయస్సు కన్నా సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకు న్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని రంగాపూర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌కు ఎలాంటి కోపం లేదని, కొంతమంది నేత లు ప్రతిపక్షాలతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని చూడటంతోపాటు కార్మికులను సైతం ఆవేదనకు గురిచేస్తున్నారని గువ్వల మండిపడ్డారు.

547
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles