నెలలో గ్రూప్-1 నోటిఫికేషన్!


Thu,September 13, 2018 12:13 AM

TSPSC Group 1 Notification 2018

-చర్యలు చేపడుతున్న టీఎస్‌పీఎస్సీ.. రాష్ట్రంలో దాదాపు 150 పోస్టులు ఖాళీ
-ఇతర క్యాటగిరీల్లో 850 పోస్టులకు నోటిఫికేషన్ల జారీకి సన్నాహాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపడుతున్నది. నెల వ్యవధిలో నోటిఫికేషన్ జారీచేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. కేంద్రం నుంచి నూతన జోనల్ వ్యవస్థకు అనుమతి లభించడంతో గ్రూప్-1 వంటి పోస్టుల భర్తీకి ఉన్న ఆటంకాలు తొలిగిపోయాయని భావిస్తున్నది. ప్రస్తుతం గ్రూప్-1 క్యాడర్‌లో రాష్ట్రంలో దాదాపు 150 పోస్టుల వరకు ఖాళీ ఉండగా, వాటిలో కొన్ని మల్టీజోనల్ పోస్టులు కూడా ఉన్నాయి. వాటిని శాఖలవారీగా గుర్తించి.. రోస్టర్ పాయింట్ల ఆధారంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను తయారుచేయాల్సి ఉంటుందని కమిషన్‌వర్గాల సమాచారం. గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. దానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. నూతన జోనల్ ప్రకారం నియామక నిబంధనలు తయారైన వెంటనే నోటిఫికేషన్ జారీకి కమిషన్ కార్యాచరణ చేపడుతుంది.

ఇతర క్యాటగిరీల్లోనూ నోటిఫికేషన్లు!
గ్రూప్-1 పోస్టులే కాకుండా ఇతర క్యాటగిరీల్లో మొత్తం 850 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడానికి టీఎస్‌పీఎస్సీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న దాదాపు 1,300 లెక్చరర్ల పోస్టులు, జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1,100 లెక్చరర్ల పోస్టులను భర్తీచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం టీఆర్టీ పోస్టుల ఫలితాలు విడుదల చేయగా, డీఈవోల ఆధ్వర్యంలోనే సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే టీఆర్టీ ద్వారా ఎంపికైన వారందరికీ పోస్టింగ్ ఆదేశాలు జారీచేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.

2200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS