అభ్యర్థి చనిపోతే పోలింగ్ రద్దు


Thu,April 18, 2019 02:01 AM

TSEC Mandal Parishad Elections issued guidelines for conducting

-పోలింగ్‌కు ముందు చనిపోతేనే వర్తింపు
-పోలింగ్ వాయిదాపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయాలు
-పరిషత్ ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ
-జెడ్పీటీసీ అభ్యర్థి వ్యయ పరిమితి రూ.4 లక్షలు
-ఎంపీటీసీ అభ్యర్థికి రూ.1.50 లక్షలు
-జెడ్పీటీసీ స్థానానికి డిపాజిట్:జనరల్ అభ్యర్థులకు రూ.5000.. ఇతరులకు రూ.2500
-ఎంపీటీసీ స్థానానికి డిపాజిట్: జనరల్ అభ్యర్థులకు రూ.2500.. ఇతరులకు రూ.1250

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్థానిక పోరును కేవలం 22 రోజుల్లో పూర్తిచేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల విధులు, మార్గదర్శకాలను ఖరారు చేసింది. పోలింగ్ వాయిదాపై పలు అంశాలను పేర్కొంటూ బుధవారం మార్గదర్శకాలిచ్చారు. పరిషత్ ఎన్నికల పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఓటర్లు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల దగ్గర లైన్లలో వేచిచూడాల్సిన పనిలేకుండా చర్యలు తీసుకోవాలని.. ఐదారురోజుల ముందునుంచే ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, వెంట వెంటనే ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు.

పరిషత్ ఎన్నికల నిర్వహణపై స్టేజ్-1, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల విధులు, బాధ్యతలను ఖరారుచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాల్లో పలు అంశాలను కీలకంగా పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలను నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా అమలుచేస్తున్నట్లు స్పష్టం చేశారు. పోలింగ్‌ను రద్దుచేసే అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. డిపాజిట్ల మొత్తాలను ఖరారు చేశారు. ఎన్నికల్లో ఖర్చుపై తుది నిర్ణయం తీసుకున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి ప్రచార ఖర్చుకు రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి ప్రచార ఖర్చుకు రూ.1.50లక్షల వ్యయ పరిమితిని విధించారు. ఈ ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికల తరహాలోనే.. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు డిపాజిట్ సొమ్మును సమం చేశారు. జనరల్ అభ్యర్థులు జెడ్పీటీసీ స్థానాల్లో రూ.5000, ఎంపీటీసీ స్థానాల్లో రూ.2500 డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.2500, రూ.1250 చెల్లించాలి.

అభ్యర్థి చనిపోతే పోలింగ్ వాయిదా

నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం విధులు, బాధ్యతలను ఖరారుచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. పోలింగ్ వాయిదా, రద్దుపై కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది. ఇదివరలో బరిలో నిలిచిన అభ్యర్థులు చనిపోతే పోలింగ్‌ను రద్దుచేయడమో, వాయిదా వేయడమో ఉండేది కాదు. ప్రస్తుతం ఎన్నికలకు ముందు చనిపోతే పోలింగ్ వాయిదా వేయాలని నిర్ణయించారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత చనిపోతే మాత్రం వాయిదా వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, ఓటరు జాబితా వంటి అతి ముఖ్యమైన ఎన్నికల సామగ్రి పొందనప్పుడు, లేదా దెబ్బతిన్నప్పుడు, నష్టపోయినప్పుడు పోలింగ్‌ను రద్దుచేసే బాధ్యత ప్రిసైడింగ్ అధికారికి ఉంటుంది.

పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగి, పోలింగ్ కొనసాగించే పరిస్థితి లేనప్పుడు, మార్గమధ్యంలో పోలింగ్ సిబ్బంది, అధికారులకు ఆటంకాలు కలిగినప్పుడు, ఇతర ఇబ్బందుల కారణంగా పోలింగ్‌పార్టీలు అందుబాటులో ఉండనప్పుడు, ఇతర హేతుబద్ధమైన కారణాలతో పోలింగ్‌ను వాయిదా వేసే అధికారం ప్రిసైడింగ్ అధికారులకు ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారిగా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి తక్కువకాని గెజిటెడ్ ఉద్యోగులను నియమించనున్నారు. ప్రతి జెడ్పీటీసీ స్థానానికి ఒక రిటర్నింగ్ అధికారి కచ్చితంగా ఉంటారు. ప్రథమ శ్రేణి గెజిటెడ్ స్థాయికి తక్కువ కాకుండా ఉండే ప్రభుత్వ ఉద్యోగి, అధికారిని ఎంపీటీసీ స్థానాలకు రిటర్నింగ్ అధికారులుగా నియమిస్తారు. ప్రతి 3 ఎంపీటీసీలకు ఒక ఆర్వో ఉంటారు. ఎంపీటీసీ స్థానాల రిటర్నింగ్ అధికారులు.. జెడ్పీటీసీ స్థానానికి ఉండే ఆర్వోకు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు.

ఇక ఎంపీటీసీ స్థానానికి ఆర్వోగా ఉండే అధికారికి సహాయకుడిగా సూపరింటెండెంట్ స్థాయి అధికారిని నియమించుకునేందుకు అవకాశం కల్పించారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు రెండు దశల్లో రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులను నియమిస్తున్నట్లు ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో సూచించింది. జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు ఎన్నికల అధికారిగా జేసీ, జెడ్పీ సీఈవో, డీపీవోలు వ్యవహరిస్తారు. డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారిగా ఆర్డీవో, సబ్ కలెక్టర్ ఉండనున్నారు. సహాయ ఎన్నికల అధికారులుగా ఎంపీడీవో, తహసీల్దార్లు వ్యవహరించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసినప్పటినుంచి గుర్తులు కేటాయించేవరకు రిటర్నింగ్ అధికారులదే బాధ్యత.

జనరల్ అభ్యర్థుల డిపాజిట్ రూ.5000.. రూ.2500..ఇతర క్యాటగిరీలకు రూ.2500.. రూ.1250 స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల డిపాజిట్లను ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఒకే రకంగా డిపాజిట్ తీసుకోనున్నారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.2,500 డిపాజిట్‌గా చెల్లించాలి. ఎంపీటీసీ స్థానాలకు పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.1250 డిపాజిట్‌గా చెల్లించాలి. పోలింగ్, లెక్కింపు ప్రక్రియ అనంతరం చెల్లుబాటు అయిన ఓట్లల్లో 8వ వంతు ఓట్లు పొందినవారికే నామినేషన్ సమయంలో డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఇవ్వనున్నారు. అంతకన్నా తక్కువ ఓట్లు వస్తే.. డిపాజిట్ మండల పరిషత్ ఖాతాలోకి వెళ్తుంది.

ఖర్చు పరిమితి జెడ్పీటీసీకి రూ.4లక్షలు.. ఎంపీటీసీకి రూ.1.5లక్ష

1995 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి జెడ్పీటీసీ అభ్యర్థి రూ.2లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1లక్ష ప్రచార ఖర్చు పరిమితిగా ఉండేది. కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018 అమల్లోకి వచ్చిన తర్వాత వ్యయ పరిమితిని పెంచారు. జెడ్పీటీసీ అభ్యర్థి రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.50లక్షలు ఖర్చు పెట్టుకునేందుకు వెసులుబాటు కల్పించారు. బ్యాంకు ఖాతానుంచే ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.

3739
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles