త్వరలో మరో టీఆర్టీ


Tue,February 13, 2018 02:54 AM

TS TRT Teachers Recruitment Test

ఖాళీగా ఉన్న మూడు వేల టీచర్ పోస్టుల భర్తీకి రానున్న నోటిఫికేషన్
పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు.. పాఠశాలల హేతుబద్ధీకరణపైనా దృష్టి
అనంతరం పెరుగనున్న మరికొన్ని పోస్టులు.. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించనున్న శాఖ డైరెక్టర్

telangana-logo
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకోసం త్వరలో మరో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదలచేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 7,892 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల మూడో వారంలో రాత పరీక్షలను నిర్వహించి, ఆ వెంటనే ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం రెండు నెలల్లో ముగిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. దాని తర్వాత వెంటనే మరో టీఆర్టీ నోటిఫికేషన్‌కు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. తదుపరి నోటిఫికేషన్‌లో భర్తీ చేయటానికి అవకాశం ఉన్న మూడు వేల పోస్టులను గుర్తించామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. వీటిని టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేయాల్సి ఉంటుందని తెలిపారు. సర్కారీ పాఠశాలలను బలోపేతంచేసి, ఉత్తీర్ణత శాతం పెంచడం, విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న అన్నిరకాల ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసేందుకు విద్యాశాఖ ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌వరకు పదవీ విరమణ, ట్రాన్స్‌ఫర్, బదిలీలతోపాటు పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ వల్ల మరికొన్ని ఖాళీలు అదనంగా ఏర్పడే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.

వేసవిలోనే రేషనలైజేషన్


వచ్చే వేసవి సెలవులలో ఉపాధ్యాయుల, పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విద్యార్థులకు తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్నారా? అనే విషయాన్ని ఈ ప్రక్రియలో గుర్తిస్తారు. విద్యార్థులకంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉంటే.. అదనంగా ఉండే టీచర్లను పొరుగున ఉండే స్కూళ్లకు బదిలీ చేయనున్నారు. తద్వారా స్కూళ్ల హేతుబద్ధకరణతోపాటు ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియను ఒకే దశలో పూర్తిచేయాలని భావిస్తున్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ, ప్రమోషన్లు, బదిలీలు వంటి పలు రకాల సమస్యలపై చర్చించడానికి ఈ నెల 15న ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ జీ కిషన్ పేర్కొన్నారు.

టీఆర్టీ అభ్యర్థులకు మరోసారి ఎడిట్ ఆప్షన్


తాజా టీఆర్టీ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాల నమోదులో దొర్లిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు చివరిక్షణంలో కూడా టీఎస్‌పీఎస్సీ అవకాశం ఇచ్చింది. ఇప్పటికే రెండు దఫాలుగా ఎడిట్ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న మరోమారు ఎడిట్ చేసుకోవచ్చునని తెలిపింది. రెండు అవకాశాలు ఇచ్చినప్పటికీ.. అభ్యర్థులు పొరపాట్లు చేసినందునే ఈ అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. వివరాలు పూర్తిగా సమీక్షించుకున్న తర్వాతే సబ్‌మిట్ ఆప్షన్ నొక్కాలని, ఈ అవకాశం ముగిసిపోతే ఎట్టి పరిస్థితుల్లో మరో అవకాశం ఇవ్వబోమని స్పష్టంచేసింది. పరీక్ష గడువు సమీపిస్తుండటం, హాల్‌టికెట్లు రూపొందించాల్సిన నేపథ్యంలో వెంటనే తగు జాగ్రత్తలతో సవరణలు చేసుకోవాలని సూచించింది.

4845
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS