త్వరలో పౌల్ట్రీ పాలసీ

Tue,December 3, 2019 04:00 AM

- దేశంలోనే అత్యుత్తమంగా రూపొందించేందుకు అధ్యయనం
- పౌల్ట్రీ ఫాంల రిజిస్ట్రేషన్‌
- పెరటికోళ్ల పెంపకానికి ప్రోత్సాహం
- మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రి తలసాని

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో త్వరలో దేశంలోనే అత్యుత్తమమైన పౌల్ట్రీ పాలసీని తీసుకురానున్నామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఇందుకోసం అన్నిరాష్ర్టాల్లో అధ్యయనం చేయనున్నామన్నారు. సోమవారం పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్‌ కార్యాయంలో పౌల్ట్రీరంగం సమస్యలు, అభివృద్ధిపై తలసాని అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మొదటి సమావేశం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పౌల్ట్రీరంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ చర్చించింది. అనంతరం కమిటీ చైర్మన్‌ తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో పౌల్ట్రీరంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారని తెలిపారు. పశుసంవర్ధకశాఖ ద్వారా పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని, పేద రైతులకు సబ్సిడీపై పెరటి కోళ్ల యూనిట్లను సరఫరా చేస్తామన్నారు. తెలంగాణ ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తిలో దేశంలో 3వ స్థానం లో, బ్రాయిలర్‌ కోళ్ల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసే పౌల్ట్రీ ఫాంలను రిజిస్ట్రేషన్‌ చేసే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న చిన్న, పెద్ద పౌల్ట్రీఫారంల జాబితాను వెంటనే జిల్లాలవారీగా సేకరించాలని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వీ లక్ష్మారెడ్డిని కమిటీ ఆదేశించింది. గుడ్లు, మాంసం వినియోగాన్ని పెంచి, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా పౌల్ట్రీరంగాన్ని అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. పౌల్ట్రీరంగంలో మానవవనరుల అభివృద్ధి ఎంతో అవసరమని.. ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీస్థాయిల్లో పౌల్ట్రీ విద్యను అందజేసేందుకు అనువైన అవకాశాలను అన్వేషించాల్సి ఉన్నదన్నారు. బ్రాయిలర్‌ కోళ్ల పెంప కం హైదరాబాద్‌ చుట్టుపక్కల ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నదని చెప్పారు. పౌల్ట్రీ రంగానికి గోదాముల ఏర్పాటుపై కమిటీలో చర్చిస్తామని తెలిపారు. పౌల్ట్రీరంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని, ఈ నెల 13న మరోసారి సమావేశమవుతామని తలసాని తెలిపారు.

పౌల్ట్రీ రంగానికి జీవం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో సబ్సిడీపై కోళ్ల దాణా, ఇతర సదుపాయాలు కల్పించి అవసానదశలో ఉన్న పౌల్ట్రీ రంగానికి జీవం పోశారని సమావేశంలో పాల్గొన్న పౌల్ట్రీ రంగ ప్రతినిధులు ప్రశంసించారు. గుడ్ల ఉత్పత్తివ్యయం, మార్కెట్‌ ధరల మధ్య వ్యత్యాసం అధికంగా ఉండి రైతులు నష్టపోతున్నారని వారు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, పశుసంవర్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, డైరెక్టర్‌ డాక్టర్‌ వీ లక్ష్మారెడ్డి, రాజేంద్రనగర్‌లోని కోళ్ల పరిశోధన డైరెక్టర్‌ డాక్టర్‌ చటర్జీ, వెటర్నరీ యూనివర్సిటీ డీన్‌ ఎస్‌టీ వీరోజిరావు, అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ రాంచందర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డైరెక్టర్‌ అఖిల్‌కుమార్‌, నాబార్డ్‌ మేనేజర్‌ తేజస్‌ క్షీర్‌సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles