టీఎస్ ఐపాస్ సరికొత్త రికార్డు..


Mon,October 17, 2016 01:47 AM

TS iPASS new record

tsipass
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:టీఎస్‌ఐపాస్ సరికొత్త చరిత్రను సృష్టించింది. కేవలం 15 నెలల స్వల్ప వ్యవధిలో రాష్ర్టానికి 44,539 కోట్ల పెట్టుబడులు సాధించింది. దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న ఈ విధానం కింద ఎనిమిది విడతల్లో 2533 పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులనిచ్చింది. ఈ పరిశ్రమ 1.60 లక్షల మందికి ఉపాధి లభించనుంది. సేవారంగానికి చెందిన పరిశ్రమలతోపాటు తయారీ రంగానికి పెద్దపీట వేయటంతో ఈ రంగంలోనూ భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. విద్యుత్ వంటి మౌలిక రంగాల్లో పెట్టుబడులు రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తుండగా సాంకేతిక రంగంలో ప్రపంచ దిగ్గజాలు రాష్ర్టానికి తరలిరావటం శుభసూచకంగా మారింది. అవినీతి జాడ్యంలేకుండా, ఆలస్యం, అలసత్వానికి ఆస్కారం లేకుండా అమలవుతున్న టీఎస్‌ఐపాస్ దేశంలోనే రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ప్రపంచంలోనే అత్యద్భుతమైన పారిశ్రామిక విధానం అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆశయం ఆచరణరూపం దాల్చింది.

tsipass2
ఈ విధాన రూపకల్పనకు సీఎం విశేష అధ్యయనాలు చేశారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యతనిచ్చారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమకు సైతం నీరందించేలా మిషన్ భగీరథలో పదిశాతం నీటిని కేటాయించారు. విద్యుత కోతలు లేకుండా చేయడమే కాకుండా నాణ్యమైన విద్యుత్‌ను, ఎలాంటి అవాంతరాలు లేకుండా కరెంటు సరఫరాకు అత్యాధునిక స్కాడా విధానాన్ని తీసుకొస్తున్నారు. పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా పార్క్‌లు, సెజ్‌లు, నిమ్జ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రెండు నిమ్జ్‌లకు ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిమ్జ్, వరంగల్ జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా తయారీ రంగానికి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్నారు. రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడానికి మంత్రి కేటీఆర్ దేశ విదేశాల్లోని అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలతో భేటీలు నిర్వహిస్తున్నారు. అమెరికా, సింగపూర్, మలేషియా, శ్రీలంకలో పర్యటనలతో పెట్టుబడుల రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

tsipass1

మేడ్చల్, పెద్దపల్లి, రంగారెడ్డిలదే ఆగ్రభాగం..


రాష్ట్రంలో ఈనెల 11 నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. 10 జిల్లాల స్థానంలో 31 జిల్లాలు ఏర్పాటయ్యాయి. టీఎస్‌ఐపాస్ ద్వారా ఏర్పాటైన పరిశ్రమలను జిల్లాల వారీగా విభజించారు. టీఎస్‌ఐపాస్ ద్వారా 2015 జూన్ నుంచి ఇప్పటి వరకు 2533 పరిశ్రమలు రాష్ర్టానికి వచ్చాయి. ఇందులో మేడ్చల్ జిల్లాకు అత్యధిక సంఖ్యలో పరిశ్రమలు రాగా, అత్యధిక పెట్టుబడులు వచ్చిన జిల్లాగా పెద్దపల్లి నిలిచింది. పరిశ్రమల స్థాపన ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించిన జిల్లాగా రంగారెడ్డికి ఘనత దక్కింది. మేడ్చల్ తరువాత రంగారెడ్డి జిల్లాలో 309, సంగారెడ్డిలో 227 పరిశ్రమలు వచ్చాయి. అతి తక్కువ పరిశ్రమలు వచ్చిన జిల్లాగా హైదరాబాద్ నిలిచింది. ఇక్కడ కేవలం 10 పరిశ్రమలు మాత్రమే వచ్చాయి.

హైదరాబాద్ జిల్లా నివాస ప్రాంతాలతో నిండిఉండటం, స్థలాలు కూడా అందుబాటులో లేకపోవడంతో పాటు కాలుష్య సమస్య వల్ల శివార్లకు పరిశ్రమలు తరలించాలని నిర్ణయించడంతో కొత్తగా ఇక్కడ పరిశ్రమలు రాలేదు. పెట్టుబడుల ఆధారంగా చూస్తే పెద్దపల్లి జిల్లాలో రామగుండం విద్యుత్ ప్రాజెక్టులు, ఇతరత్రా భారీ పరిశ్రమల ఏర్పాటు వల్ల ఇక్కడ అత్యధికంగా రూ.11,010 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులు పరంగా రెండో స్థానంలో కొత్తగూడెం జిల్లా ఉంది. ఇక్కడ రూ.7,351కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక్కడ కూడా విద్యుత్ ప్రాజెక్టులతో పాటుగా ఐటీసీ పెట్టుబడులు రావడంతో ఇది సాధ్యమైంది. ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో రూ.7,152కోట్లు, సంగారెడ్డి జిల్లాలో రూ.4,781కోట్లు, జనగామ జిల్లాకు రూ.3,185కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మేడ్చల్ జిల్లాలో రూ.2,589 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

కొత్త జిల్లాలకనుగుణంగా సాప్ట్‌వేర్..


ఇదిలా ఉంటే అధికారులు టీఎస్‌ఐపాస్ ద్వారా వచ్చిన పరిశ్రమలను కొత్త జిల్లాలకు అనుగుణంగా విభజించారు. పరిశ్రమల స్థాపనకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉండటంతో దానికనుగుణంగా సాఫ్ట్ వేర్‌ను సిద్ధం చేశారు. సంబంధిత జిల్లా సరిహద్దులను గుర్తిస్తూ వివరాలు అప్‌లోడ్ చేశారు. సంబంధిత జిల్లా జనరల్ మేనేజర్ దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. దీని కోసం జీఎంలకు యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌లను కేటాయించారు. ఏ జిల్లాలో ఏ పరిశ్రమకు అనువైన వాతావరణం ఉందో, ఎంత భూమి లభ్యత ఉందో తెలిపే వివరాలను సైతం పుస్తక రూపంలో ముద్రించే ప్రయత్నాలు చేస్తున్నారు.

14 రంగాల్లో పెట్టుబడులు...


రాష్ట్రంలో ఇంతవరకు 14 విభిన్న రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. అధికంగా పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించిన రంగాల్లో విద్యుత్, సోలార్, ఫార్మా, కెమికల్స్, ఆటోమొబైల్, ఐటీ రంగాలు ముందున్నాయి. ప్లాస్టిక్ , రబ్బర్ విభాగాల్లోనూ పెద్ద ఎత్తున వచ్చాయి. విద్యుత్ రంగంలో రామగుండం, మణుగూరు ప్రాంతాలతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కంపెనీలు భారీ సంఖ్యలో ముందుకొచ్చాయి. ఐటీసీ కంపెనీ కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు సిద్ధమైంది. సోలార్, ఆటోమొబైల్, ఆల్కహాల్ తదితర రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రంగాల్లో అత్యధికంగా 52వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని తెలిసింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 22వేల మందికి, ఐటీ రంగంలో 22వేల మందికి, ఫార్మా కెమికల్స్‌లో 20వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన ఏరో స్పెస్ విభాగంలోనూ 1100 మందికి ఉపాధి లభించనుంది.

4085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS