పారదర్శకంగానే మూల్యాంకనం


Tue,April 23, 2019 03:59 AM

TS Intermediate Board Secretary Ashok Gives Clarification On Inter Results Issue

-జవాబు పత్రాలేవీ గల్లంతుకాలేదు
-పొరపాట్లకు కారకులపై చర్యలు
-ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్
-తప్పుచేసినట్టు తేలితే చర్యలు
-విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి
-మూడ్రోజుల్లో త్రిసభ్య కమిటీ నివేదిక

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఇంటర్ ఫలితాలపై వచ్చిన అపోహల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కోరారు. ఏ ఒక్కరి జవాబు పత్రాలూ గల్లంతు కాలేదని స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో కొన్ని పొరపాట్లు జరిగాయని, తప్పుచేసినవారికి మెమో జారీచేయడంతోపాటు జరిమానా విధిస్తామని తెలిపారు. ఇంటర్ బోర్డు పారదర్శకంగానే పనిచేస్తున్నదని స్పష్టంచేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అక్కడక్కడా క్షేత్రస్థాయిలో తప్పులు జరిగాయని, ముగ్గురు విద్యార్థుల మెమోల్లో తప్పులువస్తే వాటిని సవరించామని చెప్పారు. తప్పులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 21 వేల జవాబు పత్రాలు గల్లంతైనట్టు తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, నిజానికి ఏ ఒక్క పేపరూ గల్లంతు కాలేదని స్పష్టంచేశారు. ఏ జవాబుపత్రం అడిగినా చూపిస్తామని చెప్పారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసు పహారా ఉంటుందని, అందువల్ల పేపర్లు గల్లంతయ్యే అవకాశమే లేదని వివరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరీక్షకు హాజరుకానివాళ్లు ఉత్తీర్ణులైనట్టు, హాజరు అయినవారు ఫెయిల్ అయినట్టు జరుగుతున్న ప్రచారం అబద్ధమని కొట్టిపారేశారు.

అనర్హులైన అధ్యాపకులతో మూల్యాంకనం చేయించినట్టు వస్తున్న ఆరోపణలు కూడా నిరాధారాలని చెప్పారు. అర్హులైన బోర్డు అధ్యాపకులతోనే మూల్యాంకనం చేయించినట్టు తెలిపారు. విద్యార్థులు సెంటర్ మారడంవల్లే ఏఎఫ్, ఏపీ వంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయని వివరించారు. ఇంటర్ బోర్డుపై ఈ మధ్యకాలంలో అసత్య ప్రచారం జరుగుతున్నదని అన్నారు. పారదర్శకంగా వ్యవహరించి, నాణ్యతతో కూడిన మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించామని తెలిపారు. ఫలితాలపై వచ్చిన అపోహలను తొలిగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా బోర్డే ఇంటర్ పరీక్షలను చేపట్టే పక్రియలో భాగంగానే గ్లోబరీనా టెక్నాలజీ అనే సంస్థ సేవలు తీసుకున్నామని అశోక్ వెల్లడించారు. 15 ఏండ్లుగా మన్టెక్ ఇన్ఫో సంస్థ సాంకేతిక సేవలు అందిస్తున్నదని, పదిహేనేండ్లుగా ఒకే సంస్థ సేవలందిస్తున్నందున దానిని మార్చాలని టెండర్లు పిలువగా.. గ్లోబరీనా సంస్థ నుంచి టెండర్ వచ్చిందని, నిబంధనలకు అనుగుణంగానే ఆ సంస్థకు టెండర్ కేటాయించామని వివరించారు.

ఆ సంస్థ మూడేండ్లు మాత్రమే ఇంటర్ బోర్డుకు సేవలు అందిస్తుందని, ఆ తర్వాత పూర్తిగా ఇంటర్‌బోర్డే సొంతంగా సాంకేతిక సేవలను సమకూర్చుకుంటుందని తెలిపారు. రీ వాల్యూయేషన్ గడువును పెంచే అంశాన్ని పరిశీలిస్తామని, రీవాల్యూయేషన్లో మారిన మార్కులను విద్యార్థుల ఈమెయిల్‌కు పంపుతామని చెప్పారు. నవ్య అనే విద్యార్థిని విషయంలో చోటుచేసుకున్న పరిణామాలను అశోక్ వివరిస్తూ.. ఓఎంఆర్ షీట్లో మార్కుల స్థానంలో బబ్లింగ్ చేయడంలో పొరపాటు వల్ల 99 మార్కులు వస్తే 0 మార్కులు వచ్చినట్టు వేశారని తెలిపారు. మీడియాలో వచ్చిన కథనానికి స్పందించి వెంటనే జవాబు పత్రం తీసుకొచ్చి చూడగా ఆమెకు 99 మార్కులు వచ్చినట్టు తేలిందన్నారు. ఈ తప్పులకు ఎగ్జామినర్, స్క్రూటినైజర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెంటనే పొరపాటును సరిదిద్ది ఆ విద్యార్థినికి సమాచారం ఇచ్చామని చెప్పారు. బాధ్యులైన వారికి చార్జి మెమోలు జారీచేసి వివరణ కోరామని, వారికి పెనాల్టీ వేస్తామని చెప్పారు. ఏవైనా అనుమానాలు ఉంటే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని అశోక్ సూచించారు.
inter

తప్పుచేసినవారిపై క్రమశిక్షణ చర్యలు: జనార్దన్‌రెడ్డి

ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి బాధ్యులపై కఠిన చర్యలుంటాయని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఫలితాల్లో ఆరోపణలపై తిసభ్య కమిటీ విచారిస్తున్నదని తెలిపారు. మూడ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని జీవో ఇచ్చామని తెలిపారు. సోమవారం ఆయన వివిధ మీడియా సంస్థలతో మాట్లాడుతూ, సిబ్బంది తప్పుచేసినట్టు నివేదికలో తేలితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. తప్పుడు మూల్యాంకనం చేసిన సిబ్బందికి రూ.2 వేలు జరిమానా విధించనున్నట్టు చెప్పారు. ఈ జరిమానాను మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. రీవెరిఫికేషన్లో తప్పు తేలితే ఫీజు తిరిగి చెల్లించే అంశం పరిశీలిస్తున్నామని చెప్పారు. జీవితంలో ఇంటర్ పరీక్షలేమీ ముఖ్యంకాదని, ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సమగ్ర నివేదిక రూపొందిస్తున్నాం: చైర్మన్ వెంకటేశ్వర్‌రావు

ఇంటర్ పరీక్షా ఫలితాల విషయంలో అపోహలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర నివేదిక రూపొందించనున్నామని టీఎస్‌టీఎస్ ఎండీ, కమిటీ చైర్మన్ జీటీ వెంకటేశ్వర్‌రావు చెప్పారు. కమిటీ తొలి సమావేశం సోమవారం నిర్వహించినట్టు నమస్తే తెలంగాణకు తెలిపారు. ఇంటర్ బోర్డ్ నుంచి సమాచార సేకరణలో భాగంగా పలు అంశాలతో కూడిన ప్రశ్నావళిని అందించాం. మంగళవారం వీటికి సమాధానం ఇవ్వాలని కోరాం. బోర్డ్ అవసరాలకు అనుగుణంగా గ్లోబరీనా సంస్థ పనిచేసిందా? ఫలితాల్లో తప్పులు జరుగకుండా వ్య వహరించిందా? సాంకేతిక తప్పిదం ఏమైనా ఉన్నదా? అనే అంశాలపై సైతం వివరణ కోరాం అని వెంకటేశ్వర్‌రావు తెలిపారు. విద్యార్థుల మార్కులకు సంబంధించిన అంశాల్లో అన్నీ సాంకేతిక పొరపాట్ల వల్లే జరిగినవికావని అన్నారు. పరీక్ష నిర్వహించిన సమయంలో బాధ్యత వహించిన కొందరు వ్యక్తులు, కొన్ని మాన్యువల్, కొన్ని సిస్టం ఎర్రర్లు ఉంటాయి. వీటిని సమగ్రంగా ఇవ్వమని కోరాం. నిర్దేశించిన గడువులోగా నివేదిక ఇవ్వనున్నాం అని చెప్పారు.

త్రిసభ్య కమిటీకి మార్గదర్శకాలు

ఇంటర్ ఫలితాల సమయంలో చోటుచేసుకున్న అపోహలను తొలిగించడానికి టీఎస్‌టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీలో హైదరాబాద్ బిట్స్ ప్రొఫెసర్ వాసన్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ నిశాంత్ సభ్యులుగా ఉన్నారు. మూడ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరిన ప్రభుత్వం.. కమిటీకి మార్గదర్శకాలను సోమవారం విడుదలచేసింది. సాంకేతిక సేవలు అందించిన సంస్థ నిబంధనల ప్రకారం వ్యవహరించిందా? సేవలు అందించేందుకు తగు ఉద్యోగులు ఉన్నారా? ఒకవేళ తప్పిదాలు దొర్లితే గుర్తించి, పరిష్కారం చూపించే అవకాశం ఉన్నదా? ఫలితాల వెల్లడి ప్రక్రియలో సదరు సంస్థ నుంచి సాంకేతిక సంబంధమైన తప్పిదాలు దొర్లాయా? ఇంటర్ బోర్డ్ రూపొందించిన నిబంధనల ప్రకారం సాఫ్ట్‌వేర్ పనితీరు ఉందా? ఒకవేళ ఏవైనా తప్పిదాలు దొర్లి ఉంటే భవిష్యత్తులో ఇలాంటివి తిరిగి చోటు చేసుకోకుండా కమిటీ చేసే సూచనలు ఏమిటి? అనే అంశాలు మార్గదర్శకాల్లో ఉన్నాయి.

బోర్డుపై అసత్య ఆరోపణలు

-బోర్డు ప్రతిష్ఠను దిగజార్చుతున్న మధుసూదన్‌రెడ్డి చర్య తీసుకోవాలని టీఈజేఏసీ ఫర్ జస్టిస్ డిమాండ్
బషీర్‌బాగ్: ఇంటర్ ఫలితాలపై నిరాధార ఆరోపణలుచేస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ జస్టిస్ ప్రభుత్వాన్ని కోరింది. 2007 ఇంటర్ ప్రశ్న పత్రాల లీకేజీలో మధుసూదన్‌రెడ్డి ప్రధాన సూత్రధారి అని ఆరోపించింది. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీఈజేఏసీ ఫర్ జస్టిస్ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ ఇస్మాయిల్, వర్కింగ్ కన్వీనర్ వీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. బోర్డు ప్రతిష్ఠను దిగజార్చేలా మధుసూదన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అతనిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఇంటర్‌విద్యలో సంస్కరణలు చేపట్టి, బోర్డును పటిష్ఠం చేసేందుకు బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ కృషిచేస్తున్నారని, ఇందుకుగాను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారని తెలిపారు. సమావేశంలో టీఈజేఏసీ ఫర్ జస్టిస్ కార్యవర్గ సభ్యుడు చిత్రం యాదగిరి, టీజేఎల్‌ఏ అధ్యక్షుడు ఏ వెంకటేశ్వర్లు, సీహెచ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

1858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles