ఇంటర్ ఫలితాలు 27న వెల్లడించండి


Thu,May 16, 2019 02:48 AM

TS Inter Recounting and Re Verification Results To Release On May 27th

-జవాబుపత్రాలు అందుబాటులో ఉంచండి
-ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలపై హైకోర్టు ఆదేశం
-థర్డ్ పార్టీ ఏజెన్సీతో వెరిఫికేషన్ చేయించాం
-హైకోర్టుకు వెల్లడించిన ఇంటర్ బోర్డు
-జవాబు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
-ఈ ప్రక్రియ ముగియగానే సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ ఫలితాలను ఈ నెల 27న విడుదలచేయాలని హైకోర్టు బుధవారం ఇంటర్‌బోర్డును ఆదేశించింది. అదేరోజున విద్యార్థుల సమాధాన పత్రాలను కూడా ఆన్‌లైన్‌లో అం దుబాటులో ఉంచాలని పేర్కొన్నది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని బాలల హక్కుల సంఘం దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని సెలవుకాల ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఇంటర్ బోర్డు తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఆదేశాల మేరకు రీవెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం బుధవారం సాయంత్రంతో పూర్తవుతుందని, గురువారం ఫలితాలు వెల్లడించి, సవరించిన మెమోలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన పొరపాట్లపై నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ సిఫారసుల మేరకు అన్ని చర్యలు తీసుకున్నామని ధర్మాసనానికి నివేదించారు. ఫలితాలను ప్రాసెస్‌చేసిన గ్లోబరీనా సంస్థతో, అదేసమయంలో మరో స్వతంత్ర సంస్థతో కూడా రీవెరిఫికేషన్ చేయించామని తెలిపారు. తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థుల సమాధాన పత్రాలను ఈ నెల 27 నాటికి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వాటిని అప్‌లోడ్ చేయాలంటే కొంతసమయం పడుతుందని నివేదించారు. విద్యార్థులకు ఎలాంటి అనుమానాలు లేకుండా సమాధాన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకుని తామురాసిన జవాబులు, వచ్చిన మార్కుల వంటి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.

జూన్ మొదటివారంలో సప్లిమెంటరీ పరీక్షలు!

ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ మొదటివారంలో సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తామని సంజీవ్‌కుమార్ కోర్టుకు తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఎటువంటి అనుమానాలు తలెత్తకుండా ఒకేరోజు అంటే ఈ నెల 27నే ఫలితాలు విడుదలచేయాలని, వాటితోపాటు సమాధాన పత్రాలను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. సమాధానపత్రాలకు, మెమోల్లో మార్కులకు తేడాలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. రీవెరిఫికేషన్ ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి జరుగాలని ఆకాంక్షించింది. ఫలితాలను ప్రాసెస్‌చేసిన గ్లోబరీనా సంస్థను పార్టీగా చేర్చిన హైకోర్టు.. ఫలితాల వెల్లడిలో నెలకొన్న గందరగోళంపై సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ ఆరో తేదీకి వాయిదా వేసింది.

2312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles