రవిప్రకాశ్ కస్టడీ అత్యవసరం


Wed,June 12, 2019 02:34 AM

Ts high court defers bail

-తప్పించుకుని తిరిగేవారికి బెయిల్ ఇవ్వరాదు
-పోలీసుల తరఫున వాదనలు కొనసాగించిన హరీన్‌రావల్
-బెయిల్ కోరిన రవిప్రకాశ్ లాయర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫోర్జరీ, నిధుల మళ్లింపు తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదావేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. మంగళవారం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ హరీన్ రావల్ పోలీసుల తరఫున వాదనలు కొనసాగించారు. ఎలాంటి నేరాల్లో, ఎలాంటి వారికి బెయిల్ ఇవ్వరాదో తెలుపుతూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం ముందుంచారు. ద ర్యాప్తునకు సహకరించకుండా తప్పించుకుని తిరిగేవారు బెయిల్ ఇవ్వడానికి అనర్హులని పేర్కొన్నారు. విచారణకు హాజరుకాకుండా రవిప్రకాశ్ ఇబ్బందులకు గురిచేశారని.. ఆయ న కోసం పోలీసులు పలు రాష్ర్టాల్లో గాలించాల్సి వచ్చిందన్నారు. రవిప్రకాశ్‌కు చెందిన రెండు సెల్‌ఫోన్లలో ఒకటి బెంగళూరులో ఉన్న ట్టు.. మరొకటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నట్టు చూపించాయని పేర్కొన్నారు.

కంపె నీ సెక్రటరీ అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొన్న హరీన్ రావల్.. అసలు సంతకాన్ని ధర్మాసనం ముందుంచారు. రవిప్రకాశ్ సంభాషణలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కోర్టుకు సమర్పించారు. శివాజీ, రవిప్రకాశ్ కుమ్మక్కయ్యారనడానికి తమవద్ద ఆధారాలు ఉన్నాయని, షేర్ల మార్పిడికి సంబంధించి శివాజీ ఇచ్చిన లీగల్ నోటీసులకు రవిప్రకాశ్ ఇచ్చిన సమాధానం ఒకే న్యాయవాది ప్రిపేర్ చేశారని తెలిపారు. తప్పుడు తేదీతో షేర్ల విక్రయపత్రాలు సృష్టించారని, వీటికి సంబంధించి కంపెనీలో ఎటువంటి రికార్డులు లేవని పేర్కొన్నారు. రవిప్రకాశ్ పవర్‌ఫుల్ మీడియాపర్సన్ అని, దర్యాప్తు ముందుకు సాగాలంటే రవిప్రకాశ్ కస్టడీ అత్యవసరమని చెప్పారు.

హవాలా ద్వారా నిధులు తరలించారు

రవిప్రకాశ్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దిల్జీత్‌సింగ్ అహ్లువాలియా వాదనలు వినిపిస్తూ టీవీ 9 యాజమాన్య మార్పిడిలో పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. టీవీ 9 కొనుగోళ్లకు నిధులను హవాలా ద్వారా తరలించారని పేర్కొన్నారు. దీనిపై రవిప్రకాశ్ ఫిర్యాదు చేసినందునే పోలీసులు వెంటాడుతున్నారని తెలిపారు. టీవీ 9 లోగో సృష్టికర్త రవిప్రకాశ్‌యేనని, కాపీరైట్స్ చట్టం ప్రకారం ఆయనకే సర్వహక్కులు ఉంటాయని వాదించారు. 40 గంటలపాటు ప్రశ్నించిన తర్వాత ఇంకా వారికి ఎలాంటి సమాచారం కావాలని ప్రశ్నించిన అహ్లువాలియా.. అరెస్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఇరుపక్షాల లాయర్ల మధ్య మూడు గంటలపాటు తీవ్రవాదోపవాదలు జరిగాయి. కేసు విచారణకు వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ గండికోట శ్రీదేవి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ప్రకటించింది.

హైకోర్టులో శివాజీ క్వాష్ పిటిషన్

ఏబీసీఎల్ కంపెనీ షేర్ల వివాదంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని నటుడు శివాజీ హైకోర్టును ఆశ్రయించారు. షేర్ల వివాదంలో సైబరాబాద్ పోలీసులు తనపై నమోదుచేశారని, దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రూ.20 లక్షలు చెల్లించి ఏబీసీఎల్‌కు సంబంధించిన 40 వేల షేర్లను కొనుగోలు చేశానని తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు కనీస విచారణ కూడా చేయకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు.

936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles