అద్భుతం.. కాప్ కనెక్ట్


Tue,June 19, 2018 03:24 AM

TS DGP Mahender Reddy launches TS Police Cop Connect App

ఏకకాలంలో 65వేల మందికి సమాచారం
-గ్రూపులుగా, విడిగా సమాచారం చేరవేత
-ఒకేసారి 630 ఠాణాలతో వీడియో కాన్ఫరెన్స్
-తెలంగాణ పోలీసుల వాట్సాప్ యాప్ ప్రారంభించిన డీజీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:వాట్సాప్ గ్రూపులో ఏకకాలంలో 256 నంబర్లకు సమాచారాన్ని పంపొచ్చు! అదే ఏకకాలంలో 65 వేల నంబర్లకు మెసేజ్ చేయగలిగితే? ఒకే యాప్‌లో వేర్వేరుగా 70 గ్రూపులు ఏర్పాటుచేసే అవకాశం ఉంటే! 630 పోలీసుస్టేషన్లతో వీడియోకాన్ఫరెన్స్‌కు నిర్వహించగలిగితే! క్షణాల వ్యవధిలో డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలు పంపుకొనే యాప్ అయితే! దటీజ్ కాప్ కనెక్ట్!! తెలంగాణ పోలీసులు టెక్నాలజీ వినియోగంలో సృష్టించిన విప్లవం. రాష్ట్ర శాంతిభద్రతల ముఖచిత్రాన్ని సమూలంగా
మార్చివేయగల వాట్సాప్ తరహా అద్భుత యాప్ కాప్ కనెక్ట్‌ను డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి సోమవారం తన కార్యాలయంలో ప్రారంభించారు. టెక్నాలజీ వినియోగంలో రాష్ట్ర పోలీసులు అగ్రభాగాన ఉన్నారని మరోమారు చాటారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, కొత్త యాప్ ప్రత్యేకతను వివరించారు. సమాచారం చేరవేయడంలో, పాలనలో ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. మామూలుగా వాట్సాప్ గ్రూప్‌లో 256 నంబర్లను చేర్చే అవకాశం ఉంటుందని, కానీ.. రాష్ట్ర పోలీసుశాఖ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కాప్ కనెక్ట్‌లో ఎన్ని నంబర్లయినా చేర్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖలోని 65,000 నంబర్లు కాప్ కనెక్ట్‌లో ఉన్నాయన్నారు.

ఈ యాప్‌లో వేర్వేరుగా 70 గ్రూపులు ఏర్పాటుచేసుకోవచ్చని చెప్పారు. ఏకకాలంలో 630 పోలీసుస్టేషన్లతో వీడియాకాన్ఫరెన్స్‌కు వీలు కలుగుతుందన్నారు. పోలీసుశాఖలోని రాష్ట్రస్థాయి మొదలు.. జిల్లా, కమిషనరేట్, జోనల్, సబ్ డివిజనల్, సర్కిల్ పోలీసుస్టేషన్ల స్థాయిలో ప్రత్యేకంగా గ్రూప్స్ ఉన్నాయని వివరించారు. అంతేకాకుండా, ఈ యాప్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోలింగ్ అధికారులు, రిసెప్షన్ అధికారులు, స్టేషన్ హౌస్‌ఆఫీసర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీలు, డీసీపీలు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ప్రత్యేక గ్రూపులు వేర్వేరుగా ఉంటాయని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఎన్ని నంబర్లయినా యాడ్ చేసేందుకు, ఎన్ని గ్రూపులైనా ఏర్పాటుచేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రత్యేకంగా పోలీసు శాఖలోనే సర్వర్‌కూడా ఏర్పాటుచేసినందున పూర్తి సమాచారం భద్రంగా ఉంటుందని చెప్పారు. పాలనపరంగాకూడా కాప్ కనెక్ట్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఒక పోలీసుస్టేషన్ మరో పోలీసుస్టేషన్‌తో, ఒక అధికారి మరో అధికారితో చాటింగ్ ద్వారా సమాచారం చేరవేసుకోవచ్చన్నారు. గ్రూప్ చాట్‌తోపాటు.. ఫొటోలు, ఆడియో, వీడియో, పత్రాలను ఒకరికొకరు పంపించుకోవచ్చని తెలిపారు. ఏదైనా ఘటన జరిగిన సమయంలో ఈ యాప్ ద్వారా దగ్గరలో ఉన్న పెట్రోలింగ్ సిబ్బందిని గుర్తించి, సమాచారం అందించవచ్చని చెప్పారు. అదేవిధంగా శాఖాపరిపాలనకు సంబంధించిన సమాచారం, కొన్ని ముఖ్య సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను చేరవేయడం కూడా సులభమవుతుందన్నారు


mahendar-reddy1

ఇక క్షణాల్లో సమాచార మార్పిడి


ఇప్పటివరకు ఏదైనా సమాచారం చేరవేయాలన్నా, డాక్యుమెంట్లు పంపించాలన్నా కనీసం 24 గంటల సమయం పట్టేదని డీజీపీ తెలిపారు. ఇప్పటివరకు ఉన్న వాట్సాప్ విధానంద్వారా ఒక గ్రూప్‌లో 256 మందికి మాత్రమే సమాచారం పంపించగలిగేవాళ్లమని చెప్పారు. కాప్ కనెక్ట్ యాప్‌తో ఏకకాలంలో డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు క్షణాల్లో ఎంతమంది అధికారులకైనా చేరవేసే అవకాశం కలుగుతుందని, ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా సమాచారం పంపే అవకాశం కూడా కాప్ కనెక్ట్‌లో ఉందని తెలిపారు. సమాచారాన్ని క్షణాల్లో పంపించడంతోపాటు ఆ తర్వాత పురోగతిని కూడా పరిశీలించవచ్చని అన్నారు. దీంతో సిబ్బందిలో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. ఈ యాప్ ద్వారా సిబ్బంది పనితీరును కూడా గుర్తించి, వారి నైపుణ్యతను పెంచుకునే అవకాశం ఉందన్నారు.

ఒత్తిళ్లు తగ్గితేనే పనులు సులభం


శాఖాపరంగా అంతర్గత ఒత్తిళ్లను తగ్గించుకున్నప్పుడే సిబ్బంది సులభంగా పనులుచేస్తారని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే ఇంటర్నల్ కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఈ యాప్‌తో సిబ్బందితో పారదర్శకతతోపాటు బాధ్యత కూడా పెరుగుతుందని, అంతకంటే ముందు కమ్యూనికేషన్‌పరంగా ముందంజలో ఉంటారని చెప్పారు. తెలంగాణ పోలీసుశాఖ ఒక విజన్‌తో ముందుకు వెళుతున్నదని డీజీపీ తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో సిబ్బంది ఒత్తిడికి గురికాకుండా చేస్తూ, పనుల్లో వేగం పెంచుతున్నట్టు చెప్పారు. ప్రజలకు వేగవంతంగా నాణ్యమైన సేవలు అందిస్తామన్నారు. ఈ యాప్ ద్వారా కమ్యూనికేషన్ వృద్ధిచెందడంతోపాటు సిబ్బంది చురుకుగా (క్విక్ రెస్పాన్స్) స్పందిస్తారని తెలిపారు. ప్రజలు కూడా పూర్తి భద్రత, రక్షణలో జీవిస్తారని చెప్పారు. తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా మార్చే విజన్‌తో ముందుకు వెళుతున్నట్టు డీజీపీ తెలిపారు. ప్రజలు కూడా ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీసు అధికారులు జితేందర్, రవిగుప్తా, సౌమ్యామిశ్రా, రాజీవ్త్రన్, గోవింద్‌సింగ్, శివధర్‌రెడ్డి, నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, బాలనాగదేవి తదితరులు పాల్గొన్నారు.

దుర్వినియోగం చేస్తే కఠినచర్యలు: డీజీపీ


రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన తెలంగాణ కాప్ కనెక్ట్ యాప్‌ను ను దుర్వినియోగం చేస్తే శాఖాపరంగా చర్యలు తప్పవని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ యాప్‌లో పోలీస్‌శాఖలో వివిధస్థాయిల్లో పనిచేస్తున్న 60,000 మంది అధికారులు, సిబ్బంది ఉన్నారన్నారు. శాఖపరంగా కీలకసమాచారం కూడా యాప్‌ద్వారా చేరవేస్తామన్నారు. ఉద్యోగులు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని కేసులను సులభంగా చేధించేందుకు ఈయాప్‌ను రూపొందించినట్టు తెలిపారు. ఈయాప్‌ను ఉపయోగించుకొని వృతిపరమైన నైపుణ్యాలను పెంచుకున్నవారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.

2042
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS