ప్రజాతీర్పు శిరోధార్యం


Fri,May 24, 2019 03:56 AM

TRS Working President KTR Press Meet About Lok Sabha Election Results 2019

-మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌కే కట్టబెట్టారు
-ప్రజలకు అంకితమై పనిచేస్తాం
-ప్రజాస్వామ్యంలో ప్రజలను మించిన బాస్‌లు లేరు
-తెలంగాణ ప్రయోజనాలపై ఎవరితో కొట్లాడటానికైనా సిద్ధం
-ఎన్నికలపై పార్టీలో సమీక్షిస్తాం
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు శిరోధార్యమని, రాష్ట్రంలో ప్రజలు మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌కు పట్టంకట్టారని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మించిన బాస్‌లు లేరని చెప్పారు. ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజలకు అంకితమై నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకొంటామని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో గురువారం సాయంత్రం ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గోపీనాథ్, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌టీఎస్ చైర్మన్ రాకేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రజలు మరోసారి మెజార్టీ స్థానాలు కట్టబెట్టి హక్కులు సాధించుకొనే బాధ్యతను తమపైనే పెట్టారని కేటీఆర్ చెప్పారు. మెరుగైన ఫలితాలు రావాలని ఆశించామని.. 16 స్థానాల్లో గెలువడానికి టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారని తెలిపారు. తీవ్రమైన ఎండలోనూ రాష్ట్రమంతటా తిరిగామని, ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోదీకి పార్టీ తరుఫున శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారని తెలిపారు. ఇంత పెద్ద ప్రక్రియను నిర్వహించడం కష్టతరమే అయినప్పటికి దిగ్విజయంగా పూర్తి చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి కితాబునిచ్చారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కు తొమ్మిది స్థానాలు ఇచ్చారని, మిత్రపక్షం ఎంఐఎంను ఒక స్థానంలో గెలిపించారన్నారు.

మిగిలిన ఏడు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ గెలిచాయన్న కేటీఆర్.. గెలిచిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను అభినందించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి అఖండమైన మెజార్టీని కట్టబెట్టారని.. ఇప్పుడు మెజార్టీ స్థానాలు అప్పగించారు కాబట్టి ఈ బాధ్యతను కూడా సవ్యంగా నెరవేరుస్తామన్నారు. రాబోయే నాలుగున్నరేండ్లు ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తామన్నారు. టీఆర్‌ఎస్ విజయంకోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, ఓట్లు వేసిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఏపీలో జగన్మోహన్‌రెడ్డికి, ఒడిశాలో ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నవీన్ పట్నాయక్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు అత్యంత సహజమని, ఓడిపోయినవారిని కించపరిచేవిధంగా మాట్లాడబోమని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, రాష్ట్ర కార్యవర్గం, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కూర్చొని చర్చించుకొంటామన్నారు. మెరుగైన ఫలితాలను ఆశించినప్పటికీ, కొన్నిచోట్ల భిన్నంగా ఫలితాలు రావడానికి కారణాలేమిటన్నది విశ్లేషించుకోవాల్సి ఉందని తెలిపారు. పక్క రాష్ట్రాలతో ప్రేమగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని, ఎవరితోనూ తమకు వ్యక్తిగత తగాదాలు లేవని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల విషయానికి వస్తే ఎవరితోనైనా కొట్లాడటానికి సిద్ధమని స్పష్టంచేశారు.
KTR1

ప్రధాని, జగన్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించినందుకు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌చేశారు. దేశ ప్రజలు నిర్ణయాత్మకమైన ఆదేశాలు ఇచ్చారు. ఎన్డీఏను సమగ్రమైన విజయం దిశగా నడిపించినందుకు ప్రధాని మోదీ, అమిత్‌షాకు అభినందనలు అని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందనలు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో గెలుపొందిన జగన్‌ను ట్విట్టర్‌లో కేటీఆర్ అభినందించారు. ప్రజల దీవెనల రూపంలో జగన్ కష్టం ఫలించిందన్న కేటీఆర్.. సోదర రాష్ట్ర పరిపాలనలో మంచి జరుగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు అభినందనలు తెలిపారు.

4158
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles