మా ఆలోచన దేశం కోసం


Sun,December 16, 2018 02:18 AM

TRS Working President KTR First Meeting At Somajiguda Press Club

-తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు ఫ్రంట్ ఎత్తుగడలు
-జాతీయ రాజకీయాలపై చాలా సీరియస్‌గా ఉన్నాం
-రాష్ట్రం నుంచే ఢిల్లీలో చక్రం తిప్పుతాం
-మీట్ ది ప్రెస్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
-కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం
-తెలంగాణలోని ప్రయోజనాలను దేశ ప్రజలందరికి అందిస్తాం
-పాజిటివ్ ఓటుతో గెలిచాం
-రాష్ట్రంలో 47% ప్రజలు మావైపే
-ప్రజలపై మా విశ్వాసం అద్భుత విజయాన్ని ఇచ్చింది
-మరో 15 ఏండ్లు తెలంగాణకు కేసీఆరే సీఎం
-అన్నార్తులు లేని సమాజంగా తెలంగాణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశ ప్రయోజనాల కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారని.. చంద్రబాబు మాత్రం తెలుగుదేశం పార్టీని రక్షించుకొనేందుకే ఫ్రంట్ ఎత్తుగడలు వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. బీజేపీని బూచిగా చూపి చంద్రబాబు ఫ్రంట్ రాజకీయం నడుపుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు పొందిన సంక్షేమ అభివృద్ధి ఫలాలను దేశ ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని వెల్లడించారు. మరో పదిహేనేండ్లపాటు కేసీఆర్ ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండాలని తనతోపాటు ఎమ్మెల్యేలు, ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఓ గల్లీ లీడర్ అని.. ఆయన ఎప్పటికీ జాతీయ నాయకుడు కాలేరని ఎద్దేవాచేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయని జోస్యం చెప్పారు. సంక్షేమంలో, అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలువనున్నదని అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్‌లో కేటీఆర్.. రాష్ట్రం మొదలుకొని జాతీయస్థాయి రాజకీయాలవరకు, పార్టీ అంశాల నుంచి సామాజిక, ఆర్థిక అంశాల వరకు విశ్లేషణాత్మక సమాధాలిచ్చారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఎన్నికల ఫలితాల తరువాత మళ్లీ ప్రెస్‌క్లబ్‌కి వస్తానని చెప్పా. గెలిస్తే మీ ముందుకొచ్చి మాట్లాడుతా, లేకుంటే కెమెరాల ముందుకే రానని చెప్పా. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో.. నాలుగేండ్లుగా పాలనలో సహకరించినందుకు ధన్యవాదాలు. చిరస్మరణీయ విజయాన్ని అందించినందుకు టీఆర్‌ఎస్ కుటుంబసభ్యుడిగా, కార్యకర్తగా నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జీవించి ఉన్నంతవరకు మరచిపోలేనంత మంచివిజయాన్ని అందించిన ప్రజలకు రుణపడి ఉంటా. తెలంగాణలోని అన్ని రాజకీయపక్షాలు ఒకవైపు.. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ మరోవైపు నిలబడితే.. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ను తమ గుండెల్లో ఎంతగా ప్రతిష్ఠించుకున్నారో ఈ తీర్పుద్వారా వెల్లడయింది. సీఎం కేసీఆర్‌తో ప్రజలకు ఉన్న పేగు బంధం ఆవిష్కృతమైంది. పోలింగ్‌లో పాల్గొన్న రెండుకోట్ల మందిలో 47 శాతం అంటే 98 లక్షల మంది టీఆర్‌ఎస్‌కు ఓటేసి వెన్నుదన్నుగా నిలబడ్డారు. ద్వితీయస్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి దాదాపు 42 లక్షల ఓట్ల అంతరం ఉంది. మరో జాతీయపార్టీ బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇది అసాధారణమైన విజయమనడానికి ఈ కొలమానం చాలు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మొదలుపెడితే మారుమూల ప్రాంతం వరకు 88 స్థానాల్లో విజయం అందించిన తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రుణపడి ఉంటాం.
KTR2

వారసత్వం ఓ ఎంట్రీపాస్ మాత్రమే..

ఎవరికైనా ఏ రంగంలోనైనా వారసత్వం కేవలం ఎంట్రీపాస్ మాత్రమే. అందులోకి వచ్చాక నిరూపించుకోవాల్సి ఉంటుంది. 12 ఏండ్లుగా పార్టీలో పనిచేస్తున్నా. సీనియారిటీ ప్రకారమే నాయకత్వం ఇవ్వాలంటే రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అర్హుడు కాలేడు కదా. సేవ చేయగల సామర్థ్యం బట్టే బాధ్యతలు ఇస్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా లేని టీఆర్‌ఎస్‌ను 99 స్థానాల్లో గెలిపించాం. మాకు వ్యతిరేకంగా అన్నిపార్టీలు ఏకమైనా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని 29 మంది ఎమ్మెల్యేల్లో 18 స్థానాల్లో గెలిచాం. నాకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తా. సామర్థ్యాన్ని బట్టే మా నాయకుడు నాకు బాధ్యతలు అప్పగించారు. నా కంటే సమర్థులైనవారెందరో పార్టీలో ఉన్నారు. ఎవరికి ఏమి బాధ్యతలు ఇవ్వాలనేది కేసీఆర్‌కు తెలుసు. పార్టీ నాకిచ్చిన బాధ్యతలను నేను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి నావంతు కృషిచేస్తా. ఎప్పుడైనా ఏ వ్యవస్థలోనైనా ఒక వ్యక్తి కేంద్రీకృతం కారాదు. వ్యక్తి కేంద్రీకృతమయితే వ్యవస్థకు నష్టం జరుగుతుంది. వ్యక్తి ఉన్నా లేకున్నా వ్యవస్థ దెబ్బతినరాదు. మార్పు కావాలంటే వ్యవస్థను మార్చాలి. వ్యక్తిమీద వ్యవస్థను నడుపడం కాదు. మేం వ్యవస్థను పటిష్ఠం చేశాం. వందేండ్ల వరకు ప్రజలకు ప్రతిఫలం అందాలంటే వ్యవస్థను బాగుచేయాలని కేసీఆర్ ఆలోచించారు.

పార్టీని మరింత బలోపేతం చేయాలంతే..

పార్టీకి ఇప్పటికే సంస్థాగతమైన నిర్మాణ ఉన్నది. క్షేత్రస్థాయిలోనూ పటిష్ఠంగా ఉన్నది. కాబట్టే విజయాలు సాధిస్తున్నాం. ఎలాంటి ప్రతికూలతనైనా అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇటీవల ఎన్నికల్లో ఎన్ని అపోహలు సృష్టించినా పార్టీ కార్యకర్తలు విజయవంతంగా తిప్పికొట్టారు కాబట్టే గెలుపొందాం. అయితే, మారుతున్న కాలానికనుగుణంగా ఇంకా మారాల్సి ఉన్నది. సోషల్ మీడియా ప్రాముఖ్యం పెరిగిన తర్వాత చాలారకాల దుష్ప్రచారాలు ప్రజలకు చేరుతున్నాయి. వాటికనుగుణంగా కార్యకర్తలకు పార్టీ నాయకత్వం ఇచ్చే సందేశాలు, ఆదేశాలు చేరవేయడం వంటివి చేయాలి. కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ లేకుండా చేయడం, వారిద్వారా ప్రజల్లో అపోహలను తరిమికొట్టడం చేయాలి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాల్సింది పార్టీ కాబట్టి.. పార్టీ ఇచ్చే సందేశాన్ని సరైన విధంగా ప్రజలకు చేరవేసేందుకు ఒక మాధ్యమాన్ని రూపొందించాల్సి ఉంది. సంస్థాగతంగా పటిష్ఠమంటే బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్ఠపర్చడం. అట్లా నిర్మాణం జరిగినప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ గెలుస్తాం. మున్సిపల్, జిల్లా, మండల పరిషత్, లోక్‌సభ.. ఏ ఎన్నికలైనా విజయం సాధిస్తాం. అన్ని గెలిచి టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు... తిరుగులేని రాజకీయశక్తి అని నిరూపిస్తాం. ఆ విధంగా టీఆర్‌ఎస్ పార్టీని మలచాలనేది నా వ్యక్తిగతమైన లక్ష్యం. ఆ ప్రక్రియలో అన్నిస్థాయిల్లో లక్షలాది మందికి కొత్తగా అవకాశాలు వస్తాయి. ఆ దిశగా మాకు మంచి అవకాశాలున్నాయి. వందేళ్లు పార్టీ పటిష్ఠంగా ఉండాలంటే పార్టీలో యువతకు పెద్దపీట వేయాలి. పార్టీని వారి చేతుల్లో పెడితే వారే కాపాడుకుంటారు.

వచ్చింది శబ్ద విప్లవమే..

KTR4
రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఉన్నదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ చెప్తుండేవారు. కానీ, ఓట్ల డబ్బాలు తెరిచిన రోజు వచ్చేది శబ్ద విప్లవమేనని.. ఆ శబ్దానికి గూబ గుయ్యిమంటదని అప్పుడే చెప్పా..అదే రుజువైంది. గెలిచిన తర్వాత విర్రవిగడమనేది మంచిది కాదు. కానీ మా అంచనాలు, ప్రజలపై మేం పెట్టుకున్న విశ్వాసం ఒక అద్భుతమైన విజయాన్ని అందించింది. నాలుగింట మూడువంతుల సీట్లు సీట్లు గెలిచాం. ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నింటినీ అమలుచేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. పార్టీలో ఉన్న లక్షల మంది కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో పోరాటం చేయడం వల్లనే ఈ రోజు టీఆర్‌ఎస్‌కు ఘన విజయం దక్కింది. ఇంతటి సైన్యం ఉన్న పార్టీని ఇంకా పటిష్ఠమైన శక్తిగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అధినాయకత్వంపై ఉన్నది. అదే సమయంలో టీఆర్‌ఎస్ జాతీయస్థాయిలోనూ ప్రధానమైన పాత్ర పోషించాలని ఇటు ప్రజలు, అటు పార్టీ కోరుకుంటున్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌పై పనిభారాన్ని తగ్గించేందుకు ఒక గురుతరమైన నాకు బాధ్యత అప్పజెప్పారు. అందుకు పాదాభివందనం చేస్తున్నాను.

కేంద్రంలో ప్రాంతీయపార్టీలదే హవా..

తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం కనబర్చినా.. మధ్యప్రదేశ్‌లోగానీ, రాజస్థాన్‌లోగానీ ఇతరుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన పరిస్థితి. పోలింగ్ సరళి, ఆ రాష్ట్రంలో ఫలితాలపై జాతీయస్థాయిలో జరుగుతున్న విశ్లేషణలను గమనిస్తే.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్ గానీ స్వతహాగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని స్పష్టంగా కనబడుతున్నది. పలు రాష్ర్టాల్లో ప్రాంతీయపార్టీలే అధికారంలో ఉన్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే టీఆర్‌ఎస్ 15 ఎంపీ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఒక్క ఖమ్మం స్థానంలో మాత్రమే వెనుకబడి ఉన్నాం. మళ్లీ ప్రజల ఆశీర్వాదం ఉంటే 16 పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకుంటాం. జయశంకర్‌సార్ ఎప్పుడూ ఒకమాట అంటుండే వారు.. తెలంగాణ ఉద్యమ సమయంలో యాచించి కాదు.. శాసించి సాధించుకోవాలని. తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి 16 పార్లమెంట్ స్థానాలు టీఆర్‌ఎస్‌కు కట్టబెడితే ప్రధాని ఎవరు కావాలి.. దేశంలో ఏ రకమైన పథకాలు అమలుకావాలి అనేది నిర్ణయిస్తాం. దేశంలో ఇంటింటికీ తాగునీరు, 24 గంటల కరంటు రావాలంటే టీఆర్‌ఎస్ కేంద్రంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండాలి.

పత్రికా స్వేచ్ఛను సమీక్షించుకోవాలి

KTR6
నాలుగు స్తంభాలమీద ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందులో మీడియా కూడా ఉన్నది. రాష్ట్రంలో ప్రతిపక్షం బలంగాలేని సమయంలో మీడియా తన పాత్రను సమర్థంగా పోషించాలి. రాష్ట్రంలో చాలామంది హంగ్ వస్తుందన్నారు. కానీ, తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని కేసీఆర్ చెప్పినట్టే జరిగింది. ప్రతిపక్షం గట్టిగా లేని ఈ సమయంలో మీడియా ఎన్నికల సమయంలో వ్యవహరించినట్టు కాకుండా పాజిటివ్ పాత్ర పోషించి వాస్తవాలను చూపించేవిధంగా పనిచేయాలి. ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి.. ప్రజలను అయోమయానికి గురిచేసే మూర్ఖపు ప్రయత్నం చేయవద్దని మీడియా సంస్థలకు విజ్ఙప్తిచేస్తున్న.. పత్రికాస్వేచ్ఛ పేరుతో శృతిమించి వ్యవహరిస్తున్న కొన్ని మీడియా సంస్థలు తమ వైఖరిని సమీక్షించుకోవాలి. మీడియాకు తెలంగాణలో కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. దానిని దుర్వినియోగం చేసుకోవద్దని కోరుతున్నా. తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న చిన్న పత్రికలైనా వాటిని కాపాడుకునే దిశగా చర్యలు తీసుకుంటాం. టీఆర్‌ఎస్ ఇద్దరు పాత్రికేయమిత్రులను శాసనసభకు పంపింది. గతంలో ఆర్ సత్యనారాయణను ఎమ్మెల్సీ చేశాం. కేశవరావు గారు సైతం జర్నలిస్టే. జర్నలిస్టులకు వైద్యం, ఇండ్లస్థలాల కోసం చిత్తశుద్ధితో కృషిచేస్తా.

దేశానికే దిక్సూచి.. అభివృద్ధిలో నమూనా

అభివృద్ధి. మౌలిక వసతుల కల్పన, సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి పనులుచేస్తే ప్రజలు కూడా గుర్తిస్తారనడానికి తెలంగాణ ఒక మోడల్. తెలంగాణలో ఆకలిచావులు లేకుండా చేశాం. రైతులు, నేతన్నల ఆత్మహత్యల్లేని సమాజాన్ని రూపొందించే దిశలో ప్రభుత్వం చాలా అగ్రెసివ్‌గా ముందుకుపోతున్నది. రూ. రెండు వేల పెన్షన్‌తో పేదవాళ్లు కూడా మూడు పూటలా భోజనంచేసే విధంగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధంచేసింది. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయి. అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి జోడెద్దుల మాదిరిగా ముందుకుతీసుకుపోతున్న విధానాన్ని జాతీయస్థాయిలో కూడా అమలు చేయాలనుకుంటున్నాం. ఇవ్వాళ మూడు రాష్ర్టాలలో ఓటమి తర్వాత ప్రధాని మోదీ కూడా ఆలోచనలో పడ్డారు. గతంలో డైరెక్ట్ బెనిఫిట్‌స్కీం లని చాలామంది చెప్పారు. తెలంగాణ మా జన్మహక్కు.. అలాగే నేను భారతీయుడిని కూడా. భారతదేశ పౌరుడిగా నా రుణం తీర్చుకుంటా. నాలుగున్నరేండ్లలో మాకు లభించిన అతిపెద్ద అభినందన మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లోని 40 గ్రామాల ప్రజలు తెలంగాణలో కలవాలని కోరుకోవడం. మాకు అభివృద్ధి జరగడం లేదు. రైతుబంధు, రైతుబీమా లేదు, సవ్యమైన రోడ్లు లేవు, మమ్మల్ని తెలంగాణలో కలపాలంటూ 40 గ్రామపంచాయతీలు తీర్మానం చేశాయి. సర్పంచులు కూడా ధర్నా చేశారు. అక్కడి శివసేన ఎమ్మెల్యే కూడా వారి వాదనతో ఏకీభవించారు. తీర్మానాన్ని సమర్థించారు. ఇది మాకు లభించిన పెద్ద కితాబు.

ఢిల్లీలో సత్తా చాటుతాం..

KTR5
కేంద్రంలో 16 సీట్లు ఉంటే ప్రాముఖ్యం ఉండకపోవచ్చు. కానీ, అప్పుడప్పుడు ఒక్కసీటుకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. గతంలో వాజపేయి ప్రభుత్వం ఒక్కఓటుతో పడిపోయిందనేది గమనించాలి. ప్రజాస్వామ్యం గొప్పతనం అది. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల సరళిని గమనిస్తే బీజేపీ 150 నుంచి 160 స్థానాలకు మించి గెలిచేలా లేదు. 2014లో కాంగ్రెస్ గెలిచింది 44 స్థానాలు. ఈసారి రెట్టింపు స్థానాల్లో గెలిచినా 88 నుంచి 90 స్థానాలు దాటే పరిస్థితి లేదు. వాళ్లిద్దరు కలిసినా 250 సీట్లు దాటవు. ఇలాంటి సందర్భంలో ప్రతి ఎంపీ సీటు కీలకమవుతుంది. అదే సమయంలో టీఆర్‌ఎస్‌కు 16 స్థానాలు ఉంటే.. వాటితో ఢిల్లీనే శాసించవచ్చు. బీజేపీకి 283 స్థానాలున్నప్పుడు బయ్యారం స్టీల్ ప్లాంట్‌ను సాధించుకోలేకపోయినం. హైకోర్టు విభజనా జరుగలేదు. ఐటీఐఆర్ రాలేదు. దీనికి మించి కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి వచ్చే దానికంటే ఒక్క పైసాకూడా అదనంగా ఇవ్వలేదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటే, నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వం ఉంటే అందులో టీఆర్‌ఎస్‌దే ఒక నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది. కేంద్రప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉంటుంది. ఢిల్లీ జుట్టు తెలంగాణ చేతిలో ఉంటుంది. గతంలో ఉండే 12 సీట్లకీ, ఇప్పుడు గెలవబోయే 16 సీట్లకీ చాలా వ్యత్యాసం ఉంటుందనే విశ్వాసం ఉన్నది.

తెలంగాణపై మీడియా సంస్థల తీరు మారాలి

కొన్ని మీడియా సంస్థలు ఒక ఎజెండాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును, ప్రజలు లేని ప్రజాకూటమిని, బలవంతంగా తెలంగాణపై రుద్దే ప్రయత్నం చాలా బలంగా చేశాయి. ప్రభుత్వాలను కూల్చగలం.. నాయకులను తయారు చేయగలం.. ప్రభుత్వాన్ని ధ్వంసం చేయగలం అనుకునే మీడియా సంస్థలేవైతే ఉన్నాయో వారికి తెలంగాణ ప్రజలు ఒక్కసారి కాదు ఇప్పటికే చాలాసార్లు బుద్ధి చెప్పారు. 2006లో సీఎం కేసీఆర్ కరీంనగర్‌లో పోటీచేసినప్పటి నుంచి డబ్బు బలంతో, మీడియా బలంతో రకరకాల ప్రచారాలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మొన్నకూడా ప్రచారం ఎట్లా జరిగిందంటే ప్రజలు కూటమిని గెలిపించారని, టీఆర్‌ఎస్‌కు దారుణ పరాభవం జరుగపోతున్నదంటూ మేం కూడా ఒక్కోసారి అయోమయానికి గురయ్యే స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. కాంగ్రెసోళ్లు బలంగా నమ్మినట్టున్నారు. అందుకు ఓడిపోయిన దానిపై సమీక్షించుకోకుండా పరాజయం నుంచి కోలుకోలేకపోతున్నారు. వాళ్లు చేసిన గందరగోళంలో వాళ్లే పడిపోయారు. ప్రజాచైతన్యం ముందు ఎన్ని రకాల కుయుక్తులు, పన్నాగాలు పన్నినా ఫలించవని మరోక్కసారి రుజువైంది. మేం కంగారు పడం.. కంగారు పెడుతాం. మా వల్లనే లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇప్పుడు సర్వే సన్యాసం కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆయనకుఉన్న ఒకశాతం క్రెడిబిలిటీని కూడా కోల్పోయారు.

ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రణాళికాబద్ధంగా..

సీఎం కే చంద్రశేఖర్‌రావు ఫెడరల్‌ఫ్రంట్ భారతదేశం కోసమైతే.. చంద్రబాబు ఏపీలో తెలుగుదేశంపార్టీని కాపాడుకొనేందుకు ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారు. బీజేపీని బూచిగా చూపి తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు భిన్నమైన రాజకీయాలతో దేశప్రజలందరికీ ప్రయోజనం చేయాలనేది కేసీఆర్ ప్రయత్నం. మాది ప్రణాళికాబద్ధంగా సాగుతున్న ప్రయత్నం. అందుకే తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా పలువురు నేతలు ఆయనతో ఫోన్లో చర్చించారు. కలిసేందుకు ఆసక్తిని చూపించారు. కొందరిలాగా మేంటీవీల్లో చర్చలకు, ప్రచారానికే పరిమితం కాలేదు. సంకీర్ణ ప్రభుత్వాల గురించి అపోహలు అవసరం లేదు. 25 సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. ఇప్పుడున్నది కూడా బీజేపీ సారథ్యంలో వివిధపార్టీలతో ఏర్పాటుచేసిన ఎన్డీయే ప్రభుత్వమే.

స్పెషల్ స్టేటస్‌పై బాబుకే క్లారిటీ లేదు

ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబుకే స్పష్టత లేదు. ఒకప్పుడు ప్రత్యేక హోదాను విమర్శించిన ఆయనే నేడు దానిని సంజీవని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో అన్నిపార్టీలు అలవికాని హామీలు ఇస్తూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయి. దేశ రాజకీయాల్లోకి మేం అడుగుపెడతామని ప్రకటించాం. ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో భాగమే. జాతీయరాజకీయాలపై చాలా సీరియస్‌గా ఉన్నాం. అక్కడ మా పాత్ర కీలకంగా ఉండబోతున్నది. దేశంలో భాగమైనా ఏపీలోనూ మాపాత్ర కచ్చితంగా ఉంటుంది. అక్కడ మాకున్న ఆసక్తి ఏ విధంగా ఉంటుందనేది రానున్న రోజుల్లో మీరే చూస్తారు. ఏపీలో ఒక బలమైన ప్రాంతీయశక్తి గెలువాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జాతీయపార్టీలతో ఒరిగేదేమీలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లు దేశానికి చేయకూడని నష్టాన్నంతా చేశాయి. చంద్రబాబును మీడియా గొప్ప నాయకుడిగా చూస్తున్నది.. కానీ, ప్రజలు మాత్రంఆయనను గల్లీ లీడర్ కంటే తక్కువగా చూస్తున్నారు.

మూడు రాష్ర్టాల్లో ఓటమి.. బాబు విజ్ఞతకే వదిలేస్తున్నాం

KTR3
చంద్రబాబు చాలా విషయాల్లో క్రెడిట్ తీసుకుంటారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్ కనిపెట్టే విషయాల్లో కూడా. మూడు రాష్ర్టాల ఎన్నికల ఫలితం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతోమంది వచ్చి ప్రచారం చేశారు. ప్రధాని మోదీ, ఆరుగురు ముఖ్యమంత్రులు, 11 కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కానీ, కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో తెలంగాణ ప్రజలు వారిని వ్యతిరేకించారు. ఈసారి ప్రభుత్వానికి అనుకూలంగా దాదాపు 4 శాతం ఓటింగ్ పెరిగింది. కేంద్ర రాజకీయాల్లో ప్రాంతీయపార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. ఆంధ్ర విషయానికొస్తే అక్కడ కేవలం టీడీపీ మాత్రమే లేదు. ఇంకా కొన్ని ప్రాంతీయపార్టీలు కూడా ఉన్నాయి. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులు 2019 ఏప్రిల్ తర్వాత మారవచ్చు. అక్కడ వేరేపార్టీలు కూడా కీలకపాత్ర పోషించవచ్చు.

ఏపీలో ఏది మంచిదో సరైన సమయంలో చెప్తాం

ఏపీలో ఒకపార్టీతో సాన్నిహిత్యమో.. చంద్రబాబుతో శతృత్వమో లేదు. మాకు అక్కడ శత్రువులు లేరు. అందరూ మిత్రులే. చంద్రబాబుతో గెట్టు పంచాయతీ లేదు. జూబ్లీహిల్స్‌లో జాగా పంచాయితీ లేదు.. జగన్, పవన్‌తోనూ పంచాయితీల్లేవు. ఎన్నికల్లో పోరాడినప్పుడు మాత్రమే ప్రత్యర్థులు. ఏపీలో కూడా ఒక ప్రాంతీయపార్టీ బలమైన శక్తిగా ఉండాలని కోరుకుంటున్నాం. మా ఇష్టం ఏదైనా.. ఎవరిని ఎన్నుకోవాలనేది అక్కడి ప్రజల ఇష్టం. కానీ సమయం వచ్చినప్పుడు ఎవరైతే బాగుంటుందో కూడా చెప్తాం. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిదో సమయం సందర్భాన్ని బట్టి చెప్పాలి తప్పా.. చంద్రబాబులాగా తొందరపడి ఎప్పుడుపడితే అప్పుడు మాట్లాడి అభాసుపాలవ్వం.

మరో పదిహేనేండ్లు సీఎం కేసీఆరే

జాతీయ రాజకీయాలంటే ఢిల్లీలో కూర్చునే చేయాలని లేదు. అది రాజ్యాంగంలో రాసికూడా లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే ఢిల్లీ రాజకీయాలపై ముద్ర వేయవచ్చు. గతంలో పెద్దవాళ్లు చేశారు. ఇప్పుడు మేం కూడా చేస్తాం. ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్న ఎన్టీరామారావు రాష్ట్రంలో ఉంటూనే డిల్లీ రాజకీయాలను కూడా శాసించారు. నాతోపాటు, మా ఎమ్మెల్యేలు, లక్షలాది ప్రజలు కోరుకునేది కేసీఆరే సీఎంగా ఉండాలని. మరో 15 ఏండ్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే. కార్యనిర్వాహక అధ్యక్షుడు కాగానే ఏదో ముఖ్యమంత్రి అవుతారని కొందరు రాశారు. బీజేపీ, కాంగ్రెస్‌పార్టీతో సంబంధం లేని ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలని మేం కోరుకుంటున్నాం కాబట్టి ఇక ఆ పార్టీల సర్కారుకు మద్దతు ఇవ్వడం అనే అంశమే ఉత్పన్నం కాబోదు. కేంద్రంలో నాన్‌కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వం వస్తుందని పూర్తి విశ్వాసం ఉంది. గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రను మజ్లిస్ పార్టీ బయటపెట్టింది. మమ్ములను అప్రమత్తం చేసింది. అందుకే ఎంఐఎంతో మా దోస్తీ కొనసాగుతుంది. మైనార్టీలంటే ముస్లిం మైనార్టీలు మాత్రమే కాదు. సిక్కులు, జైనులు, భాష సంబంధమైన మైనార్టీలు కూడా ఉన్నారు. తెలంగాణలో మా సర్కార్ మైనార్టీలకు మొదటి నుంచీ పెద్దపీట వేస్తున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సీఎం కేసీఆర్ ఏనాడో మద్దతు ఇచ్చారు. యూపీఏలో మంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలిని ఈ బిల్లు ఆమోదం పొందేలా చేయాలన్నారు. పార్టీలో మహిళల పాత్రను మరింత విస్తృతం చేస్తాను. మహిళా విభాగాన్ని పటిష్ఠం చేస్తాం.

వందేండ్లు నిలిచేలా పార్టీ నిర్మాణం

2006లో పార్టీలో అడుగుపెట్టా. ఇప్పటికీ 12 సంవత్సరాలు దాటింది. ఇన్నేండ్లలో ప్రత్యక్షంగా నాలుగు ఎన్నికలు ఎదుర్కోగా, పరోక్షంగా దాదాపు ఎనిమిది ఎన్నికలు చూశాను. కార్యకర్తగా, నాయకునిగా పనిచేసిన సమయంలో నేను అర్థం చేసుకున్నది.. గమనించింది ఏమిటంటే టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంగా పటిష్ఠం చేయాలి.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్ఠమైన పార్టీ నిర్మాణం ఉండాలి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే నాయకులు, కార్యకర్తలను తీర్చిదిద్దాలి. ఎలాంటి సందర్భం వచ్చినా చెక్కు చెదరని ఒక నిర్మాణం ఉండాలి. వందేండ్లపాటు ఒక పటిష్ఠమైన పార్టీగా టీఆర్‌ఎస్‌ను రూపొందించే ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మాపై ఉన్నది. వరుసగా నిర్వహించనున్న పంచాయతీ, సహకార సంఘాలు, మున్సిపల్, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడం ప్రస్తుతం మా ముందున్న సవాల్. ఇవన్నీ రాబోయే ఆరు నుంచి ఏడు నెలల్లో జరుగబోతున్నాయి. వీటిని ఎదుర్కొనే దిశగా పార్టీ సీనియర్ నాయకుల సహకారంతో ముందుకు సాగుతున్నాం. వీటితోపాటు, ఇప్పుడు మా ముందున్న అతిపెద్ద సవాల్ ప్రజలకు మేం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూచ తప్పకుండా నెరవేర్చడం. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ కచ్చితంగా అమలు చేసి తీరుతాం. గత నాలుగేండ్లలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంది. రాష్ట్రంలో 17.7 శాతం వృద్ధిరేటు స్థిరంగా ఉంది. రాష్ట్ర సొంత రాబడులు 29.4 శాతానికి పెరిగాయి. రాష్ట్రంలో నిర్మాణ రంగం కూడా బలంగా ఉన్నది.

3310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles