ఫార్మాకేంద్రం హైదరాబాద్


Thu,May 23, 2019 02:26 AM

TRS Working President KTR Attends Odyssey Logistics Second Anniversary In Park Hyatt

-త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ
-ఫార్మా లాజిస్టిక్ పార్కులకు ఉజ్వల భవిష్యత్తు
-ఒడిస్సీ లాజిస్టిక్స్ రెండో వార్షికోత్సవంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్‌కు హైదరాబాద్ పర్యాయపదంగా మారిందని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. హైదరాబాద్‌లో 19 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. బుధవారం పార్క్‌హయత్‌లో నిర్వహించిన ఒడిస్సీ లాజిస్టిక్స్ రెండో వార్షికోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మారంగానికి హైదరాబాద్ కేంద్ర బిందువన్నారు. ప్రపంచంలోని ఫార్మా ఉత్పత్తుల్లో మూడోవంతు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని, ప్రపంచంలోనే పేరుగాంచిన ఫార్మాకంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. ఫార్మారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ చేయూతనిస్తుందని తెలిపారు.

పారిశ్రామికరంగ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం మేకిన్ ఇండియా ద్వారా చేయూతనిస్తుండగా.. అదే స్ఫూర్తిని తెలంగాణ ప్రభు త్వం కొనసాగిస్తున్నదని చెప్పారు. అందుకే తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం రూపొందించామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, మౌలిక సదుపాయాల విస్తరణకు పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో 1952 నుంచి 2014 సంవత్సరం వరకు 2,018 కిలోమీటర్ల నిడివిగల జాతీయ రహదారులుంటే.. గడిచిన ఐదేండ్లలో రాష్ట్రానికి కొత్తగా 2,800 కిలోమీటర్ల జాతీయ రహదారులను తీసుకొచ్చామని తెలిపారు. పరిశ్రమల విస్తరణకు రో డ్లు, రైలు, విమానం వంటి రవాణా సౌకర్యాలు కీలకమన్నారు. తెలంగాణలో గడిచిన ఐదేండ్లలో విస్తృతమైన రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అవుటర్ రింగురోడ్డుకు అదనంగా 330 కి.మీ. నిడివితో రీజినల్ రింగురోడ్డు నిర్మించనున్నట్టు తెలిపారు.

లాజిస్టిక్ ఉత్పత్తులకు మంచి భవిష్యత్తు

లాజిస్టిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి భవిష్యత్తు ఉన్నదని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో లాజిస్టిక్ జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రోరైల్ ఏర్పాటు అనంతరం రవాణావ్యవస్థ మరింత మెరుగుపడిందని చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు నెమ్మదించాయన్నారు. ఉత్పత్తిరంగం అభివృద్ధి చెందితే ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఒడిస్సీ లాజిస్టిక్స్ ఎండీ అభిషేక్ ఠాగూర్ మాట్లాడుతూ.. తమ కంపెనీని ప్రారంభించిన రెండు సంవత్సరాల్లోనే ప్రపంచవ్యాప్తంగా సమర్థంగా సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ రెండేండ్లలో తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారం మరువలేమన్నారు. రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఫార్మారంగాన్ని మరింత విస్తృతంచేసేందుకు కృషిచేస్తామన్నారు. అనంతరం హైదరాబాద్ ఫార్మారంగంలో విశిష్ట సేవలందిస్తున్నవారికి కేటీఆర్, వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, నాగరాజుగౌడ్, విఘ్నేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ARABENDO-PHRAMA-KTR

రోబో ఫెస్ట్ విజేతలకు కేటీఆర్ అభినందనలు

ఇంటర్నేషనల్ రోబో ఫెస్ట్ విజేతలుగా నిలిచిన విద్యార్థులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు మూడు క్యాటగిరీల్లో రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. వీరిని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. సుహాస్, ఆర్నవ్, తరుణ్ మనందరినీ గర్వపడేలా చేసినందుకు, ఈ ముగ్గురికి నా హృదయపూర్వక అభినందనలు అని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

1673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles