హైవేల పనుల్లో వివక్ష

Wed,December 4, 2019 02:59 AM

-రాష్ర్టానికి కేటాయించినవాటికి నంబర్లు ఇవ్వలేదు
-పనులు ప్రారంభించడంలో జాప్యం
-వర్షాలతో పాడైన హైవేలకు మరమ్మతులు చేయించండి
-కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కోరిన మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జాతీయ రహదారుల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యా యం జరిగిందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గతంలో రాష్ర్టానికి మంజూరుచేసిన జాతీయ రహదారుల్లో కొన్నింటికి నంబర్లు కూడా ఇవ్వలేదని.. కొన్నింటి పనులు ప్రారంభించలేదని తెలిపారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న జాతీయరహదారుల అంశంపై మంగళవారం ఆయన కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి వెంట లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్ నేతకాని, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గొంగిడి సునీత, టీఆర్‌ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తి, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలను గడ్కరీకి అందజేశారు.

అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ర్టానికి 3,150 కిలోమీటర్ల రహదారులు మంజూరుచేశారని.. అందులో 600 కిలోమీటర్ల రహదారులకు నంబర్లు ఇవ్వలేదని చెప్పారు. నంబర్లు ఇచ్చిన రహదారుల పనులు కూడా ప్రారంభించలేదని తెలిపారు. కొత్తగా కేటాయించిన రహదారులకు నంబర్లు ఇవ్వడంతోపాటు, పనులు వేగవంతం చేయాలని గడ్కరీని కోరినట్టు చెప్పారు. ఈ ఏడాది కురిసిన వర్షాలకు జాతీయ రహదారులు చాలావరకు దెబ్బతిన్నాయని, వాటన్నింటికీ వెంటనే మరమ్మతు చేయాలని, హైదరాబాద్ నుంచి భూపాలపల్లి 163వ జాతీయ రహదారిలో రెండుచోట్ల, కోదాడ- మిర్యాలగూడ జాతీయరహదారి 167లో కొన్నిప్రాంతాల్లో అండర్‌పాస్‌లు నిర్మించాలని, చేవెళ్ల- బీజాపూర్ హైవే పనులు వేగవంతం చేయాలని కోరామన్నారు. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్‌రోడ్‌ను త్వరగా చేపట్టాలని, దీని నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం తరపున 50 శాతం ఖర్చు భరిస్తామని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి తెలిపినట్టు టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు చెప్పారు. అన్ని అంశాలపై కేంద్రమంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.

హైవే 63పై ైఫ్లెఓవర్లు, జంక్షన్లు అభివృద్ధి చేయండి: ఎమ్మెల్యే బాల్కసుమన్

చెన్నూరు నియోజకవర్గం నుంచి వెళ్లే నేషనల్ హైవే 63పై మూడుచోట్ల ైఫ్లెఓవర్లు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణం పూర్తయిందని.. దీంతో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రవాణా సదుపాయం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు నియోజకవర్గపరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి సర్వీస్‌రోడ్లు, అండర్‌పాస్‌లు నిర్మించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కోరారు. వంగపల్లి, సాయిగూడెం, జీడికల్‌లో అండర్‌పాస్‌లను నిర్మించాలని కోరారు.

2007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles