లాభసాటిగా పసుపుసాగు


Tue,June 19, 2018 03:23 AM

trs mpkavitha participated in turmeric workshop is organised in hyderabad by the spicesboard

-కేంద్రం మద్దతుధర ఇస్తే సాధ్యం
-పసుపు ప్రత్యేకసెల్ ఏర్పాటుకు కార్యాచరణ
-పసుపుపై వర్క్‌షాపులో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత
-ఎంపీ కవితకు రైతులు రుణపడి ఉంటారు: ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:పసుపు సాగును లాభసాటిగా మారుస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సుగంధద్రవ్యాల బోర్డు (స్పైసెస్‌బోర్డు) పసుపుపై నిర్వహించిన వర్క్‌షాపులో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ.. కేంద్రం పసుపునకు ప్రత్యేకసెల్‌ను ఏర్పాటుచేస్తున్నదని చెప్పారు. దీనికోసం కార్యాచరణ రూపొందించడంలో భాగంగానే వర్క్‌షాపును నిర్వహిస్తున్నట్టు వివరించారు. వర్క్‌షాపు నిర్వహణకు సహకరించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖల మంత్రి సురేశ్‌ప్రభుకు ఎంపీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. పసుపునకు కనీస మద్దతుధర ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. మూడు దశాబ్దాలుగా పసుపుబోర్డు ఏర్పాటుచేయాలని తెలంగాణలో పసుపు రైతులు డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు. రైతులను ఆదుకునేందుకు పసుపుబోర్డు ఏర్పాటుపై లోక్‌సభలో డిమాండ్‌చేశానని.. ప్రధానమంత్రితోపాటు వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమలశాఖల మంత్రులను కలిశానని చెప్పారు. ఐదుగురు ముఖ్యమంత్రులు పసుపుబోర్డుకు మద్దతుగా లేఖలిచ్చారని వివరించారు. సిల్క్‌బోర్డు మాదిరిగానే పసుపుబోర్డు ఏర్పాటుచేయడం వల్ల పసుపు రైతులకు మేలు కలుగుతుందన్నారు. జీన్‌బ్యాంక్ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఉడకబెట్టిన పసుపును ఎండబెట్టేందుకు యంత్రాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయేమో అధ్యయనంచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పైసెస్‌పార్క్ కోసం బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌లో 42 ఎకరాల స్థలాన్ని కేటాయించి, రూ.30 కోట్లను మంజూరుచేసిందన్నారు. పసుపు ఉత్పత్తి తగ్గడానికి కారణాలను అన్వేషించాలని సూచించారు. ఆరుశాతం మాత్రమే పసుపు ఎగుమతి అవుతున్నదని దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణకు తుదిరూపు


వర్క్‌షాప్‌లో వ్యక్తమైన అభిప్రాయాలను క్రోడీకరించి కార్యాచరణను రూపొందించే అంశంపై ఎంపీ కవిత, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్, స్పైసెస్‌బోర్డు అధికారులు, ఉద్యానవన, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల అధికారులు చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణకు తుదిరూపమిస్తారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్‌బోర్డు వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ లింగప్ప, కొచ్చి మార్కెటింగ్ డైరెక్టర్ పీఎం సురేశ్‌కుమార్, పరిశోధన, అభివృద్ధి విభాగం సంచాలకులు డాక్టర్ ఏబీ రేమాశ్రీ, రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి, వ్యవసాయశాఖ మార్కెటింగ్ డైరెక్టర్ జీ లక్ష్మీబాయి, నాబార్డ్ ఏజీఎం సీఎస్‌ఆర్ మూర్తి పాల్గొన్నారు.

ఎంపీ కవిత కృషితోనే పసుపునకు ప్రత్యేక సెల్: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి


గతంలో ఎంపీలు పసుపు రైతుల గురించి పట్టించుకున్న పాపానపోలేదని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎంపీ కవిత పలు దఫాలుగా కేంద్రప్రభుత్వంతో చర్చలు జరిపారని, అనేక రాష్ట్రాలు తిరిగి పసుపుపై అధ్యయనం చేశారని వివరించారు. ఆమె కృషివల్లనే పసుపు ప్రత్యేకసెల్ ఏర్పాటవుతున్నదని చెప్పారు. నిజామాబాద్ జిల్లా రైతాంగం ఎంపీ కవితకు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. గతంలో పసుపు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రత్యేకసెల్ ఏర్పాటుచేశారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ అన్నారు. పసుపు రైతుల మేలు కోసం ఎంపీ కవిత చేస్తున్నకృషిని టీఆర్‌ఎస్ జగిత్యాల ఇంచార్జ్జి డాక్టర్ సంజయ్‌కుమార్ వివరించారు. వర్క్‌షాపులో రైతులు, ట్రేడర్లు, సైంటిస్టులు, అధికారులు ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. రైతులు కేంద్రానికి పలుసూచనలు చేశారు. పసుపు నాణ్యతను పరీక్షించే విధానం వ్యవసాయ మార్కెట్లలో ఉండాలని, కోల్డ్‌స్టోరేజీలను కేంద్రం ఏర్పాటుచేయాలని, పసుపును ఆరబెట్టేందుకు సామూహిక కల్లాలను నిర్మించాలని కోరారు.

1228

More News

VIRAL NEWS

Featured Articles