విభజన హామీలపై చర్చకు సమయమివ్వాలి


Mon,June 17, 2019 02:16 AM

TRS MP Nama Nageswara Rao And Keshav Rao At All Party Meeting

-అంశాలవారీగా కేంద్రానికి మద్దతిస్తాం
-కేంద్రం ఫెడరల్ స్ఫూర్తిని ప్రదర్శించాలి
-అఖిలపక్ష సమావేశంలో టీఆర్‌ఎస్‌పక్ష నేతలు కేకే, నామా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలతోపాటు రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలను చర్చించడానికి పార్లమెంట్‌లో సమయమివ్వాలని టీఆర్‌ఎస్ పార్టీ కోరింది. విభజనకు సంబంధించిన అనేక అంశాలు పార్లమెంట్ సాక్షిగా చట్టంలో పేర్కొన్నా ఇంతవరకు వాటిని అమలుచేయలేదని స్పష్టంచేసింది. పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీఆర్‌ఎస్ నుంచి పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాలను లేవనెత్తిన కేకే, నామా.. వీటిపై చర్చించేందుకు పార్లమెంట్ సమావేశాల్లో తగిన సమయం కేటాయించాలన్నారు.

పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరుగడానికి టీఆర్‌ఎస్ సహకరిస్తుందని, అదేసమయంలో కేంద్రం కూడా అన్నివర్గాల సమస్యలు ప్రస్తావించేలా, చర్చించేలా సమయమివ్వాలని సూచించారు. పార్లమెంట్ సజావుగా నడువడంలో ప్రధాన బాధ్యత అధికారపక్షంపై ఉం టుందని నామా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అధికారాలు బదలాయించాలని, ఫెడరల్ స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. అంశాలవారీగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్‌ఎస్ తెలిపింది. మెజార్టీ ఉన్న కారణంగా మిగిలిన పక్షాలను పట్టించుకోకుండా వెళ్లవద్దని పలు పార్టీల నేతలు సూచించగా.. టీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది.

ఈ సమావేశంలో తాగునీటి సమస్యపై పలు పార్టీల ప్రతినిధులు సూచించగా.. తెలంగాణలో చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల గురించి నామా నాగేశ్వర్‌రావు వివరించి చెప్పారు. అలాగే ఈ ప్రాజెక్టులకు అదనపు నిధులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విద్యపై చర్చ జరిగిన సమయంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన గురుకుల విద్యావిధానం విజయవంతమైనదని, మంచి ఫలితాలు వస్తున్నాయని నామా పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును తీసుకురావాలని టీఆర్‌ఎస్ పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని మరోసారి ప్రకటించింది.

1657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles