రేవంత్.. నువ్వు రవ్వంత


Sat,January 13, 2018 01:59 AM

TRS MP Balka Suman Reacts On Congress Leader Revanth Reddy Comments

-నేను శిఖరమంతటోడిని..: ఎంపీ బాల్క సుమన్
-అమరవీరుల సాక్షిగా అబద్ధాలాడుతున్నవ్..
-వాస్తవాల మీద బతికితే మంచిది
-సరైన ఆధారాలతో ఉత్తమ్, జానా వస్తే విద్యుత్‌పై చర్చకు సిద్ధం

suman
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అమరవీరుల స్తూపం సాక్షిగా రేవంత్‌రెడ్డి అబద్ధాలను వల్లెవేస్తున్నారని, పాడిందే పాటరా.. అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. విద్యుత్‌పై బూట్ట చోర్ బ్యాచ్, పోతరాజు విన్యాసాలు చేసిందని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా విద్యుత్‌లో తెలంగాణకు 53.89 శాతం వాటారావడం కాంగ్రెస్ దయ కాదని, 2008 ఏప్రిల్ 28న జీవో 53లోనే దానిని కేటాయిస్తూ ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేశారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ టీ భానుప్రసాద్ రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నాటికి ఐదేండ్ల విద్యుత్ వినియోగం ఆధారంగా కేటాయింపులు చేశారని, దీనిపై రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవపట్టించేలా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. గవర్నమెంట్ టు గవర్నమెంట్ (జీ టు జీ) ఒప్పందాలపైన ఆరోపణలు చేసిన సన్నాసులను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. 2017కు ముందు దేశంలో చేపట్టిన 28 విద్యుత్ ప్రాజెక్టులను సబ్‌క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే చేపడుతున్నారని, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో వాడే పరికరాలను వినియోగిస్తున్నామన్నారు. 24 గంటల విద్యుత్‌పై రైతుల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత పూర్తి ఆధారాలతో వస్తే విద్యుత్‌పై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. విశ్వసనీయత గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని సుమన్ ఎద్దేవా చేశారు. రేవంత్ అనుచరుల ద్వారా సోషల్ మీడియాలో తనపై విషప్రచారం చేయిస్తున్నారని, బాల్క అంటే వెంట్రుక అంటూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

బాల్క అంటే పర్శియన్‌లో పర్వత శిఖరమని, నేను పర్వతమంత అయితే.. నీవు రవ్వంత అని రేవంత్‌పై ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి, కరీంనగర్‌లో తుపాకీతో ఉద్యమకారులను బెదిరించిన వ్యక్తి రేవంత్ అని చెప్పారు. ఆయన వాస్తవాలమీద బతికితే మంచిదని సూచించారు. ఉస్మానియా లో పోలీసులతో దెబ్బలు తిన్నానని, ఎక్కడా వెన్ను చూపలేదని చెప్పారు. నన్ను పారిపోయాడంటవా..? నిన్నే పారిపోయేలా చేస్తా.. నువ్వొక పొలిటికల్ బఫూన్‌వి, బ్రోకర్‌వి అంటూ విమర్శించారు. తాను తలుచుకుంటే వంద రెట్లు ఎక్కువ తిడుతూ వీడియోలు పెట్టగలను అని హెచ్చరించారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌పై టెండర్లు పిలిస్తే ఒకయూనిట్‌ను రూ.5.35లకు సరఫరా చేస్తామని ఏపీ ప్రభుత్వం కోట్ చేసిందని, కానీ ఒక కంపెనీ రూ.4.62కే కోట్ చేయడంతో ఏపీ కూడా అదే ధరకు చేస్తామని చెప్పిందని తెలిపారు. పక్క రాష్టమే కదా అని దానిని అంగీకరించి తెలంగాణ ప్రభుత్వం లేఖరాస్తే మూడునెలల వరకు స్పందించలేదని, విద్యుత్‌ను సరఫరా చేయలేదని చెప్పారు. దీంతో తామే ప్రత్యామ్నాయం చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఏపీకి లేఖ రాసిందన్నారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చంద్రబాబు తరుఫున వకాల్తా పుచ్చుకొని రేవంత్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌అలీ తప్పుడు సమాచారంతో చర్చలకు రారని, పూర్తి వాస్తవాలు తెలుసుకుని వస్తారనే నమ్మకం ఉందని, అందుకే వారినే చర్చలకు పిలుస్తున్నామని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తే టీఆర్‌ఎస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేస్తానన్న జానారెడ్డి మాట నిలబెట్టుకొంటారన్న నమ్మకం ఉందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. రేవంత్‌రెడ్డి నీచమైన వ్యక్తి అని, కుక్క కాంగ్రెస్‌లో చేరినా గొలుసు ఇంకా చంద్రబాబు చేతిలోనే ఉందని విమర్శించారు.

1186
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS