ఎన్నికలు ఎప్పుడువచ్చినా మేం సిద్ధమే


Mon,July 16, 2018 05:00 AM

TRS Guarantee Win in Next Election at Any Time

-జమిలి ఎన్నికలకూ ఓకే
-రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ
-తెలంగాణ విధానాలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి
-స్వతంత్రం వచ్చిన నాటినుంచీ దేశంలో ఇలాంటి పథకాల్లేవు
-రైతుబంధులాంటి కార్యక్రమాన్ని ఎప్పుడూ చేపట్టలేదు
-ట్విట్టర్ వేదికగా ప్రజలతో మంత్రి ముఖాముఖి
-గంటన్నరపాటు నెటిజన్లతో అభిప్రాయాల కలబోత
-లెఫ్ట్ పార్టీలను ప్రజలు ఎప్పుడో వదిలేశారు
-నేను మళ్లీ సిరిసిల్ల నుంచే పోటీచేస్తా
-నల్లగొండలో అన్ని స్థానాల్లో గెలుస్తాం
-ఎన్నికల తర్వాత పట్టణ మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం
-నా పుట్టిన రోజున కేకులు, పోస్టర్లు వద్దు.. మొక్కలు నాటండి
-బీజేపీ, మోదీ ప్రభుత్వం పనితీరు సంతృప్తిగా లేదని వ్యాఖ్య

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి టీఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలను తమ పార్టీ స్వాగతిస్తున్నదని చెప్పారు. గత నాలుగేండ్లుగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు మార్గదర్శిగా నిలిచాయని తెలిపారు. దేశానికి స్వతంత్రం వచ్చిన నాటినుంచి రైతుబంధులాంటి కార్యక్రమాన్ని దేశంలో ఎప్పుడూ చేపట్టలేదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అర్బన్ ఇన్‌ఫ్రాకు అధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఆయన ఆదివారం మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రజలతో సంభాషించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో సుమారు గంటాఇరవై నిమిషాలపాటు సాగిన ఈ సంభాషణలో అనేక అంశాలపై మంత్రి సమాధానాలిస్తూ.. తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు.. ఇలా అనేక అంశాలపై మంత్రి సూటిగా, చతురతతో సమాధానాలిచ్చారు. ఇష్టమైన క్రికెటర్ ఎవరు? ధోనీనా, కోహ్లీనా? అంటే రాహుల్‌ద్రవిడ్, సచిన్ టెండూల్కర్.

నేను వారి తరం నుంచే వచ్చాను అన్న మంత్రి ఇష్టమైన ఫుట్‌బాలర్ లయోనెల్ మెస్సీ అని, ఫెదరర్ ఇష్టమైన టెన్నిస్ ఆటగాడని తెలిపారు. ఆదివారంనాటి ఫ్రాన్స్, క్రొయేషియా మ్యాచ్‌లో ప్రపంచంలోని అధికశాతం అండర్ డాగ్ జట్టుకే మద్దతు ఇస్తుందన్నారు. సద్విమర్శలు స్వీకరిస్తానని అయితే దురుద్దేశపూర్వక వ్యాఖ్యలను సహించేది లేదని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటిస్థానంలో ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని ఒకరడుగగా.. తాము కేవలం 0.09 శాతంతో వెనుకబడ్డామని అంటూ మొదటి స్థానంలో నిలిచిన ఏపీకి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ, మోదీ ప్రభుత్వం పనితీరుపైన సంతృప్తిగా ఉన్నారా అంటే లేదు అని సమాధానమిచ్చారు. ప్రజలు లెఫ్ట్ పార్టీలను ఎప్పుడో వదిలేశారని మరో ప్రశ్నకు బదులుగా వ్యాఖ్యానించారు. భారతదేశ బలమంతా యువతేనని ఇంకో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పాఠశాలల్లో ఫీజుల బాదుడుపై కమిటీ పనిచేస్తున్నదని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో రెండు డిగ్రీ కాలేజీలు ఉండగా విభజనతో అవి ఏపీకి వెళ్లిపోయాయి. తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా లేదు. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు కృషిచేస్తే అనేక మంది పేద విద్యార్థులకు మేలు చేసినవారవుతారు అని ఒకరు కోరగా.. తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. బుద్వేల్‌లో ఐటీ క్లస్టర్, కరీంనగర్‌లో ట్రిపుల్‌ఐటీ, నిజామాబాద్‌లో ఐఐటీ ఏర్పాటుకు కృషిచేస్తున్నామని, అవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. తన పుట్టినరోజునాడు కేక్ కట్ చేసేందుకు ఓ నెటిజన్ ఆసక్తి చూపగా.. కేకులు కోయడం, పోస్టర్లు వేయడం వద్దని.. వీలయితే ఒక మొక్కను నాటాలని కోరారు. లీగల్ మెట్రాలజీ విషయంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఓ వ్యక్తి ప్రస్తావించగా.. మంత్రి ఈటల రాజేందర్‌కు విషయం చేరవేస్తానని తెలిపారు. రోడ్డుపై గుంతల్లో ఫొటోలు పెట్టి నిరసన తెలుపడాన్ని ఎలా చూస్తారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి అంశాలన్నీ సహజమని ఆయన పేర్కొన్నారు. పలు మీడియా సంస్థలు పక్షపాత ధోరణితో వ్యవహరించడాన్ని ఎలా చూస్తారని ప్రశ్నించగా.. ఈ విషయాన్ని మీడియా సంస్థలనే అడగాలన్నారు.

పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలు.. మంత్రి సమాధానాల్లో కొన్ని..

మనం ఎంత గొప్ప స్థానంలో ఉన్నా.. ఎలా ఒదిగి ఉండాలో సలహా ఇవ్వగలరా?

-కేటీఆర్: ఈ స్థానాలు శాశ్వతం కాదు. రెప్పపాటులో మాయమైపోతాయి.

2019 ఎన్నికల్లో జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల నుంచి పోటీచేస్తారా?

-కేటీఆర్: సిరిసిల్ల ప్రజలు నన్ను మూడుసార్లు గెలిపించారు. వారి నమ్మకానికి కట్టుబడి ఉంటాను.సర్ మీరు అమ్మాయిలకు రిైప్లె ఇవ్వడంలేదు కేటీఆర్: నాకంత ధైర్యం ఉందా?

నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు కదా? మీకెలా అనిపిస్తుంది?

-కేటీఆర్: నిజాంకాలేజీ గొప్ప కళాశాల

ఇటీవల జరిగిన నగర బహిష్కరణలపై మీ అభిప్రాయం ఏమిటి?

-కేటీఆర్: లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

ఒక రాజకీయ నేతగా మీరు సాధించిన గొప్ప విషయాల గురించి చెప్తారా?

-కేటీఆర్: నేను రిటైర్ అయిన తరువాత చెప్తాను

నేను లా చదువుతున్నాను. మీ ఆధ్వర్యంలో ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నాను. దరఖాస్తు పత్రాలు కూడా పంపించాను. నన్ను తీసుకుంటారా?

-కేటీఆర్: ఒక లా విద్యార్థి నా వద్ద ఏం ఇంటర్న్‌షిప్ చేస్తాడో నాకు తెలియదు. దరఖాస్తు పత్రాలను పరిశీలించాల్సిందిగా నా టీంకు చెప్తాను.

2019 ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి ఎన్ని సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు?

-కేటీఆర్: మొత్తం 12 గెలుస్తామని ఆశిస్తున్నాను.

జమిలి ఎన్నికలపై మీ అభిపాయం చెప్పండి?

-కేటీఆర్: స్వాగతిస్తున్నాను.

తర్వాతి తెలంగాణ సీఎం ఎవరు?

-కేటీఆర్: కేసీఆర్

డిసెంబర్‌లోగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని మీకు అనిపిస్తున్నదా? అందుకు సిద్ధంగా ఉన్నారా?

-కేటీఆర్: అవి ఎప్పుడు జరిగినా మేం సిద్ధంగానే ఉన్నాం.

మీకు నచ్చిన కమెడియన్?

-కేటీఆర్: రాజకీయాల్లో ఆడుతున్నాం కదా.. (నవ్వుతూ)

ప్రపంచం మొత్తంలో మీకు నచ్చే రాజకీయ నేత?

-కేటీఆర్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

ముఖ్యమంత్రుల్లో వైఎస్సార్ గొప్పా? కేసీఆర్ గొప్పా?

-కేటీఆర్: సమాధానం మీకే బాగా తెలుసు.

2024లో జరిగే ఎన్నికల్లో మీరు ఏపీ నుంచి పోటీచేయాలని నాలాంటి చాలామంది యువకులు కోరుకుంటున్నారు. మీరేమంటారు?

-కేటీఆర్: భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.

3166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles