ఇదీ ప్రగతి నివేదిక


Mon,September 3, 2018 03:44 AM

TRS Government All Schemes in last 4 years

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతితక్కువ కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగారి నాయకత్వంలో అనూహ్యమైన ప్రగతిని నమోదుచేసింది. ప్రజలు కేంద్రంగా రూపొందిన సంక్షేమ ప్రణాళికలు పేదవర్గాలకు చేయూతనిచ్చి నిలబెడుతున్నాయి. సకల రంగాల్లో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా గుర్తింపుపొందింది.

సంక్షేమ కార్యక్రమాలు
ఆదాయ పరిమితి పెంపు:

దారిద్య్రరేఖకు దిగువన (బిపిఎల్) ఉండే కుటుంబాలను నిర్ధారించేందుకు ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి లక్షన్నరకు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచింది. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగులు సంక్షేమ పథకాలను అందుకునేందుకు అర్హత సాధించారు.

ఆసరా పింఛన్లు:

తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.5,043.92 కోట్లు ఖర్చుచేస్తూ ప్రతినెలా 40 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నది. వృద్ధులు, వితంతువులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, గీతకార్మికులు, చేనేతకార్మికులు, బీడీకార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పింఛను రూ.200 నుంచి రూ.1000కి, వికలాంగులు, కళాకారుల పెన్షన్‌ను రూ.500 నుంచి రూ.1,500కు పెంచింది.
-దేశంలో మరెక్కడా లేనివిధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా 1000 రూపాయల పింఛను అందజేస్తున్నది.
kcrscam2

కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్:

ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెండ్లికి లక్షా 116 రూపాయలు అందజేస్తున్నది.

6 కిలోల బియ్యం:

సమైక్య రాష్ట్రంలో ఒక్కోవ్యక్తికి 4 కిలోల చొప్పున కుటుంబానికి గరిష్ఠంగా 20 కిలోల రేషన్ బియ్యం మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఒక్కోవ్యక్తికి 6 కిలోల చొప్పున, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రూపాయికే కిలో బియ్యాన్ని అందజేస్తున్నది.

విద్యార్థులకు సన్నబియ్యం:

అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని 44.61 లక్షలమంది విద్యార్థులకు సన్నబియ్యంతో వండిన అన్నం పెడుతున్నారు.
అమరవీరుల కుటుంబాలకు

రూ.10 లక్షలు, ఉద్యోగం:

ప్రతీ అమరవీరుని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. హైదరాబాద్‌లో అమరవీరుల స్మృతిచిహ్నం నిర్మాణంలో ఉన్నది. ఉద్యమకారులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఎత్తేసింది.

ప్రకృతి వైపరీత్యాల్లో మరణించినవారి కుటుంబాలకు ఆర్థిక సహాయం:

వడగండ్లు, భారీవర్షాలు, వరదల్లాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు, పిడుగుపాటుతో మరణించినవారి కుటుంబాలకు రూ.6 లక్షలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది.

గుడుంబా నిర్మూలన పునరావాస కార్యక్రమాలు

తెలంగాణలో గుడుంబా మహమ్మారిని ప్రభుత్వం తరిమికొట్టింది. గుడుంబా తయారీపై ఆధారపడిన ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సహాయంచేసి, ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించింది.

జీవో నంబర్ 58 ద్వారా 1.25 లక్షల మందికి పట్టాలు

ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు 125 చదరపు గజాలలోపు స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరించింది. జీవో నంబర్ 58 కింద రెగ్యులరైజేషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.25 లక్షల మందికి భూమి పట్టాలు పంపిణీచేశారు.

జర్నలిస్టులు, హోంగార్డులు, డ్రైవర్లకు ప్రమాద బీమా:

డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, 5 లక్షల ప్రమాదబీమా సౌకర్యాన్ని కల్పించింది.

ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్ను రద్దు

ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా బకాయిలను మాఫీచేయడంతోపాటు రవాణా పన్నును రద్దుచేసింది.
kcrscam3

స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సాయం

పేద యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధంలేకుండా రూ.50 వేల వరకు 100% సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది. లక్ష రూపాయల రుణం తీసుకునే వారికి 80 శాతం, రూ.2 లక్షలలోపు రుణానికి 70 శాతం, రూ.5 లక్షలలోపు రుణానికి 60 శాతం సబ్సిడీని ఇస్తున్నది.

ఆత్మగౌరవ భవనాలు

హైదరాబాద్ లో అన్ని కులాలు తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం స్థలాన్ని, నిధులను కేటాయించింది.

జీతాల పెంపు

హోంగార్డులు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, ఐకేపీ, సెర్ప్, నరేగా ఉద్యోగులు, 108 సిబ్బంది, 104 సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వీఆర్‌ఏలు, వీఏవోలు, కాంట్రాక్టు లెక్చరర్లు, సీఆర్టీలు, అర్చకులు తదితర ఉద్యోగులందరి వేతనాలను, రేషన్ డీలర్ల కమిషన్‌ను ప్రభుత్వం పెంచింది.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం

ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి, ఆ నిధులను ఆ వర్గాల కోసమే ఖర్చుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు ఏదైనా కారణం వల్ల ఖర్చుకాకపోతే మరుసటి సంవత్సరానికి బదిలీచేసే విధంగా చట్టంలో నిబంధన పెట్టారు.

గ్రామపంచాయతీలుగా గిరిజన తండాలు

గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలను ప్రత్యేక గ్రామపంచాయితీలుగా మార్చాలన్న దీర్ఘకాలిక డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో నెరవేరింది. వంద శాతం ఎస్టీ జనాభాగల గ్రామపంచాయతీలు కొత్తగా 1,326 ఏర్పడ్డాయి. షెడ్యూల్ ఏరియాలో గ్రామపంచాయతీలు 1,311 ఉన్నాయి. తెలంగాణలో మొత్తం వంద శాతం ఎస్టీ జనాభా గల 2,637 గ్రామాలు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఇతర గ్రామాల్లో కూడా ఎస్టీలకు తమ జనాభా ప్రకారం రిజర్వేషన్ లభిస్తుంది. దీంతో రాష్ట్రం మొత్తంమీద 3,402 మంది ఎస్టీలు సర్పంచులయ్యే అవకాశం ఏర్పడింది.

ఎస్సీలకు మూడెకరాల భూమి

రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.503.53 కోట్లు వెచ్చించి 5,065 ఎస్సీ కుటుంబాలకు 12, 975 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. దళితులకు భూమి పంపిణీ కార్యక్రమం కోసం 2018-19 బడ్జెట్‌లో రూ.1,469 కోట్లు కేటాయించింది.

ఎస్సీ, ఎస్టీలకు వృత్తినైపుణ్య శిక్షణ

వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసిన ఎస్సీ, ఎస్టీ యువకులకు ప్రభుత్వమే ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వివిధ వృత్తుల్లో స్థిరపడేట్లు చేసింది.

ఎస్సీ, ఎస్టీలకు ప్రోత్సాహకాలు

అన్ని ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం స్థలాలను ప్రభుత్వం రిజర్వ్‌చేసింది. హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రూ.5 కోట్లతో ఎకరం స్థలంలో ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంకుబేషన్ ఆఫ్ ఎస్సీ ఎంటర్ ప్రెన్యూర్స్ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు, ఇప్పటికే నెలకొల్పినపరిశ్రమలను విస్తరించాలనుకునేవారికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందజేస్తున్నది. వారి పరిశ్రమలకు ఉపయోగించే విద్యుత్ చార్జీల్లో ఒక్కో యూనిట్‌కు రూపాయిన్నర సబ్సిడీ ఇస్తున్నది. చిన్నతరహా పరిశ్రమలు, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు రుణాలను తీసుకున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామకవేత్తలు కేవలం పావలా వడ్డీ చెల్లించే వెసులుబాటు కల్పించింది. పరిశ్రమల స్థాపనకు అయ్యే వ్యయంలో ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ అందజేస్తున్నది.

కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వడంతోపాటు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్ కల్పించింది.

రిజర్వేషన్ల పెంపు

ఎస్టీల రిజర్వేషన్లను 6 నుంచి 12 శాతానికి, ముస్లింలలోని వెనుకబడిన కులాల రిజర్వేషన్లను 4 నుంచి 12 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. బీసీలకు, ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసింది. పెంచిన రిజర్వేషన్లను అమలుచేసేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నది.

ఉచిత విద్యుత్తు, పాత బకాయిల రద్దు

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు తమ ఇండ్లకు ఉపయోగించే విద్యుత్తును 101 యూనిట్లవరకు ఉచితంగా అందజేస్తున్నారు. గృహ వినియోగ క్యాటగిరీలో రూ.70 కోట్లకుపైగా ఉన్న ఎస్టీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం రద్దుచేసింది. గిరిజనులపై గతంలో నమోదుచేసిన విద్యుత్ విజిలెన్స్ కేసులన్నింటినీ ఎత్తివేసింది.
kcrscam4

మైనారిటీ సంక్షేమం

మైనారిటీ సంక్షేమం కోసం భారీగా నిధులు మైనారిటీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రూ.4 వేలకోట్లు కేటాయిస్తే, తెలంగాణ రాష్ట్రం ఒక్కటే రూ.2 వేలకోట్లు కేటాయించింది.

రంజాన్, క్రిస్మస్ వేడుకలు

రంజాన్, క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని నిరుపేద మైనారిటీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం దుస్తులను పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ముస్లిం ప్రార్థనా మందిరాల్లో అధికారికంగా ఇఫ్తార్ విందులు, క్రిస్మస్ సందర్భంగా చర్చిల్లో క్రిస్మస్ విందులు ఏర్పాటుచేస్తున్నది.

టీఎస్ ప్రైమ్

మైనారిటీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీఎస్ ప్రైమ్ పథకం అమలవుతున్నది. దీనిద్వారా మైనారిటీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే రాయితీలు, ప్రోత్సహకాలు కల్పిస్తున్నారు.

అనీస్ ఉల్ గుర్బా భవన నిర్మాణం

నాంపల్లిలో 4,300 చదరపు గజాల స్థలంలో రూ.20 కోట్ల వ్యయంతో ముస్లిం అనాథలకు అనీస్ ఉల్ గుర్భా కొత్త భవనం నిర్మిస్తున్నది.

మైనారిటీ యువతకు ప్రత్యేక శిక్షణ

వివిధ రంగాల్లో మైనారిటీ యువత రాణించేందుకు వీలుగా నాక్, ఈసీఐఎస్, సీఐపీఈటీ, సెట్విన్ సంస్థల ద్వారా నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తున్నది.

చర్చిల నిర్మాణ అనుమతులు సులభతరం

స్థానిక సంస్థల అనుమతితో చర్చిలను నిర్మించుకునే వీలుకల్పించింది.

మక్కామసీదు అభివృద్ధి

హైదరాబాద్‌లోని మక్కామసీదుకు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.8.48 కోట్లు మంజూరుచేసింది.

షాదీఖానాల నిర్మాణం

ముస్లింల సామాజిక వికాసం కోసం పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్రవ్యాప్తంగా షాదీఖానాలు, ఉర్దూ ఘర్‌ల నిర్మాణం జరుగుతున్నది.

సిక్కుల కోసం గురుద్వారా నిర్మాణం

హైదరాబాద్‌లో గురుద్వారా నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

ఇమామ్, మౌజమ్‌లకు భృతి

దేశంలో ఎక్కడాలేనివిధంగా మసీదుల్లో ప్రార్థనలుచేసే ఇమామ్, మౌజమ్‌లకు నెలకు రూ.5 వేల భృతిని అందజేస్తున్నది.

ఇస్లామిక్ సెంటర్

హైదరాబాద్‌లోని కోకాపేటలో 10 ఎకరాల స్థలంలో రూ.40 కోట్ల వ్యయంతో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్‌ను నిర్మిస్తున్నది.

ఉర్దూ భాషాభివృద్ధి

తెలంగాణ ప్రభుత్వం ఉర్దూను రెండవ అధికార భాషగా ప్రకటించింది. విద్యార్థులు ప్రథమ భాషగా చదువుకునే అవకాశం కల్పించింది. అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాలు, కలెక్టరేట్లలో 66 మంది ఉర్దూ అధికారులను నియమించింది.

బీసీ సంక్షేమం
ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్

అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి, ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది.

గొర్రెల పంపిణీ

రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీపై రూ.4వేల కోట్లతో 84 లక్షల గొర్రెలు పంపిణీచేస్తున్నది. ఉచితంగా దాణ, మందులు ఇస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నది.

ఉచితంగా చేపపిల్లల పంపిణీ

మత్స్యకారుల కోసం చెరువులు, ఇతర జలాశయాల్లో పెంచేందుకు ఉచితంగా చేపపిల్లల సరఫరా చేస్తున్నది.

చేనేత కార్మికుల సంక్షేమం

బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంచే చీరలను, హాస్పిటళ్లలో చద్దర్లు, విద్యార్థులు, పోలీసులకు యూనిఫారాల వస్ర్తాలకోసం నేత, చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తున్నది. నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మిస్తున్నది. సిరిసిల్ల, గద్వాలలో టెక్స్‌టైల్ హబ్‌లను ఏర్పాటుచేస్తున్నది. చేనేత కార్మికుల రుణాలను మాఫీచేసింది.

గీత కార్మికుల సంక్షేమం

తాటి చెట్లపై పన్ను రద్దు చేయడమేగాక,పాత బకాయిలనూ మాఫీ చేసింది. లైసెన్సు కాలపరిమితిని 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచింది. హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను పునరుద్ధరించింది.
kcrscam6

రజకులకు చేయూత

ప్రభుత్వం ఆధునిక దోభీ ఘాట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఆధునిక యంత్రాలతో లాం డ్రీల ఏర్పాటు, వ్యక్తిగత ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తున్నది. ప్రభుత్వ దవాఖానలు, హాస్టళ్లలో దుస్తులు ఉతికే బాధ్యత రజకులకే అప్పగించాలని నిర్ణయించింది.

నవీన క్షౌరశాలల ఏర్పాటు

నాయీబ్రాహ్మణులు క్షౌరశాలలు పెట్టుకునేందుకు వందశాతం సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకునే సెలూన్లకు గృహ క్యాటగిరీ చార్జీలను మాత్రమే వసూలు చేస్తున్నది.

పౌల్ట్రీ పరిశ్రమకు ప్రోత్సాహం

పౌల్ట్రీ పరిశ్రమకు యూనిట్ కరంటును రూ.2 చొప్పున సబ్సిడీపై అందిస్తున్నది. అంగన్‌వాడీ సెంటర్లకు మధ్యాహ్న భోజన పథకానికి సోషల్ వెల్ఫేర్ పాఠశాలల కోసం గుడ్ల కొనుగోలు ద్వారా పౌల్ట్రీ పరిశ్రమకు లాభం కలిగిస్తున్నది.

బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం

వివిధ వృత్తులను ఆధునీకరించుకొనే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చేసుకునే వారికి ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఆర్థికసాయం అందిస్తున్నది.

అగ్రవర్ణాల్లోని పేదలకోసం ప్రత్యేక పథకాలు

ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం, కల్యాణలక్ష్మి లా ంటి సంక్షేమ పథకాల ఫలాలను అన్ని కులాలలోని పేదలకు పంచుతున్నది. బలహీనవర్గాలతోపాటు అగ్రవర్ణ పేదలకోసం ప్రథకాలను రూపకల్పనచేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది.

బ్రాహ్మణ పరిషత్

బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటుచేసి, ప్రతి ఏడాది రూ.100 కోట్లు కేటాయిస్తున్నది.

ధూపదీప నైవేద్యం పథకం

అన్ని దేవాలయాల్లో దూపదీప నైవేద్యం కోసం ప్రభుత్వం నెలకు రూ.6 వేలు అందిస్తున్నది.

అర్చకులకు ప్రభుత్వం జీతం

అర్చకులు, పూజారులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తున్నది.

జర్నలిస్టుల సంక్షేమం

జర్నలిస్టుల సంక్షేమానికి 120 కోట్లను కేటాయించింది. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడంతోపాటు ఐదేండ్ల వరకు వారి కుటుంబానికి నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ అందిస్తున్నది. గాయపడి నిస్సహాయ స్థితిలో వున్న వారికి 50 వేలు సా యం చేస్తున్నది. తల్లిదండ్రులతోపాటు కుటుం బ సభ్యులందరికీ వర్తించేలా ప్రభుత్వం ప్రతి జర్నలిస్టుకు హెల్త్‌కార్డు, ఉచిత బస్సుపాస్‌లు ఇచ్చింది.

న్యాయవాదుల సంక్షేమం

న్యాయవాదుల సంక్షేమంకోసం ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటుచేసింది. న్యాయవాదులకు హెల్త్‌కార్డులను అందజేయాలని నిర్ణయించింది. న్యాయవాది జీవిత భాగస్వామికి రూ.2 లక్షల ఆరోగ్య బీమా, ప్రమాదంలో మరణించిన న్యాయవాది కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెల్లించేలా ఇన్సూరెన్స్ కంపెనీలతో అడ్వకేట్స్ ట్రస్ట్ ఒప్పందం చేసుకున్నది.

మహిళా-శిశు సంక్షేమం
మహిళా రిజర్వేషన్లు

మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో తీర్మానంచేసింది. మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించింది.

కేసీఆర్ కిట్

ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించడానికి గర్భిణికి రూ.12 వేల నగదు, రూ.3 వేల కిట్ అందిస్తున్నారు. ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా అందిస్తున్నారు.

అమ్మఒడి వాహనాలు

గర్భిణులను దవాఖానాకు తీసుకురావడానికి, ప్రసవం తర్వాత బిడ్డతో సహా ఇంటికి చేర్చడానికి అమ్మఒడి వాహనాలను (102 వాహనం) నడుపుతున్నది.

టూవీలర్ 108 వాహనాలు

ప్రమాద సందర్భాల్లో సత్వర సాయమందించేందుకు 108 బైక్ అంబులెన్సులు ప్రవేశపెట్టింది.

రెక్కలు వాహనాల పథకం

ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి తల్లీబిడ్డలకు సేవలందించేందుకు రాయితీతో ద్విచక్ర వాహనాలను అందించింది. గర్భిణుల పేర్ల నమోదు, టీకాలు, ఇతర వైద్యసేవలకు 6,500 వాహనాలను సమకూరుస్తున్నారు.

ఆరోగ్యలక్ష్మి పోషకాహారం

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ప్రతిరోజూ ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనాన్ని అందించే ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నది. గుడ్లతోపాటు గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ప్రతి నెలా అందిస్తున్నది.

మహిళా ఆర్గనైజర్లు

మాతాశిశు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడం కోసం16 మంది మహిళా ఆర్గనైజర్లను నియమించింది.

బాలికా ఆరోగ్యరక్ష పథకం

ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలలో చదువుకుంటున్న 8 లక్షల మంది విద్యార్థినులకు హెల్త్, హైజెనిక్ కిట్లను అందిస్తున్నది.

స్త్రీ నిధి - పది లక్షల వరకు వడ్డీ లేని రుణం

4.60 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లో 8.58 లక్షల కుటుంబాలకు ఉపయోగపడేలా వడ్డీలేని రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తున్నది.

దివ్యాంగుల సంక్షేమం

దివ్యాంగులకు పూర్తి సబ్సిడీతో మోటరు సైకిళ్లను పంపిణీచేయాలని నిర్ణయించింది. దివ్యాంగ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.850 నుంచి రూ.1500 లకు పెంచింది. దివ్యాంగులకు 80శాతం సబ్సిడీతో రూ.లక్ష రుణసౌకర్యం కల్పించింది. రూ.10 లక్షల రుణానికి 50 శాతం సబ్సిడీ అందిస్తున్నది. పారిశ్రామిక రంగంలో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా దివ్యాంగులకు కూడా అన్ని రాయితీలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దివ్యాంగులను పెళ్లిచేసుకునే వారికి ఇచ్చే ప్రోత్సాహక బహుమతిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచింది. వికలాంగులకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తున్నది.

రైతు సంక్షేమం రైతులకు రుణమాఫీ

రాష్ట్రంలోని 35.29 లక్షల మంది రైతులకు చెందిన 16,124.37 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.

రైతుబంధు-ఎకరానికి రూ.8 వేలు


ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.8 వేలను ప్రభుత్వం రైతులకు పెట్టుబడిగా అందిస్తున్నది. 58 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించడం కోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించింది.

రైతు బీమా

18 నుంచి 60 సంవత్సరాల వయసున్న రైతులందరికీ ప్రభుత్వం ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నది. ఒక్కో రైతుకు ఏటా రూ.2,271 ప్రీమి యం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతు మరణించిన పది రోజుల్లోగానే నామినీకి రూ.5 లక్షల సొమ్ము అందుతున్నది.

24 గంటల ఉచిత విద్యుత్

రాష్ట్రంలోని 24 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నది.

రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ

2009 నుంచి రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ పాత బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేండ్లలో 37,45,102 మంది రైతులకు మొత్తం రూ.1325 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందింది.

ఏఈవోల నియామకం

ప్రతి ఐదువేల ఎకరాలకు ఒకరు చొప్పున రాష్ట్రంలో కొత్తగా 2,162 మంది వ్యవసాయ విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది.

రైతు సమన్వయసమితుల ఏర్పాటు

రైతులను సంఘటితశక్తిగా మార్చడానికి ప్రభు త్వం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేసింది.

రైతు వేదిక నిర్మాణం

రైతులు పరస్పరం చర్చించుకోవడానికి ప్రతీ ఐదువేల ఎకరాల వ్యవసాయ క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మిస్తున్నది.

భూ రికార్డుల ప్రక్షాళన

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని భూముల రికార్డుల ప్రక్షాళన జరిగింది. యాజమాన్యాల విషయంలో 94% స్పష్టత వచ్చింది. ఈ వివరాల ఆధారంగానే కొత్త పాస్‌పుస్తకాల జారీ, పంట పెట్టుబడి మద్దతు పథకం అమలుచేస్తున్నది. అభ్యంతరాలు కలిగిన భూములను 2దశలో పరిష్కరిస్తారు.

ధరణి వెబ్ సైట్

భూరికార్డుల డిజిటలైజేషన్, ఆన్లైన్ నిర్వహణ అంతా పకడ్బందీగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి ఎకరం భూభాగం వివరాలు పొందుపరుస్తూ, ఎప్పటికప్పుడు చోటుచేసుకునే మార్పులను కూడా నమోదు చేసుకుంటూ, ధరణి వెబ్‌సైట్‌ను కోర్ బ్యాంకింగ్ తరహాలో నిర్వహిస్తుంది.

సాదా బైనామాలకు పట్టాలు

సాదా బైనామాల మీద జరిగిన భూముల క్రయ విక్రయాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్‌చేసింది.

సకాలంలో ఎరువులు, విత్తనాలు

రైతులకు ఎరువులు, విత్తనాలను కొరతలేకుండా సరఫరాచేస్తున్నది.

కల్తీకి పాల్పడేవారిపై పీడీ చట్టం

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను కల్తీచేసే వారిని, అమ్మేవారిని కఠినంగా శిక్షించడంకో సం ఈ నేరాలను పీడీ చట్టంపరిధిలోకి తెచ్చింది.

వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం

వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వంఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీతో, ఇతర రైతులకు 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రపరికరాలను అందిస్తున్నది.

సబ్సిడీపై ట్రాక్టర్లు

50% నుంచి 90% సబ్సిడీపై రైతులకు ప్రభుత్వం వ్యవసాయ ట్రాక్టర్లు అందిస్తున్నది. వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్నును కూడా రద్దుచేసింది. నాలుగేండ్లలో 14 వేల ట్రాక్టర్లు పంపిణీచేసింది. ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, టెంపరరీ రిజిస్ట్రేషన్, కమర్షియల్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, జీఎస్టీని మినహాయించింది.

రైతు బజార్లు

రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు చౌకధర లభించడం కోసం ప్రభుత్వం 59 రైతుబజార్లు నిర్వహిస్తున్నది.
kcrscam0

లీటరుకు రూ.4 ఇన్సెంటివ్

పాల సొసైటీలకు చెందిన 2.13 లక్షల మంది రైతులకు సబ్సిడీపై బర్రెలు అందించేందుకు ఒక్కో యూనిట్‌కు 80 వేల రూపాయలు కేటాయించింది. రవాణా ఖర్చులకోసం మరో ఐదు వేల రూపాయలు అదనంగా అందిస్తున్నది. ఎస్సీ ఎస్టీ లకు 75 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. పాడి రైతులకు లీటరుకు 4 రూపాయలు ప్రోత్సాహకంగా అందజేస్తున్నది.

దేశంలోనే తొలిసారిగా సంచార పశు వైద్యశాలలు

ప్రతి గ్రామీణ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 100 సంచార పశు వైద్యశాలలను ప్రభు త్వం నిర్వహిస్తున్నది. 1962 నంబర్‌కు ఫోన్ చేసి న అరగంటలో సంచార పశు వైద్యశాల వస్తుంది.

మైక్రో ఇరిగేషన్

తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశమున్న మైక్రో ఇరిగేషన్‌కు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ఈ పథకం ద్వారా షెడ్యూల్ కులాలు/షెడ్యూల్ తెగల రైతులకు 100% రాయితీ, వెనుకబడిన తరగతులకు.. సన్న, చిన్నకారు రైతులకు 90% రాయితీ, ఇతర రైతులకు 80% రాయితీలు ఇస్తున్నది.

పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ సబ్సిడీ

75 శాతం సబ్సిడీతో పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ కల్టివేషన్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీ అందిస్తున్నది.

గోదాముల నిర్మాణం కోల్డ్ స్టోరేజ్ లింకేజి

తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4.17 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన 176 గోదాములు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 18.30 లక్షల టన్నుల సామర్ధ్యం కలిగిన 364 గోడౌన్ల6 నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 22.47 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన 540 గోదాములు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజి లింకేజీ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.

స్పెషలైజ్డ్ మార్కెట్లు

నల్లగొండ జిల్లా గంధంవారిగూడెం దగ్గర రూ.1.50 కోట్లతో బత్తాయి మార్కెట్‌ను, నకిరేకల్‌లో రూ.3.07 కోట్లతో నిమ్మకాయల మార్కెట్‌ను, పీఏ పల్లి మండలం కొనమేకలవారిగూడెం దగ్గర రూ.60.30 లక్షలతో దొండ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నది. మామిడి మార్కెట్‌ను కొల్లపూర్‌లో నిర్మించడానికి చర్యలు చేపడుతున్నారు.

మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు

దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీచేశారు. రిజర్వేషన్ల వల్ల 25 మంది ఎస్సీలు, 10 మంది ఎస్టీలు, 50 మంది బీసీలు మార్కెట్ కమిటీలకు చైర్మన్లు కాగలిగారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వల్ల, 60 మంది మహిళా రైతులు చైర్మన్లు అయ్యారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షలు

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని లక్షన్నర రూపాయలు నుంచి ఆరు లక్షల రూపాయలకు పెంచింది.

నీటి తీరువా రద్దు

నీటి తీరువా పన్ను బకాయిలను మాఫీ చేసింది. పన్ను విధానాన్ని రద్దు చేసింది.

సాగునీటి రంగం
ప్రాజెక్టుల నిర్మాణం

గోదావరి, కృష్ణ నదుల మీద 23 భారీ ప్రాజెక్టులు, 13 మధ్యతరహా ప్రాజెక్టుల పనులను ప్రభుత్వం చేపట్టింది. బడ్జెట్లో ప్రాజెక్టులకు ఏటా 25 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది.

మహారాష్ట్రతో ఒప్పందం

గోదావరి జలాల సమగ్ర వినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నది.

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి

కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, మిడ్‌మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెం వాగు, కుమ్రంభీం, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్ లాంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా ఇప్పటికే 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నది. మొత్తం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు, సదర్‌మాట్ బ్యారేజి, మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం చేపట్టింది. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేయడంతో పాటు, 365 రోజులపాటు ఈ ప్రాజెక్టుకు నీరు అందుబాటులో ఉండేందుకు గోదావరిపై తుపాకులగూడెం బరాజ్‌ను నిర్మిస్తున్నది.

పాలమూరు-రంగారెడ్డి

పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని భూములకు సాగునీరు అందించడానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నది.

భక్త రామదాసు సీతారామ ప్రాజెక్టు

రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతలను నిర్మించింది. ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం పురోగతిలో ఉన్నది.

కాళేశ్వరం ప్రాజెక్టు

నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందిన 40 లక్షల ఎకరాలకు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రికార్డు సమయంలో పూర్తిచేసే విధంగా పనులు జరుగుతున్నాయి.

మిషన్ కాకతీయ

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ సత్ఫలితాలనిచ్చింది. 46,500 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే ప్రధానమైన చెరువుల పనులు పూర్తయ్యాయి. చిన్న చెరువులు, కుంటల పనులు పురోగతిలో ఉన్నాయి.

మిషన్ భగీరథ

ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం చేపట్టింది. రూరల్ ప్రాంతాల్లోని 24,248 ఆవాస ప్రాంతాలకు, 52.47 లక్షల నివాసాలకు, 65 అర్బన్ ఏరియాల్లోని 12.83 లక్షల నివాసాలకు నీరు అందనుంది. ఔటర్ రింగ్‌రోడ్ పరిధిలోని 7 అర్బన్ లోకల్ బాడీలు, రూరల్ ప్రాంతాల్లోని 183 ఆవాస గ్రామాలకు ఈ పథకం ద్వారా నీళ్లు అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు ప్రతి రోజు సురక్షిత తాగునీరు అందించనున్నారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్లు

నిరుపేదల ఆత్మగౌరవం కాపాడేలా 560 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 2,72,000 ఇండ్ల నిర్మాణం పురోగతిలో ఉన్నది.
kcrscam5

తెలంగాణకు హరితహారం

తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడంకోసం తెలంగాణకు హరితహారం చేపట్టింది. ఇప్పటి వరకు 82 కోట్ల మొక్కలు నాటారు. 2019 నుంచి ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఏర్పాటుచేసి, రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 100 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

పరిపాలన సంస్కరణలు

ప్రజలకు పరిపాలనను మరింత చేరువచేయడం కోసం మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలను విజయవంతంగా అమలుచేసింది. చరిత్రలో ఇంతతక్కువ సమయంలో ఇంత భారీ పాలనా సంస్కరణలు మరెక్కడా జరగలేదు. పరిపాలనా సౌలభ్యంకోసం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వేగాన్ని, పారదర్శకతను పెంచడంకోసం, 10 జిల్లాలను 31 జిల్లాలు చేసింది. 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలు చేసింది. గతంలో 68 మున్సిపాలిటీలుంటే, కొత్తగా మరో 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఇప్పుడు మొత్తం 136 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి. గతంలో 8,690 గ్రామ పంచాయితీలుంటే, కొత్తగా 4,383 గ్రామ పంచాయితీలను ఏర్పాటుచేసింది. ఇప్పుడు తెలంగాణలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ప్రజలు ఇటీవలే కొత్త గ్రామ పంచాయితీల, కొత్త మున్సిపాలిటీల ప్రారంభోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.ప్రభుత్వం పోలీస్ శాఖలోనూ కూడా భారీగా పాలనా సంస్కరణలు తెచ్చింది. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం రెండే రెండు పోలీస్ కమిషనరేట్లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్యను 9కి పెంచుకున్నాం. పోలీస్ సబ్ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు పెంచుకున్నాం. సర్కిల్ కార్యాలయాలను 688 నుంచి 717కు పెంచుకున్నాం. పోలీస్ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 814కు పెంచుకున్నాం.

సమీకృత జిల్లా కలెక్టరేటు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు (డీపీవో)లు ప్రభుత్వం నిర్మిస్తున్నది.

కోతల్లేని విద్యుత్

రాష్ట్రంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. తెలంగాణ ఏర్పడిననా డు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుంటే, నేడు 16వేల మెగావాట్లకు చేరింది. 28 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించి, తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చడం కోసం కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నది.

రహదారుల నిర్మాణం

57 ఏండ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో మొత్తం 2,527 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరైతే, కేవలం నాలుగేండ్లలోనే అంతకన్నా ఎక్కువగా 3,155 కిలోమీటర్ల నిడివిగల 36 జాతీయ రహదారులను ప్రభుత్వం మంజూరు చేయించుకోగలిగింది. దీనివల్ల నేడు తెలంగాణలో మొత్తం 5,682 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్‌వర్క్ ఏర్పడింది. 16వేల కోట్ల ఖర్చుతో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లను, వంతెనలను అభివృద్ధి చేసింది. వేల సంఖ్యలో ఉన్న మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చింది. సింగిల్‌లేన్ రోడ్లను డబుల్‌లేన్ రోడ్లుగా మార్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,146 కొత్త వంతెనల నిర్మాణం చేపట్టింది.

హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగురోడ్డు

ఇప్పుడున్న ఔటర్ రింగురోడ్డుకు అవతల 330 కిలోమీటర్ల రీజనల్ రింగురోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి-గజ్వేల్-చౌటుప్పల్-మాల్-కడ్తాల్-షాద్ నగర్- చేవెళ్ల-కంది పట్టణాలను కలుపుతూ వలయాకారంలో ఆరు లేన్ల రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. అంతర్జాతీయ స్థాయి ఎక్స్‌ప్రెస్ హైవేగా రీజనల్ రింగురోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎమ్మెల్యేలకు కార్యాలయాలు

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని నిర్మిస్తున్నది.

విద్యారంగం కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి కేవలం 298 (261+37 జనరల్) రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవి. కేవలం మూడేండ్లలో కొత్తగా 663 (610 + 53 డిగ్రీ కాలేజీలు) రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరుచేసింది. ఎస్సీలకు 134, ఎస్టీలకు 64, బీసీలకు 261, మైనారిటీలకు 204 రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరయ్యాయి.

విద్యార్థుల విదేశీవిద్యకు ఓవర్సీస్ స్కాలర్ షిప్స్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు విదేశీవిద్యను అభ్యసించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం అమలుచేస్తున్నది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీసర్కిల్స్

పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం కోసం జిల్లా స్థాయిలోఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటుచేసింది.

ప్రజావైద్యం మెరుగైన వైద్యసేవలు

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఒక్కొక్క బెడ్ నిర్వహణకు ప్రతీ నెల సగటున రూ.5,016 ఖర్చు చేస్తున్నది. రూ.600 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల కోసం కొత్త వైద్య సామాగ్రి కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 40 డయాలిసిస్ సెంటర్లు, 40 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. 25 ప్రభుత్వ దవాఖానల్లో ఐసీయూలు, 12 చోట్ల క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసింది.

హైదరాబాద్‌లో బస్తీ దవాఖానలు

హైదరాబాద్‌లోని వివిధ డివిజన్లలో ప్రభుత్వం బస్తీ దవాఖానాల(అర్బన్ హెల్త్ క్లీనిక్)ను ప్రారంభించింది. పేదలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తొలివిడతగా 50 బస్తీ దవాఖానలు ఏర్పాటయ్యాయి.

కంటి వెలుగు

అందరికీ కంటిపరీక్షలు నిర్వహించడానికి ప్రభు త్వం కంటివెలుగు పథకం అమలుచేస్తున్నది. ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేయడంతోపాటు ఆపరేషన్లు కూడా ఉచితంగానే జరిపిస్తున్నది.

పరమపదవాహనాలు

ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందుతూ మరణించినవారి మృతదేహాలను ఉచితంగా ఇంటికి పంపడానికి ప్రభుత్వం పరమపద వాహనాలను ఏర్పాటుచేసింది.

ఉద్యోగుల సంక్షేమం

ఉద్యోగులందరికీ తెలంగాణ సాధన ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరుచేసింది. సకల జనుల సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవుగా నిర్ణయించింది. 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు గ్రాట్యుటీని చెల్లిస్తున్నది. హెల్త్‌కార్డులు అందించింది.

ఉద్యోగ నియామకాలు కొత్త జోనల్ వ్యవస్థ

స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా తెలంగాణలో నూతన జోనల్, మల్టీజోనల్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కొత్త జోనల్ విధానం ప్రకారమే పెద్దఎత్తున నియామకాలు జరుగనున్నాయి. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు గుర్తించిన ఉద్యోగఖాళీలు 32,733. భర్తీచేసినవి 11,333. ఫలితాలు రావాల్సివున్నది 21,094. పరీక్షలకు సిద్ధంగా వున్నవి 306. నోటిఫికేషన్లకు సిద్ధంగా వున్నవి 8,206. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు జరిగిన నియామకాలు 25,004. రిక్రూట్‌మెంట్ ద్వారా 2,681, రెగ్యులరైజేషన్ ద్వారా 22,323, కొత్త నియామకాలు జరుగాల్సినవి 3,600. పోలీసుశాఖలో ఇప్పటివరకు జరిగిన నియామకాలు 10,980. కొత్త నియామకాలు జరుగాల్సినవి 25,000. సింగరేణిలో మొత్తం నియామకాలు 9,884. నేరుగా జరిగిన నియామకాలు 5,500. డిపెండెంట్ ఉద్యోగాలు 4,384. ఆర్టీసీలో 4,020 మంది రెగ్యులరైజేషన్, డిపెండెంట్ ఉద్యోగాలు 1,137. యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలలో మొత్తం 20,614. ఇప్పటివరకు జరిగిన నియామకాలు 9,614. కొత్తగా చేపట్టే నియామకాలు 11,000.

పరిశ్రమలు - ఐటీ 110. టీఎస్ ఐపాస్

సింగిల్‌విండో విధానం: పరిశ్రమలకు కేవలం 15 రోజుల్లోనే అనుమతులిచ్చేందుకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ ఎండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్‌ఐపాస్) చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. 15 ఆగస్టు, 2018 నాటికి రూ.1,32,000 కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి తరలివచ్చాయి. ఆన్‌లైన్ విధానం ద్వారా 7,697 పరిశ్రమలకు అనుమతులు మంజూరుచేశారు. వీటిలో 2.50 లక్షల మంది ఉపాధి అవకాశాలు పొందారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)

ఐటీ కంపెనీల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. మే 2018 నాటికి 1500 ఐటీ/ఐటీఈఎస్ కంపెనీల్లో 4.75 లక్షల మందికిపైగా ప్రత్యక్షంగా, ఏడు లక్షలమందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఐటీ ఎగుమతులు రూ.లక్ష కోట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని ఐటీ ఇంక్యుబేటర్ సెంటర్ టీ-హబ్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది. ద్వితీయశ్రేణి నగరాలైన కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు.

శాంతిభద్రతలు

పోలీసుశాఖను బలోపేతం చేయడంవల్ల సమర్థవంతంగా శాంతిభద్రతల పరిరక్షణ జరుగుతున్నది. రాష్ట్రం అంతటా లక్షలాది సీసీ కెమెరాలనుపెట్టి నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది. హైదరాబాద్‌లో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం అవుతుంది. షీ టీమ్స్ కృషిఫలితంగా మహిళలకు భద్రత ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం కాలుష్య అలవెన్స్ ఇస్తున్నది.

విశ్వనగరంగా హైదరాబాద్

రూ.35 వేల కోట్లతో హైదరాబాద్‌లో ప్రభుత్వం వివిధ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టింది. ట్రాఫిక్ సమస్య నివారణకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం కింద రూ.25 వేల కోట్ల రూపాయలతో ైఫ్లె ఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఉపరితల రహదారులు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. రహదారులు అభివృద్ధి పరచడానికి 2,716 కోట్లతో పనులు జరుగుతున్నాయి. తాగునీటి అవసరాలు తీర్చేవిధంగా 20 టీఎంసీల సామర్థ్యంతో రెండు జలాశయాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. వచ్చే ఐదేండ్లలో 50 వేల కోట్ల వ్యయంతో హైదరాబాద్ నగరంలో మౌలికవసతులను మెరుగుపరిచే ప్రణాళిక అమలవుతుంది.

సింగరేణి కార్మికుల సంక్షేమం

సింగరేణి సాధించిన లాభాల్లో కార్మికులకు 27 శాతం వాటా చెల్లిస్తున్నది. ఇండ్లు కట్టుకోవడానికి రూ. పదిలక్షల వడ్డీలేని రుణం అందిస్తున్నది. సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన పీఆర్పీ బకాయిలను వెంటనే విడదులచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కారుణ్య నియామకాలు చేపట్టడానికి రంగం సిద్ధంచేసింది.

తప్పనిసరిగా తెలుగు:

అన్ని విద్యాసంస్థల్లో పదో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ ఆలయాల అభివృద్ధి

యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర, ధర్మపురి, జోగుళాంబ, కొమురవెల్లిమల్లన్న, కురవి వీరన్న తదితర పుణ్యక్షేత్రాలు, నాగార్జునకొండ వంటి బౌద్ధారామాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అధికారికంగా తెలంగాణ పండుగలు:

బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగలకు ప్రభుత్వం అధికారికహోదా కల్పించింది.

బతుకమ్మ చీరెలు

బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పేద మహిళలందరికీ ప్రభుత్వం చీరెలు పంపిణీచేస్తున్నది.

తెలంగాణ ప్రముఖులకు జయంతి, వర్ధంతి

వివిధ రంగాల్లో విశేష సేవలందించిన తెలంగాణ ప్రముఖుల జయంతులను, వర్ధంతులను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. వారి పేరుమీద విద్యాలయాలు, ప్రభుత్వసంస్థలను నెలకొల్పింది. కుమ్రంభీం, జయశంకర్ పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పాటుచేసింది.

మ్యానిఫెస్టోలో ప్రకటించకుండా అమలుచేస్తున్న పథకాలు

1. కల్యాణలక్ష్మి /షాదీముబారక్ - పేద ఆడపిల్ల పెండ్లికి రూ.1,00,116 ప్రభుత్వ సాయం
2. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు నెలకు రూ.1,000 భృతి
3. కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, జర్నలిస్టులు, హోంగార్డులు, డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులకు రూ.5లక్షల ప్రమాద బీమా
4. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొన్న 1.25 లక్షల మందికి ఉచితంగా పట్టాల పంపిణీ
5. దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం
6. రూ.120 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి
7. చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి లక్ష రూపాయల సాయం, నెలకు రూ.3వేల పెన్షన్
8. గాయపడిన జర్నలిస్టులకు రూ.50వేల సాయం
9. కుటుంబ సభ్యులు అందరికీ వర్తించేలా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, వెల్ నెస్ సెంటర్లు
10. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.100 కోట్లతో న్యాయవాదుల కోసం సంక్షేమ నిధి
11. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ పరిషత్
12. ఆటోలకు రవాణా పన్ను రద్దు
13. ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
14. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం టీఎస్ ప్రైడ్
15. దేశంలో ఎక్కడాలేని విధంగా సివిల్ కాంట్రాక్టులలోఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్
16. మసీదుల్లో ప్రార్థనాదికాలు నిర్వహించే ఇమామ్, మౌజమ్‌లకు నెలకు రూ.5,000 జీవనభృతి
17. మైనార్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీఎస్ ప్రైమ్ పథకం
18. రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ
19. స్థానిక అనుమతితో చర్చిల నిర్మాణం చేసుకునే విధంగా అనుమతుల ప్రక్రియ సులభతరం
20. హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో రూ.40 కోట్ల వ్యయంతోఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్
21. 75 శాతం సబ్సిడీతో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో గొర్రెల పంపిణీ
22. ఉచితంగా చేపపిల్లల పంపిణీ, జలాశయాల్లో పెంపకం - మత్స్యకారులకు ఉపాధి
23. చేనేతకు చేయూత - 50 శాతం సబ్సిడీపై నూలు, రసాయనాలు, నేత ఉత్పత్తుల కొనుగోళ్లు
24. కల్లుగీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు, సొసైటీల లైసెన్సు కాలపరిమితి పదేండ్లకు పెంపు
25. రజకులకు పరికరాల కొనుగోలు కోసం ఆర్థికసాయం
26. నాయీబ్రాహ్మణులకు నవీన క్షౌరశాలలకు వందశాతం సబ్సిడీతో ఆర్థికసాయం, సెలూన్లకు గృహ క్యాటగిరీ విద్యుత్ చార్జీలు వర్తింపు
27. కోళ్ల పరిశ్రమకు యూనిట్ కరెంటుపై రూ.2 సబ్సిడీ
28. వివిధ కులవృత్తులవారికి బ్యాంకులతో నిమిత్తం లేకుండా నేరుగా ఆర్థిక సహాయం
29. బలహీనవర్గాల గృహ నిర్మాణం పథకం, రుణాలు రద్దు
30. హైదరాబాద్‌లో అన్ని కులాల సామూహిక వికాసం కోసం ఆత్మగౌరవ భవనాలు
31. కేసీఆర్ కిట్ - గర్భిణులకు నగదు, ప్రత్యేక కిట్టు రూపంలో రూ.15 వేల ఆర్థిక సహాయం
32. ప్రసవం కోసం మహిళలు దవాఖానకు రావడానికి అమ్మఒడి పేరుతో వాహనాలు
33. మార్కెట్ కమిటీల్లో దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
34. రైతుబంధు - ఏటా ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి సాయం
35. రైతుబీమా - రైతు మరణిస్తే అతడి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత బీమా సదుపాయం
36. ఆత్మహత్య పాలైన రైతు కుటుంబానికిచ్చే పరిహారం లక్షన్నర నుంచి రూ.6 లక్షలకు పెంపు
37. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్
38. 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం
39. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, రైతు వేదికల నిర్మాణం
40. భూ రికార్డుల ప్రక్షాళన, భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత
41. సాదా, బైనామాలకు చట్టబద్ధత
42. వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణాపన్ను రద్దు
43. సబ్సిడీపై బర్రెల పంపిణీ
44. పాడి రైతులకు లీటరుకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్
45. నీటి తీరువా పన్ను రద్దు - బకాయిలు మాఫీ
46. ఆర్మూరు ఎర్రజొన్న రైతులకు రూ.9.5 కోట్లు చెల్లింపు
47. వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం నియామకంలో రిజర్వేషన్లు
48. పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం
49. ఉద్యోగులకు హెల్త్ కార్డులు, వెల్‌నెస్ సెంటర్లు
50. హోంగార్డులు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, ఐకేపీ, సెర్ప్, నరేగా, 108 ఉద్యోగులు, కాంట్రాక్టు-ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వీఆర్‌ఏలు, వీఏవోలు, కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, పార్ట్ టైమ్ లెక్చరర్లు, అటెండర్లు, సీఆర్టీలు, అర్చకులు, జీహెచ్‌ఎంసీ కార్మికులు, డ్రైవర్లు, ప్రభుత్వ న్యాయవాదులు, గురుకులాలు, ఆర్టీసీ, విద్యుత్ సంస్థల ఉద్యోగులకు వేతనాలు భారీగా పెంపు
51. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపు
52. సింగరేణి కార్మికులకు లాభాల్లో 27శాతం వాటా చెల్లింపు
53. రేషన్ డీలర్లకు కమిషన్ పెంపు
54. విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారం
55. మెస్ చార్జీలు భారీగా పెంపు
56. రూ.20 లక్షలు ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్
57. విద్యార్థినులకు హైజెనిక్ హెల్త్ కిట్స్
58. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానలు
59. కంటి వెలుగు పథకం - రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి వైద్యశిబిరాలు
60. పరమపద వాహనాలు దవాఖానల్లో మరణించినవారి మృతదేహాలను వారి ఇంటికి చేర్చేందుకు ఉచిత వాహన సదుపాయం
61. కొత్త పోలీసు కమిషనరేట్లు, డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్లు
62. పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం ఫండ్ కేటాయింపు
63. ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్
64. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు
65. గుడుంబా నిర్మూలన
66. గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్బుల మూసివేత
67. పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
68. తెలంగాణ క్షేత్రాలు, ఆలయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి
69. అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ
70. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాలలో విశిష్ట కృషి చేసినవారికి రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో ప్రత్యేక పురస్కారాలు
71. తెలంగాణ మహా కవులు దాశరథి, కాళోజీ పేరుతో ప్రతి సంవత్సరం విశిష్ట పురస్కారాలు
72. తెలుగుభాషకు ప్రాచీనహోదా సాధన
73. పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి బోధనాంశం చేస్తూ చట్టం
74. అధికారికంగా బోనాల పండుగ
75. పేరిణికి పూర్వ వైభవం, ప్రభుత్వ నృత్య కళాశాలల్లో బోధనాంశంగా పేరిణీ నృత్యం
76. కొత్త డివిజన్లు, మండలాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల ఏర్పాటు

4691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS