ఏకగ్రీవం @ 2,130

Thu,January 24, 2019 02:19 AM

-రికార్డు సృష్టించిన గ్రామపంచాయతీలు
-తొలివిడుతలో 769, రెండోవిడుతలో 788, తుదివిడుతలో 573 ఏకగ్రీవం
-టీఆర్‌ఎస్ ఖాతాలో 1,789 ఏకగ్రీవాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రామపంచాయతీ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఏకగ్రీవాలు నమోదయ్యాయి. చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనివిధంగా ఈసారి 2,130 గ్రామ పంచాయతీలు ఏకతాటిపై నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాల్లో అభివృద్ధి నినాదం మారుమోగింది. ప్రధానంగా కొత్తగా ఆవిర్భవించిన గ్రామాలు ఎక్కువగా ఏకగ్రీవాల జాబితాలో చేరాయి. ఈ గ్రామాల్లో ముఖ్యంగా టీఆర్‌ఎస్ మద్దతుదారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వంలో ఉండి, గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి, అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతారనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ మద్దతుదారులవైపు ప్రజలు మొగ్గుచూపారు. దీంతో ఏకగ్రీవమైన మొత్తం 2,130 పంచాయతీల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు 1,789 మంది ఉన్నారు. స్వతంత్రులు రెండో స్థానంలో నిలిచారు. స్వతంత్రుల్లో కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలమైన వారే ఉండటం విశేషం.

తొలివిడుతలో 769 గ్రామాలు ఏకగ్రీవంకాగా, వీటిలో 603 మంది సర్పంచ్‌లు టీఆర్‌ఎస్ మద్దతుదారులే ఉన్నారు. రెండోవిడుతలో 788 ఏకగ్రీవ పంచాయతీల్లో 720 మంది సర్పంచ్‌లు టీఆర్‌ఎస్ మద్దతుదారులున్నారు. ఇక తుదివిడుత గణంకాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. కొన్ని జిల్లాల్లో జనరల్ అబ్జర్వర్లు ఏకగ్రీవ గ్రామాలపై నివేదిక ఇవ్వకపోవడంతో ఆ జాబితాను ఇంకా ప్రకటించలేదు. దీంతో ఇప్పటివరకు తేలిన లెక్కలప్రకారం మూడోవిడుతలో మొత్తం 573 పంచాయతీలు ఏకగ్రీవమైనట్టు తెలుస్తున్నది. వీటిలో 466 టీఆర్‌ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. 79 గ్రామాల్లో స్వతంత్రులు ఏకగ్రీవమవగా, మిగిలిన స్థానాల్లో వివిధ పార్టీల వారున్నారు.

ఏకగ్రీవాల్లో జడ్చర్ల సెగ్మెంట్ రికార్డ్

47 పంచాయతీలు ఏకగ్రీవం
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 47 గ్రామాల సర్పంచ్‌లు,వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నవాబ్‌పేట, మిడ్జిల్, రాజాపూర్, బాలానగర్, జడ్చర్ల, ఉర్కొండపేట మండలాల్లో మొత్తం 198 పంచాయతీలకు రెండోవిడుతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఎమ్మె ల్యే లకా్ష్మరెడ్డి చొరవ తీసుకొని ఏకగ్రీవాలపై సమావేశాలు నిర్వహించారు. పలుచోట్ల ఒకే నామినేషన్ దాఖలు కాగా మరికొన్ని చోట్ల నామినేషన్లు వేసిన పలువురు ఉపసంహరించుకోవటంతో ఏకగ్రీవాలకు మార్గం సుగమమైంది. అత్యధికంగా నవాబ్‌పేట మండలంలో 19 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. బాలానగర్‌లో 10, జడ్చర్లలో ఎనిమిది, రాజాపూర్‌లో ఆరు, మిడ్జిల్‌లో మూడు, ఉర్కొండపేటలో ఒక స్థానం ఏకగ్రీవమయింది. రాష్ట్రంలోని అత్యధిక ఏకగ్రీవాలు జరిగిన నియోజకవర్గంగా జడ్చర్ల రికార్డు సృష్టించింది. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అభినందించారు.

నవీపేటలో వార్డు స్థానానికి హిజ్రా పోటీ

నిజామాబాద్ జిల్లా నవీపేట మేజర్ గ్రామ పంచాయతీ 14 వార్డు స్థానానికి ట్రాన్స్‌జెండర్ అంకిత పోటీలో నిలిచారు. పంచాయతీ పరిధిలో 14 వార్డును జనరల్ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో మహిళగా ఓటు హక్కుకలిగి ఉన్న అంకిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అంకితకు గౌను గుర్తును కేటాయించగా బుధవారం ఇంటిం టా ప్రచారం నిర్వహించారు. తనను వార్డు స్థానానికి గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

భర్త ఎంపీటీసీ, భార్య సర్పంచ్

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గోరీలపాడుతండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ పోచారం ఎంపీటీసీగా ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన భార్య బానోత్ సరస్వతి గోరీలపాడు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజా సేవ చేసేందుకు తన భార్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చానని ఎంపీటీసీ శ్రీనివాస్ తెలుపగా.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని సర్పంచ్ బానోత్ సరస్వతి చెప్తున్నారు.

భార్య సర్పంచ్.. భర్త ఉపసర్పంచ్

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో భార్యాభర్తలు సర్పంచ్, ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఉత్కంఠభరింతంగా జరిగిన పోరులో టీఆర్‌ఎస్ మద్దతుతో పోటీచేసిన బాషబోయిన శైలజ 171ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మూడో వార్డు నుంచి పోటీచేసిన ఆమె భర్త బాషబోయిన వీరన్న కూడా గెలుపొందారు. వీరన్నను వార్డు మెంబర్లు ఉపసర్పంచ్‌గా ఎన్నుకోవటం విశేషం.

కాళ్లు కడిగి.. ఓట్లు అడిగి..

పెద్దపల్లి జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల పంచాయతీ బరిలో నిలిచిన కల్వల రమేశ్, తన భార్య వసంతతో కలిసి గ్రామంలోని ఓటర్ల కాళ్లు కడుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
- పెద్దపల్లి కలెక్టరేట్

2472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles