టీఆర్‌ఎస్ అభ్యర్థుల దూకుడు


Tue,September 11, 2018 02:38 AM

TRS candidates begin aggressive campaign

-ప్రజానీకం నుంచి విశేష స్పందన
-కారు గుర్తుకే ఓటేస్తామంటూ గ్రామాలు, కులసంఘాల తీర్మానాలు
-ప్రతిపక్షాలు తమ గ్రామాల్లోకి రావొద్దంటూ పలుచోట్ల ఫ్లెక్సీలు
-సిద్ధమవుతున్న ప్రచారరథాలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇంకా ప్రతిపక్షాలు పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చల దశలోనే ఉన్న తరుణంలో ఏకంగా 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్.. జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నది. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు, శ్రేణుల విస్తృత ప్రచారంతో అంతా ఎన్నికల సందడి కనిపిస్తున్నది. తమ గ్రామాలకు వస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజలు భారీ ర్యాలీగా ఎదురేగి ఘనస్వాగతం పలుకుతున్నారు. నుదుట తిలకాలు దిద్ది.. మంగళహారతులు పడుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాల్సిన అవసరాన్ని ప్రచారంలో పాల్గొంటున్న పలువురు నేతలు ప్రజలకు వివరించి చెప్తున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో సాధించిన అభివృద్ధిని ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ ఓట్లు అభ్యర్తిస్తున్నారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో తాము కారు గుర్తుకే ఓటేస్తామంటూ అనేక గ్రామాలు, కుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నాయి.

పలుచోట్ల ప్రతిపక్షాలు తమ గ్రామాల్లోకి రావద్దంటూ గ్రామస్థులే ఫ్లెక్సీ లు ఏర్పాటుచేయడం గమనార్హం. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామని, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌ను గెలిపిస్తామని వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మం డలం మర్రిపెల్లిగూడెంలోని పద్మశాలి కులస్థులు సోమవారం ఏకగ్రీవంగా తీర్మానించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం బద్దిపల్లి, రాములపల్లి గ్రామస్థులు టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. కమలాకర్ తమ గ్రామానికి చేసిన సేవలు మరిచిపోలేమని, అందుకు కృతజ్ఞతగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

మేం టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని తీర్మా నం చేసుకున్నాం.. మా గ్రామానికి ప్రతిపక్షాలు రావద్దు అంటూ గ్రామ పొలిమేరలో ఫెక్సీ ఏర్పాటుచేయడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గ్రామానికి చెందిన మున్నూరుకాపులు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు నేతృత్వంలో సమావేశమై టీఆర్‌ఎస్ అభ్యర్థి కే తారకరామారావుకు ఓటువేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన గొల్లకురుమల సంఘం సభ్యులు తమ ఓటును టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు వేస్తామని తీర్మానించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన 300 మంది మైనార్టీ మహిళలు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఓటు వేస్తామని తీర్మానించుకున్నారు.

సిద్ధమవుతున్న ప్రచారరథాలు

ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన టీఆర్‌ఎస్ అభ్యర్థులు.. రాబోయే రోజుల్లో మరింత దూకుడు ప్రదర్శించేందుకు ప్రత్యేక ప్రచారరథాలు తయారు చేయించుకుంటున్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూలు టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి ప్రచారరథాన్ని తయారుచేయించుకోగా.. తాజాగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారరథం సిద్ధమైంది. గ్రామాల్లో ఐదు వేల నుంచి పదివేల మంది ప్రజలను సమీకరించినచోట మాట్లాడేందుకు, సాంస్కృతిక బృందాలు పాటలు పాడేందుకు వీలుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఐషర్ వాహనాలను డిజైన్ చేయించుకుంటున్నారు.

ఈ వాహనంలో 20 నుంచి 30 మంది వరకు నిల్చునే అవకాశం ఉం టుంది. కొందరు అభ్యర్థులు మూడు నాలుగు వాహనాలకు ఆర్డర్ ఇచ్చినట్టు సమాచారం. ఏపీలోని గుంటూరులో ఐషర్ వాహన డీలర్ రామ్‌కోర్ సంస్థ వీటిని తయారుచేస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన 20 మందికిపైగా అభ్యర్థులు ప్రచారరథాల కోసం ఆర్డర్ ఇచ్చినట్టు తెలిసింది. సభలోని ప్రతి ఒక్కరికీ అభ్యర్థి మాటలు వినిపించేలా మైక్ సిస్టం, విద్యుత్ సదుపాయం కోసం రెండు జనరేటర్లు ఇందులో ఉంటాయి. ప్రచార రథంపై పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ అభ్యర్థి చిత్రాలు, ఎన్నికల చిహ్నమైన కారు గుర్తుతోపాటు వివిధ ప్రభుత్వ పథకాల చిత్రాలుండేలా రూపొందిస్తున్నారు. వారం పదిరోజుల్లో ఇంకా పెద్దసంఖ్యలో ప్రచార రథాల ఆర్డర్లు వస్తాయని తయారీదార్లు అంచనా వేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు

-మధిరలో గులాబీ జెండా ఎగురవేస్తాం..
-టీఆర్‌ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్ అంటే తనకు చెప్పలేనంత అభిమానమని, వారి మాటను తూచ తప్పక పాటిస్తానని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత బొమ్మెర రామ్మూర్తి చెప్పారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ పా లనే శ్రీరామరక్ష అన్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో బొమ్మెర రామ్మూర్తి భేటీ అయ్యారు. అనంతరం రామ్మూర్తి మీడియాతో మాట్లాడుతూ.. మధిరలో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్, కేటీఆర్‌లకు కానుకగా అందిస్తామన్నారు. ప్రాణమున్నంత వరకు టీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటానని రామ్మూర్తి స్పష్టంచేశారు.

5369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles