టీఆర్‌ఎస్ దూకుడు!


Mon,September 10, 2018 02:01 AM

TRS candidates begin aggressive campaign

-ప్రచార పర్వంలో దూసుకుపోతున్న అభ్యర్థులు
-సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బాసటగా నిలుస్తున్న ప్రజలు
-అడుగడుగునా ఎమ్మెల్యే అభ్యర్థులకు బ్రహ్మరథాలు.. పూలవర్షాలు
-నుదుట తిలకందిద్ది హారతులు పడుతున్న మహిళలు
-మద్దతు పలుకుతున్న కులసంఘాలు, మొదలైన ఏకగ్రీవ తీర్మానాలు
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాక్షేత్రంలో దూకుడు పెంచింది. ప్రచారంలో దూసుకుపోతున్నది. అభ్యర్థిత్వం ఖరారైనవారు నియోజకవర్గాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. ఉదయం, సాయంత్రం తేడాలేకుండా, విరామమెరుగకుండా ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. భారీ ర్యాలీలతో గ్రామాల్లో హోరెత్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేండ్ల మూడునెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. కరపత్రాల ద్వారా ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. ప్రచారం నిమిత్తం వారి పరిధిలో ఉన్న గ్రామాల్లోకి వెళ్లిన అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూలవర్షం కురిపిస్తూ ఆహ్వానిస్తున్నారు. మహిళలు నుదుట తిలకందిద్ది హారతులు పడుతున్నారు. అంతేకాదు అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ అప్పుడే కులసంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు మొదలుపెట్టాయి. గ్రామాలకు గ్రామాలు సైతం టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నాయి. గులాబీదళం దూకుడు పెంచింది! ప్రజాక్షేత్రంలోకి అప్పుడే అడుగుపెట్టింది! నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేసిన అభ్యర్థులు మూడురోజులుగా నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లోకి వెళ్లిన టీఆర్‌ఎస్ అభ్యర్థులకు శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేళతాళాలు, భారీ బైక్ ర్యాలీలతో స్వాగతం పలుకుతూ ఉత్సాహ పరుస్తున్నారు. నుదుట తిలకందిద్ది హారతులు పడుతున్నారు. గులాబీ పార్టీకే తమ ఓటని, కేసీఆరే మళ్లీ సీఎంగా ఉంటారని తమ మద్దతు తెలుపుతున్నారు.
-నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్


trs

టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారైన నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది.ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు. మహబూబ్‌నగర్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని క్రిస్టియన్ కాలనీ, క్లాక్‌టవర్ ప్రాంతాల్లో పర్యటించారు. మెథడిస్ట్ చర్చిలో నిర్వహిం చిన ప్రార్థనలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మక్తల్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉట్కూర్ మండలం పులిమామిడి గ్రామంలో ప్రచారంలో పాల్గొన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యకర్తలను పిలిపించుకొని ఎన్నికల్లో అండగా నిలవాలని కోరారు. దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ చిన్నచింతకుంట మండలం కురుమూర్తిస్వామి ఆలయంలో టీఆర్‌ఎస్ నాయకులు పూజలు చేశారు. కొండపై ఉన్న 108 ఆలయ మెట్లకు మెట్టుకో కొబ్బరికాయ కొట్టారు.

నేలతల్లిని ముద్దాడి..

పెద్దపల్లి జిల్లా మంథని అభ్యర్థి పుట్ట మధు అంబేద్కర్‌చౌక్‌లో నేల తల్లిని ముద్దాడి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చౌరస్తాలోని వివిధ షాపుల్లో తిరుగుతూ ఓట్ల ను అభ్యర్థించారు. మంథనిని అభివృద్ధి పథంలో నడిపిన టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుగా పట్టణంలో టీఆర్‌ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముం దుగా అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంచి, బాణసంచా కాల్చి సంబు రాలు చేసుకుని ప్రచారాన్ని చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు, గ్రామస్థు లు ఘనస్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు.

దామోదరకు మొదలైన వణుకు..

మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లిలో ఆందోల్ టీ ఆర్‌ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన క్రాంతికిరణ్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలనుంచి వస్తున్న స్పందనతో మాజీ డిఫ్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు వెన్నులో వణుకు మొదలైందన్నారు. గంగపుత్ర సంఘం నాయకులతోపాటు నిజాంపేట, హవేలీఘణపూర్, చిన్నశంకరంపేట, పాపన్నపేట నుంచి వందలాదిగా పార్టీ అభిమానులు, నాయకులు, కులసంఘాల నాయకులు హైదరాబాద్‌లోని తాజా, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మీకు అండగా ఉండి గెలిపిస్తామని ప్రతినబూనారు.

దుబ్బాక తాజా, మాజీ ఎమ్మెల్యే, సోలిపేట రామలింగారెడ్డిని చేగుంట, నార్సింగి గ్రామాలకు చెందిన పద్మశాలీసంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపి మద్దతు పలికారు. నర్సాపూర్ తాజా, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డిని కొల్చారం రైతులు, యువకులు, నాయకులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి మద్దతు తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థ్ధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొత్తగూడెంలో జలగం వెంకట్రావ్, ఇల్లెందులో కోరం కనకయ్య, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలంలో తెల్లం వెంకట్రావ్ ఆయా నియోజకవర్గాల పరిధిలో భారీ ర్యాలీలతో ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు.

మంత్రి ఈటలకే మా ఓటు : వంగపల్లి రజకుల తీర్మానం

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన రజక కులస్థులు మంత్రి ఈటల రాజేందర్‌కే మా ఓటు అని ఆదివారం 400 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం ఈటలకే ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి ఈటలను ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తంచేశారు. రజకులను ఆదర్శంగా తీసుకు న్న మిగతా కులాలు సైతం ఏకగ్రీవ తీర్మానాలకు కసరత్తు మొదలుపెట్టాయి. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు రాములు, సాంబయ్య, దేవరాజు ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

indra-karan-reddy

సరస్వతమ్మా.. టీఆర్‌ఎస్‌ను దీవించమ్మా: మంత్రి అల్లోల

చదువుల తల్లీ సరస్వతమ్మా.. రానున్న ఎన్నికల్లో గెలిచేలా టీఆర్‌ఎస్ పార్టీని దీవించమ్మా అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వేడుకున్నారు. ఆదివారం బాసర సరస్వతీ అమ్మవారిని ముథోల్ తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి కుటుంబసమేతంగా మంత్రి దర్శించుకున్నారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిందన్నారు. అభివృ ద్ధిని చూసే ప్రజలు తమకు మళ్లీ పట్టం కడుతారని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజా తీర్పు కోసమే అసెంబ్లీ రద్దు చేసినట్లు చెప్పారు. అంతకుముందు మంత్రి అల్లోల సారంగపూర్ మండలంలోని అడెల్లి పోచమ్మ, నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రాన్ని దర్శించుకున్నారు.

jupally-krishna-rao

కాంగ్రెస్, టీడీపీలది అనైతిక పొత్తు: మంత్రి జూపల్లి

తెలంగాణను వ్యతిరేకించి, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న టీడీపీతో.. కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనైతికమని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా మర్రికుంటలోని క్యాంపు ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని పక్షాలు ఏకమైనా గెలిచేది మాత్రం టీఆర్‌ఎస్సేనని స్పష్టంచేశారు. 100కు పైగా సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పారు. వనపర్తిలో ప్రణాళికాసం ఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని తెలిపారు.

jogu-ramanna

మంత్రి జోగు రామన్నకు బ్రహ్మరథం

అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు ఆదివారం మహిళలు బ్రహ్మరథం పట్టారు. మంగళహారతులు, పూలతో ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్‌నగర్ కాలనీలో మం త్రి పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాలనీలో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుతో పాటు రహదారుల నిర్మాణం, మురికి కాల్వల నిర్మాణాలు పూర్తిచేయిస్తానని వెల్లడించారు. గత ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించడంతోనే ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించారని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మరో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతారని తెలిపారు.

పొత్తుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది

-మంత్రి అజ్మీరా చందూలాల్
కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తుపెట్టుకుంటే దివంగత ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం పాకాలలో ఆదివారం జరిగిన వనభోజనాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం వనవిలాస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, నేడు చంద్రబాబు విలువలను మరిచి కాంగ్రెస్‌తో పొత్తుకు తెరలేపాడని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు పదేపదే కోర్టులకు వెళ్లి అభివృద్ధి పనులకు అడ్డుపడుతుండటంతో ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు ఎన్నికలకు వెళ్తున్నట్టు తెలిపారు. నాలుగున్నర ఏండ్లలో టీఆర్‌ఎస్ ఎంతో అభివృద్ధి చేసిందని, ఈ అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే ప్రజలంతా నిండు మనసుతో టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని కోరారు.

స్వార్థపరులే పార్టీని బద్నాం చేస్తున్నారు

-కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వార్థపరులు, సొంత పనులు చేయించుకోడానికి పార్టీలో చేరినవారు తమకు టిక్కెట్లు కేటాయించలేదంటూ పార్టీని బద్నాం చేస్తున్నారని కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. ఆదివారం కరీం నగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏడాదిన్నర క్రితం నుంచే సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకే టి క్కెట్లు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. కానీ కొందరు నాయకులు పార్టీలో చేరినప్పుడు టిక్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. కోరుట్లకు చెందిన జువ్వాడి నర్సింగరావు కేవలం తన స్వార్థం కోసం పార్టీలోకి వచ్చారని, ఇప్పుడు పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల గెలుపే లక్ష్యం

-టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్
వచ్చే ఎన్నికల్లో కోల్‌బెల్ట్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా తెలంగా ణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) పనిచేస్తుందని ఆ సంఘం అధ్యక్షుడు బీ వెంకట్రావ్ తెలిపారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఏరియాలోని మంజూర్‌నగర్‌లో ఇల్లెందు క్లబ్‌హౌస్‌లో సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి వెంకట్రావ్‌తో పాటు యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట్రావ్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ పరిరక్షణకు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 11 కోల్‌బెల్ట్ ఏరియాల నుంచి పోటీ చేయబోయే టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మె జార్టీతో గెలిపించుకోవడానికి కార్మికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు.

4422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles