హుజూర్‌నగర్‌లో గులాబీ జెండాకే జై!

Tue,October 22, 2019 03:31 AM

- పోల్‌ సర్వేల్లో ఆరా, చాణక్య సంస్థల వెల్లడి
- గౌరవప్రదమైన మెజార్టీతో గెలువనున్నాం
- ట్విట్టర్‌లో మంత్రి కే తారకరామారావు
- ప్రశాంతంగా పోలింగ్‌.. 84.75%

హైదరాబాద్‌/ సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించనున్నదని పలు ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్నాయి. సోమవారం పోలింగ్‌ అనంతరం ఆరా, చాణక్య సంస్థలు ఎగ్జిట్‌పోల్‌, ప్రీపోల్‌ ఫలితాలను ప్రకటించాయి. చాణక్య నిర్వహించిన సర్వేలో టీఆర్‌ఎస్‌కు 53.73%, కాంగ్రెస్‌కు 41.04% ఓట్లు వస్తాయని తేలింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అన్ని మండలాల్లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబర్చనున్నట్టు వెల్లడైంది. బీజేపీ, ఇతర పార్టీలు దరిదాపుల్లో కూడాలేవు. కాంగ్రెస్‌కు మినహా మిగిలిన పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని సర్వే ఫలితాల ద్వారా వెల్లడవుతున్నది. ఆరా నిర్వహించిన ప్రీపోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 50.48%, కాంగ్రెస్‌కు 39.95%, ఇతరులకు 9.57% ఓట్లు వస్తాయని తేలింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 50శాతానికి పైగా ఓట్లు సాధిస్తారని రెండు సర్వేలూ పేర్కొనడం గమనార్హం. సాయంత్రం వరకు హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో 84.15శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ నెల 24న ఓట్లు లెక్కించి, ఫలితాన్ని ప్రకటించనున్నారు.
HUZURNAGAR3

హుజూర్‌నగర్‌లో గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమా

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి విజయంపై ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఓటింగ్‌ సరళి, ప్రజానాడి, క్షేత్రస్థాయి సమాచారం, వివిధసంస్థల సర్వేలు, ఇతరత్రా నివేదికల ఆధారంగా అంచనావేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు.. తమ పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మార్గదర్శకంలో దాదాపు నెలరోజుల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన కృషితో ఉపఎన్నికలో తమ పార్టీకి విజయం వరించనున్నదని వారు విశ్లేషిస్తున్నారు. ఉపఎన్నికకు పార్టీ ఇంచార్జిగా వ్యవహరించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌తో సమన్వయంతో వ్యవహరించారని చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్నిరకాలుగా తప్పుడు ప్రచారం చేసినా, కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడినా ప్రజల వాటన్నింటినీ తిరస్కరించి తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని చెప్తున్నారు. ఇంటింటికీ ప్రచారం నిర్వహించిన సందర్భంలో వచ్చిన స్పందనే ఓటింగ్‌లోనూ కనిపించిందని పేర్కొంటున్నారు.

ప్రశాంతంగా పోలింగ్‌

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌ ఒకటి రెండుచోట్ల తోపులాటలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 84.75% ఓటింగ్‌ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 85.96% ఓటింగ్‌ నమోదుకాగా.. ఈ సారి 1.21% తగ్గింది. సోమవారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైనా.. ఆకాశం మబ్బుపట్టి ఉండటంతో తొలుత కాస్త మందకొడిగా సాగింది. ఆ తర్వాత గంటగంటకు పెరుగుతూ వచ్చింది. రెండు మున్సిపాలిటీలతోపాటు ఏడు మండలాల్లోని 302 పోలింగ్‌కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకు 13.44% మాత్రమే పోలింగ్‌ నమోదు కాగా, 11 గంటల సమయానికి 31.34% నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు 52.89శాతానికి, మూడు గంటల వరకు 69.95 శాతానికి చేరింది. సాయంత్రం ఐదు గంటల సమయానికి పోలింగ్‌ 84.15% నమోదైంది. పోలింగ్‌ ముగిసే సమయానికి అన్ని మండలాల్లో పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్‌కేంద్రాల్లో క్యూలైన్లలో నిలిచి ఉండటంతో వారందరికీ ఓటేసేందుకు అవకాశం కల్పించారు.
HUZURNAGAR1
హుజూర్‌నగర్‌ మండలంలోని గోపాలపురంలో బూత్‌ నంబర్‌ 195లో ఒక వృద్ధుడు ఓటువేసే విషయంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఏజెంట్ల మధ్య స్వల్పఘర్షణ చోటుచేసుకుంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు హుటాహుటిన వాటిని మార్చి, కొత్తవి ఏర్పాటుచేశారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో 30, 31 పోలింగ్‌బూత్‌లు, గరిడేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఈవీఎంలు గంటసేపు మొరాయించాయి. ఉపఎన్నిక కోసం పోలింగ్‌కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లుచేయడంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. పొలింగ్‌ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించడంపై ఓటర్లు సంతోషం వ్యక్తంచేశారు. వికలాంగులకు ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మించి వీల్‌ చైర్లు అందుబాటులో ఉంచి, అంగన్‌వాడీలను సహాయకులుగా ఏర్పాటుచేశారు. ఈ ఉప ఎన్నికలో 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

అధికారుల పర్యవేక్షణ..

పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. చింతలపాలెం, నేరేడుచర్లలో, పాలకీడు మండలంలోని జానపాడులో పోలింగ్‌ కేంద్రాలను జనరల్‌ అబ్జర్వర్‌ ప్రతాప్‌సింగ్‌, నేరేడుచర్లలో పలు పోలింగ్‌ కేంద్రాలను కేంద్ర ఎన్నికల పరిశీలకుడు జీకే గోపాలన్‌ పరిశీలించారు. గరిడేపల్లి మండంలోని పొనుగోడులో 263వ పోలింగ్‌ కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ సంజీవరెడ్డి పరిశీలించగా, మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి, చింతలపాలెం మండలంలోని కిష్టాపురం, మేళ్లచెర్వు మండలంలోని కందిబండ గ్రామాల్లో, గరిడేపల్లి, పాలకవీడులోని పలు పోలింగ్‌స్టేషన్లలో బందోబస్తును ఎస్పీ భాస్కరన్‌ పరిశీలించారు.

ఓటేసిన అభ్యర్థులు

మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామం లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నా రు. టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి హుజూర్‌నగర్‌లో, తెలంగాణ ప్రజల పార్టీ అభ్యర్థి దేశగాని సాంబశివగౌడ్‌ బూరుగడ్డలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గౌరవప్రదమైన మెజార్టీతో గెలువబోతున్నాం: కేటీఆర్‌

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక సందర్భంగా నెలరోజులుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి విజయంకోసం కృషిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు పోలింగ్‌ ముగిసిన అనంతరం ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభ్యర్థి విజయానికి కష్టించి పనిచేశారని అభినందించారు. పార్టీ నాయకుల నుంచి అందిన సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి గౌరవప్రదమైన మెజార్టీతో గెలువబోతున్నారని పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఉన్నానని పేర్కొన్నారు.
HUZURNAGAR2

పోలింగ్‌బూత్‌లో ఈవీఎం యూనిట్‌ మార్పు

- అధికారులపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి ఆగ్రహం
మఠంపల్లి: హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక పోలింగ్‌లో ఈవీఎం యూనిట్లు మారడంపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికలో 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రతి పోలింగ్‌ కేంద్రాల్లో రెండు ఈవీఎం యూనిట్లను ఏర్పాటుచేశారు. మఠంపల్లి మండలకేంద్రంలో మూడు పాఠశాలల్లోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎం యూనిట్‌-1 బదులుగా యూనిట్‌-2 అమర్చినట్టు తెలుసుకొన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 75, 76, 77, 78, 79, 80, 81 నంబర్ల పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎం యూనిట్లు మారడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారన్నారు. వృద్ధులు, చదువురానివారికి మొదటి యూనిట్‌లో నాలుగో నంబర్‌పై టీఆర్‌ఎస్‌ గుర్తు ఉంటుందని అవగాహన కల్పించామని, కానీ ఇక్కడ మార్పు చేయడం వల్ల తనకు వచ్చే ఓట్లు కోల్పోయే ప్రమాదముందని మండిపడ్డారు.

3576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles