గిరిజనుల్లో విద్యాప్రగతి

Mon,November 11, 2019 02:41 AM

- రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలు
- పలు విద్యాసంస్థల ద్వారా 2,15,898 మందికి ప్రయోజనం
- సీఎం కేసీఆర్‌ పాలనలో గిరిజనాభివృద్ధి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏండ్లతరబడి సమాజానికి దూరంగా ఉంటూ.. అక్షరాభ్యాసానికి నోచుకోని గిరిజనుల స్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి విద్యాభివృద్ధికి బాటలుపరిచింది. ప్రాథమిక స్థాయి నుంచే వివిధ రకాల విద్యాసంస్థలను ఏర్పాటుచేయడంతో గిరిజనుల విద్య ప్రగతిపథంలో సాగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుంచే ఏటా విద్యావిధానాల్లో ప్రభుత్వం మార్పు లు చేస్తున్నది. ఎస్టీ విద్యాలయాల పురోగతికి సీఎం కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా గిరిజన సంక్షేమశాఖ అధికారులు ప్రత్యేక చర్య లు చేపట్టారు. రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, బెస్ట్‌ అవెలబుల్‌ స్కూళ్లు, గురుకులాలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, గిరిజన సంక్షేమ వసతిగృహాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠపరిచారు. ఎక్కువ మంది గిరిజన విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా వసతులు కల్పించారు.

తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2,15,898 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి మెరుగైన విద్యను అందించేందుకు ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక కార్యాచరణను అమలుచేస్తున్నారు. గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఆయా కేంద్రాల్లో మందులు ఇస్తూనే.. హెల్త్‌ మానిటరింగ్‌ విభాగం ద్వారా అనారోగ్య తీవ్రతనుబట్టి నిపుణుల బృందంతో తక్షణ వైద్యసేవలు అందిస్తున్నారు. విద్యార్థుల సౌకర్యాలు, విద్యాబోధన వంటి అంశాలను పరిశీలించి, ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు ప్రతిజిల్లాకు ఒక కోఆర్డినేటర్‌ను నియమించారు. గురుకులాల ప్రిన్సిపాళ్లు, అధికారులతో ప్రతివారం టెలికాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుల ద్వారా ఆయా గురుకులాలను ఏడాదిలో రెండుసార్లు తనిఖీలు చేయిస్తున్నారు. ఉపాధ్యాయుల పనితీరును అంచనావేసి విద్యాబోధన, చిన్నారుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఫలితంగా ఏటా విద్యాబోధనలోనూ గురుకులాలు మెరుగుపడుతున్నాయి.
tribes-girijana1

ప్రత్యేక చర్యలివే..!

- గిరిజన గురుకులాల్లో పదోతరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.5 వేల చొప్పున నగదు పురస్కారం అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు.
- వేసవి సెలవులు సద్వినియోగమయ్యేలా సమ్మర్‌ సమ్మిట్‌ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 60 మంది గిరిజన విద్యార్థులను ఎంపికచేసి ప్రత్యేక అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.
- వేసవి శిక్షణాంశాల్లో ఫొటోగ్రఫీ, కంప్యూటర్‌, ఆంగ్లభాషా నైపుణ్యాలు, సాహిత్య కృత్యాలు, డ్యాన్స్‌, పాటలు, యోగా, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, హెన్నా వంటివి నిర్వహిస్తున్నారు.
- ఆంగ్లభాషపై పట్టు సాధించేందుకు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఈఎస్‌ క్లబ్‌ (ఇంగ్లీష్‌ స్పీకింగ్‌ క్లబ్‌) కార్యక్రమాన్ని ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు.
- గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో స్కూల్‌ కౌన్సిల్‌ ఏర్పాటుచేసి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్నారు.
- అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో మన టీవీ కార్యక్రమాలను చూపిస్తూ డిజిటల్‌ పాఠాలు అందుబాటులోకి తెస్తున్నారు.
- గిరిజన చిన్నారులకు కార్పొరేట్‌ స్థాయి విద్యావకాశాలు కల్పించే ఉద్ధేశంతో అన్ని వసతులు ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలను బెస్ట్‌ అవెలబుల్‌ స్కూల్‌ పేరిట ఎంపికచేసి ఎస్టీ విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles