ఆర్టీసీని విలీనం చేస్తామనలేదు

Sun,October 13, 2019 02:57 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హయాంలోనే ఆర్టీసీ కార్మికులకు మంచిరోజులు వచ్చాయని.. కార్మికులకు 44% ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత సీఎందేనని మంత్రులు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని, కార్మికులను రెచ్చగొట్టి రాజకీయపబ్బం గడుపుకొంటున్నారని విరుచుకుపడ్డారు. శనివారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు మంత్రులు మహమూద్‌అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశాల్లో ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్‌భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేస్తామని టీఆర్‌ఎస్ ఎప్పుడూ చెప్పలేదని స్పష్టంచేశారు. పండుగపూట ప్రజలకు అసౌకర్యం కలిగించాలనే ఉద్దేశంతోనే కార్మికసంఘాల నేతలు సమ్మెకు దిగారని తెలిపారు.


అయినప్పటికీ ఏ ఒక్కరికీ రవాణా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయడంలో విజయవంతమయ్యామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని, సంప్రదింపులు జరుగుతుండగానే.. చర్చల నుంచి కార్మిక సంఘాల నాయకులు వెళ్లిపోయారని గుర్తుచేశారు. సమ్మె విషయంలో ప్రభుత్వ విధానాన్ని నాలుగో తేదీనాడే స్పష్టంచేశామని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కార్మిక సంఘాలు వ్యవహరిస్తున్నాయని, టికెటింగ్ ఉద్యోగులను కూడా సమ్మెకు తీసుకెళ్లారని చెప్పారు. విభజన సమయంలో రాష్ట్రంలో 71 లక్షల వాహనాలు ఉండేవని, ఇప్పుడు 1.20 కోట్లు అయ్యాయని, రవాణా కోసం ప్రజలు వినియోగించే వాహనాలు పెరిగాయని.. వాటికి తగ్గట్టుగా ఆర్టీసీ మారాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. సమ్మె నేపథ్యంలో రోజుకు సగటున 7,358 వాహనాలను నడుపుతున్నామని తెలిపారు.

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడుస్తున్న ఆర్టీసీ సర్వీసులతోపాటు వివిధ ప్రైవేట్ వాహనాల్లో అధిక చార్జీలు వసూలుచేస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రతిడిపోలో ఆర్‌ఎం కింద పోలీస్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే టికెట్లు ఇస్తామని, బస్సుల్లో అన్ని పాస్‌లు చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. కార్మిక సంఘాలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని.. ప్రజలకు ఇబ్బందులను కల్పించే చర్యలను విపక్షాలు సమర్థిస్తున్నాయని మండిపడ్డారు. గతంలో అసంబద్ధమైన ఆరోపణలు చేసినందుకు ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పారని ఎద్దేవాచేశారు. రవాణాశాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో రూ.13 కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీని రూ.14 కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చారని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఆర్టీసీ కార్మికులను చూసుకొన్నారని తెలిపారు. 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడమే కాకుండా గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.3,303 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారని వివరించారు.

తెలంగాణ ఏర్పడినప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4,416 కోట్లని, విపక్షాలు రూ.లక్ష కోట్లని చెప్పటం సరికాదన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నారని బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదమని, ఘనచరిత్ర ఉన్న రైల్వేను ప్రైవేటీకరణ చేస్తున్న చరిత్ర బీజేపీకి ఉన్నదని పేర్కొన్నారు. సమ్మె నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభమైతే స్కూలు బస్సులను ప్రజారవాణాకోసం తీసుకోబోమని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ తెలిపారు. ఆర్టీసీలో చాలా బస్సులున్నాయని, వాటిని నడిపించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఆర్టీసీని ఆదుకొన్న ఘనత సీఎం కేసీఆర్‌దే

-హోంమంత్రి మహమూద్ అలీ
RTC1
ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. శనివారం తెలంగాణభవన్‌లో మండలి విప్ ఎమ్మెస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకున్నదని చెప్పారు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా సమ్మె చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రతిపక్షపార్టీలు ప్రతిఅంశాన్ని రాజకీయంచేయాలని చూస్తున్నాయని ఆగగ్రహం వ్యక్తంచేశారు. సంస్కరణలతో ఆర్టీసీకి మంచి చేయాలనే సీఎం ప్రయత్నిస్తున్నారని.. ప్రతిపక్షాల రాజకీయాలను ఆర్టీసీ కార్మికులు, ప్రజలు అర్థంచేసుకోవాలని విజ్ఞప్తిచేశారు.

విపక్షనేతలు రెచ్చగొడుతున్నారు

- కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
Mallareddy
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే కార్మికులు, ఉద్యోగుల శ్రేయస్సుకోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి చెప్పారు. శనివారం మేడ్చల్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్మికులను విపక్ష నేతలు రెచ్చగొట్టి సమ్మెచేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుల మాటలు విని కార్మికులు సమ్మెకు దిగి, పోషించే సంస్థను నష్టాల్లోకి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అన్నివర్గాల శ్రేయస్సే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని.. సమస్యను పరిష్కరించేవరకు ప్రజలు సహకరించాలని కోరారు.

మీ పాలిత రాష్ట్రాల్లో విలీనం చేయండి

- మంత్రి తలసాని
Talaani
ఆర్టీసీపై కాంగ్రెస్, బీజేపీ ద్వంద విధానాలతో వ్యవహరిస్తున్నాయని, దమ్ముంటే ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేయాలని మత్స్య,పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సవాల్ విసిరారు. కేంద్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకరకంగా వ్యవహరిస్తూ.. తెలంగాణలో అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రైల్వేను, ఎయిరిండియాను ప్రైవేటుపరంచేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని రద్దుచేసిందని గుర్తుచేశారు. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతిపక్షాలవి నీచ రాజకీయాలు

-మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
vemula
ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్షాలు నీచరాజకీయా లు చేస్తున్నాయని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీసీలో సంస్కరణలు తీసుకొవచ్చి మంచి చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో కార్మికులు గొంతెమ్మ కోరికలతో సమ్మె చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజీపీలు కార్మికులను రెచ్చగొట్టి నష్టం చేస్తున్నాయని విమర్శించారు.

ప్రైవేటీకరిస్తామనలేదు

-మంత్రి సత్యవతి రాథోడ్
ministerSatyavati
మఠంపల్లి: ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకొంటున్నారని గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరంచేస్తామని సీఎం ఎన్నడూ అనలేదన్నారు. శనివారం సూర్యాపేటజిల్లా మఠంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీకి ఏటా రూ.1500 కోట్ల మేర నష్టం తీసుకొస్తున్న వారు.. ఇవాళ సమ్మెచేస్తున్న నాయకులేనని మండిపడ్డారు. ఆర్టీసీ నడుపుతున్న బస్సులకు ప్రతి కిలోమీటర్‌కు రూ.12.75 నష్టం వస్తుంటే కిరాయి బస్సులకు కిలోమీటర్‌కు 75 పైసల నష్టం వస్తున్నదని చెప్పారు. కార్మిక సంఘాల నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సమ్మె చేస్తున్నారని మంత్రి రాథోడ్ విమర్శించారు.

1603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles