ఏపీ భవనాలు అధికారికంగా అప్పగింత


Thu,June 20, 2019 02:42 AM

Transfer of AP buildings to Telangana gathers pace

-సచివాలయంలోని నార్త్ హెచ్, కే బ్లాక్‌లను అప్పగించిన ఏపీ అధికారులు
-స్నేహపూర్వక వాతావరణంలో పత్రాల మార్పిడి
-నేటితో పూర్తికానున్న ప్రక్రియ

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను తెలంగాణకు తిరిగి అప్పగించే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయింది. బుధవారం ఏపీ అధికారులు సచివాలయంలోని నార్త్ హెచ్, కే బ్లాక్‌లోని భవనాలను తెలంగాణ అధికారులకు అప్పగించారు. భవనాల అప్పగింతకు సంబంధించి లిఖితపూర్వక పత్రాలను ఏపీ జీఏడీ అధికారి రవి.. తెలంగాణ రాష్ట్రసాధారణ పరిపాలన ఉద్యోగిణి చిట్టిరాణికి అందజేశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ఉద్యోగులు స్వీట్లు పంచుకుని పరస్పరం అభినందించుకున్నారు. ఏపీకి కేటాయించి నిరుపయోగంగా ఉన్న సచివాలయంలోని బ్లాకులతోపాటు, నగరంలో ఇతరచోట్ల ఉన్న భవనాలను తమకు అప్పగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కోరిన విషయం తెలిసిందే. ఇందుకు జగన్మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించడంతో భవనాలను ఖాళీచేసే ప్రక్రియ యుద్ధప్రాతిపదికన కొనసాగింది. సచివాలయంలోని నార్త్ హెచ్, కే బ్లాక్‌లతోపాటు, లక్డీకాపూల్‌లోని ఏపీ డీజీపీ కార్యాలయం, రాజ్‌భవన్ రోడ్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో ఉన్న సామగ్రి, ఫైళ్లను ఏపీకి తరలించారు. గురువారం జే, ఎల్ బ్లాక్‌లను అధికారికంగా అప్పగించనున్నారు. దాంతో భవనాల అప్పగింత ప్రక్రియ పూర్తవుతుందని సాధారణ పరిపాలనాశాఖ అధికారిణి చిట్టిరాణి తెలిపారు. భవనాలను అప్పగించేందుకు సహకరించిన ఏపీ అధికారులు, ఉద్యోగులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
H-SOUTH-BLOCK

1597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles