రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై తిత్లీ ప్రభావం


Tue,October 16, 2018 02:38 AM

Transco Andgenco Cmd Prabhakar Rao Meeting with Power Coordination High Level Committee

-మరో మూడురోజులు!
-తుఫాన్‌తో తెగిన హైటెన్షన్ వైర్లు
-ఉత్తరాది నుంచి నిలిచిన సరఫరా
-సమస్యను అధిగమించేందుకు విద్యుత్‌శాఖ చర్యలు
-రాష్ట్రంలో గరిష్ఠస్థాయిలో ఉత్పత్తి
-మార్కెట్‌లో అధిక ధరకైనా విద్యుత్ కొనుగోళ్లు
-రాష్ట్ర పవర్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తిత్లీ తుఫాన్ ప్రభావంతో రాబోయే మూడురోజులపాటు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యుత్ సంస్థలు అప్రమత్తంగా ఉండి, సేవలు అందించాలని తెలంగాణ పవర్ కోఆర్డినేషన్ కమిటీ అధికారులను ఆదేశించింది. ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తిచేసింది. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం విద్యుత్ సౌధలో టీఎస్‌పీసీసీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, వివిధ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. తిత్లీ తుఫాన్ ప్రభావంవల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సమావేశంలో ఖరారుచేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అన్నిరంగాలకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరాచేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలోని అన్ని థర్మల్, హైడల్ పవర్‌స్టేషన్లద్వారా పూర్తిసామర్థ్యంమేరకు విద్యుత్ ఉత్పత్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని థర్మల్‌స్టేషన్లలో చాలినంత బొగ్గు నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్పత్తికేంద్రాల ద్వారానే విద్యుత్ అందాల్సి ఉన్నందున ఏ ఒక్క పవర్‌ప్లాంటులో, ఏ ఒక్క యూనిట్‌లో ఇబ్బంది తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని జెన్‌కో అధికారులను ఆదేశించారు. బహిరంగమార్కెట్లో ఎంత విద్యుత్ దొరికితే అంత విద్యుత్‌ను ఎంత ధరకైనా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తిత్లీ తుఫాను ప్రభావం తెలంగాణ సహా దక్షిణాది రాష్ర్టాలన్నింటిపై ఉందని సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు.

అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా.. 24 గంటలపాటు విద్యుత్ సరఫరాకు సిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థల అధికారులను కోరారు. లైన్ల పునరుద్ధరణ చర్యలకు ప్రతికూల వాతావరణం ప్రతిబంధకంగా మారిందని, మరో మూడ్రోజులపాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని చెప్పారు. విద్యుత్ సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి కరంటు కోతలు లేకుండా చూస్తున్నారని వివరించారు. ప్రజలుకూడా సహకరించాలని కోరారు.

సరఫరా తగ్గిన బయటి విద్యుత్

తిత్లీ తుఫాన్ వల్ల ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య విద్యుత్ సరఫరాచేసే టవర్లు కూలిపోయాయి. హైటెన్షన్ వైర్లు తెగిపోయాయి. దీంతో దక్షిణాది రాష్ర్టాలకు దేశంలో ఎటువైపు నుంచీ విద్యుత్ అందడం లేదు. తాల్చేరు- కోలార్, అంగూల్- శ్రీకాకుళం లైన్లు పూర్తిగా దెబ్బతినడంతో తెలంగాణకు రావాల్సిన 3000 మెగావాట్ల విద్యుత్ అందడం లేదు. దీనికితోడు సెంట్రల్ పవర్‌స్టేషన్లలో బొగ్గు కొరతతో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు సెంట్రల్ షేర్ కింద రాష్ర్టానికి 2500 మెగావాట్ల విద్యుత్ అందాల్సి ఉండగా.. 1500 మెగావాట్లు మాత్రమే అందుతున్నది. ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్లకుగాను 350 మెగావాట్లు మాత్రమే వస్తున్నది. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 40% మేర పెరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో 7538 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 10,600 మెగావాట్లకు గరిష్ఠ డిమాండ్‌కు చేరింది.

గ్రేటర్‌లో అవాంతరాలు లేకుండా..

తిత్లీ తుఫాన్ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో విద్యుత్ సరఫరా తీరుతెన్నులపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు.. ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఇతర డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో డిస్కం ప్రధాన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గరిష్ఠంగా 55.9 మిలియన్ యూనిట్లు, అలాగే డిస్కం పరిధిలో 155 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరాలో ఎలాంటి అతరాయాలు లేకుండా చూస్తున్నట్టు ప్రభాకర్‌రావు తెలిపారు. దీనికితోడు సర్కిళ్లలో విద్యుత్ సరఫరాపై ఎప్పటికప్పుడు ఆపరేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్లతో మాట్లాడుతున్నామన్నారు.

విద్యుత్ లభ్యతలో కొరత ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం అన్ని థర్మల్, హైడల్‌తోపాటు సౌరవిద్యుత్ ప్లాంట్లలో గరిష్ఠంగా ఉత్పత్తి చేస్తున్నామన్నారు. సోమవారం గరిష్ఠంగా 10532 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడిందన్నారు. ఇందులో ఎస్పీడీసీఎల్ పరిధిలోనే 6961 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదయ్యిందన్నారు. కారిడార్ పునరుద్ధరణపై పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. పునరుద్ధరణ పనులను గ్రిడ్ ఉన్నతాధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన చేస్తున్నారని తెలిపారు.

3216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles