ఫిబ్రవరిలో కొత్త సర్పంచ్‌లకు శిక్షణ!

Sat,January 19, 2019 03:03 AM

-ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
-రెండ్రోజులపాటు పలుఅంశాలపై స్వయంగా అవగాహన కల్పించనున్న ముఖ్యమంత్రి
-గ్రామ పంచాయతీల విధులు-నిర్వహణ, అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రతపై ఫోకస్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి పల్లెల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రెయినేజీ, మంచినీటి సరఫరా వ్యవస్థతోపాటు వీధిలైట్లు, శ్మశానవాటికలు వంటి వసతుల కల్పించడం, ఖాళీస్థలాల్లో మొక్కలు పెంచేవిధంగా కార్యాచరణ రూపొందించారు. గ్రామ అభివృద్ధి బాధ్యతను నేరుగా సర్పంచ్‌లకే అప్పగించారు. ఈ కార్యక్రమాల నిర్వహణపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం కోసం గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగానే ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా కొత్త సర్పంచ్‌లకు రెండ్రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లుచేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ముఖ్యంగా పంచాయతీల అభివృద్ధికి పారదర్శకంగా నిధుల ఖర్చు, పచ్చదనం పెంపు, పరిశుభ్రత, చెత్త నిర్వహణ వంటి గ్రామాభివృద్ధికి ఉపయోగపడే ప్రతిఅంశంపై కూలంకుశంగా సర్పంచ్‌లకు అవగాహన కల్పిస్తారు. ఇదే సమయంలో సర్పంచ్‌లకు విధుల నిర్వహణ ఏవిధంగా చేయా లో కూడా వివరిస్తారు. ఇప్పటికే గ్రామీ ణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిశగా విప్లవాత్మకమైన చర్య లు తీసుకున్న ముఖ్యమంత్రి.. గ్రామా ల్లో మౌలిక సదుపాయాలు కల్పిం చి, అద్దంలా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


గ్రామాలకు పెద్దఎత్తున నిధులుగ్రామపంచాయతీలకు జవసత్వాలు కల్పించేలా బడ్జెట్‌లోనే నిధు లు కేటాయిస్తూ, విధులను స్పష్టంచేస్తూ నూతన గ్రామపంచాయతీ చట్టాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. దీంతో గ్రామ పంచాయతీలకు నిధులు వరదలాపారనున్నాయి. ప్రతి పంచాయతీకి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఏడాదికి రూ.20 లక్షల నుంచి తక్కువలో తక్కువ అతిచిన్న గ్రామ పంచాయతీకి కూడా రూ.5 లక్షలకు తగ్గకుండా నిధులు వస్తాయి. ఈ నిధులతో ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, ప్రజలు గ్రామసభలో చర్చించి అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవికాకుండా 14వ ఆర్థికసంఘం ద్వారా గ్రామాలకు కేంద్ర నిధులు వస్తాయి. వీటిని ఎంపీ, ఎమ్మెల్యేల అనుమతితో సంబంధం లేకుండా నేరుగా పంచాయతీలే అభివృద్ధి పనులకు వెచ్చించవచ్చు. ఇవి కాకుండా ఇంటి పన్నులు, గృహ నిర్మాణ అనుమతుల ఫీజుల ద్వారా వచ్చే ఆదాయంతోపాటు పంచాయతీల పరిధిలో ఏవైనా పరిశ్రమలు ఏర్పాటుచేస్తే వాటినుంచి కూడా నిధులు వస్తాయి. ఎమ్మెల్యే, ఎంపీ కోటానుంచి నిధులు వస్తాయి.

శరవేగంగా అభివృద్ధి

గ్రామాల అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణ అవసరమని సీఎం కేసీఆర్ భావించారు. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో మా తండాలో మా రాజ్యం అనే గిరిజనుల నినాదాన్ని నిజంచేసిన సీఎం కేసీఆర్.. దాదాపు నాలుగువేలకుపైగా కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నారు. ఇప్పటికే కులవృత్తులకు జీవం పోశారు. రైతులకు భరోసా ఇచ్చారు. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామీణ ఆర్థికవ్యవస్థ గాడిన పడింది. గ్రామీణ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా సురక్షిత మంచినీటిని అందించడానికి మిషన్ భగీరథను అమలుచేస్తున్నారు. గ్రామస్థాయిలోనే నిర్ణయం తీసుకొని అమలుచేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్‌లోనే నిధులు కేటాయించారు. ఇప్పుడు వాటిని సరిగ్గా వినియోగించి గ్రామాలను శరవేగంగా అభివృద్ధి చేయడం కోసం నూతన సర్పంచ్‌లకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

2675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles