దళితులకు భూదన్ను


Sat,January 5, 2019 12:57 PM

total cost of the joint state is Rs 9220 crores in 32 years

-5346 కుటుంబాలకు 13585 ఎకరాల పంపిణీ
-ఎస్సీలకు భూపంపిణీ పథకం అమలులో పురోగతి
-ఉమ్మడి రాష్ట్రంలో 32 ఏండ్లలో రూ.92.20 కోట్లు ఖర్చు
-నాలుగున్నరేండ్లలో 587 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం
-ఆత్మగౌరవం పెంచిన తెలంగాణ సర్కారు

లెక్కలు డొక్కలు చింపుతాయంటారు! ఏదైనా లెక్క ప్రకారం మాట్లాడితే వాస్తవాలు వెలుగుతాయి! దళితులకు భూపంపిణీ పథకం కూడా అంతే! టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఒక నిరంతర కార్యక్రమం దళితులకు భూపంపిణీ! ప్రతిదానికీ నోరేసుకుని విరుచుకుపడే ప్రతిపక్షం.. వాస్తవాలను విస్మరిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. అందుకు నిదర్శనమే భూపంపిణీ అంశం! ఉమ్మడి రాష్ట్రంలో 32 ఏండ్ల వ్యవధిలో దళితులకు భూపంపిణీ కోసం రూ.92.20 కోట్లు ఖర్చుచేస్తే.. తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నరేండ్ల వ్యవధిలో వెచ్చించిన సొమ్ము రూ.587 కోట్లు! ఈ సొమ్ముతో 13,585 ఎకరాలను కొనుగోలుచేసి.. 5346 కుటుంబాలకు పంచింది.. వారిలో ఆత్మగౌరవాన్ని నింపింది తెలంగాణ ప్రభుత్వం!!
Pathi
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉద్యమస్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో నాలుగున్నరేండ్ల స్వపరిపాలనలో దళితుల ఆత్మగౌరవాన్ని చిరస్థాయిగా నిలిపింది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం. దళితులకు పలు సంక్షేమ, ఆర్థికాభివృద్ధి పథకాలను అమలుచేస్తూనే.. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ ఆధారిత ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల వ్యవసాయ భూ పంపిణీ పథకాన్ని సమర్థంగా నిర్వహించింది. ఏండ్ల తరబడి కూలీలుగా మగ్గిపోతున్న భూమిలేని పేద దళిత కుటుంబాలకు వందశాతం సబ్సిడీతో మూడెకరాల వ్యవసాయ భూమిని అందజేస్తున్న కేసీఆర్ సర్కారు.. ఆ భూమిలో పంటల సాగుకు ఆర్థిక సహకారం కూడా అందిస్తున్నది. దీంతో ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది.

ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలకు భూ పంపిణీ పథకం కోసం 1981-82 నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరం వరకు 32 ఏండ్లలో ఆయా ప్రభుత్వాలు కేవలం రూ.92.20కోట్లు ఖర్చుచేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగున్నరేండ్లలోనే ప్రభుత్వం రూ.586.84కోట్లు వెచ్చించి 5346 దళిత కుటుంబాలకు 13584.37 ఎకరాల భూమిని పంపిణీచేసింది. 2018 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమిని పంపిణీచేయడం విశేషం. దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సంకల్పంతో 2014 నుంచి అమలుచేస్తున్న ఈ పథకం.. దళిత కుటుంబాల్లో భరోసా కల్పిస్తున్నది. వారికి ఓ జీవన మార్గం చూస్తున్నది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నది.
Former

ప్రగతి ఇలా..!

గతంలోనే ఎస్సీ భూ పంపిణీ పథకం అమలులో ఉన్నప్పటికీ.. తెలంగాణ సర్కారు వచ్చాక మూడెకరాల వ్యవసాయ భూమిని వంద శాతం సబ్సిడీతో అందజేస్తున్నారు. 2008 నుంచి 2012 వరకు రెండెకరాల భూమి 50% సబ్సిడీపై (రెండెకరాల భూమి- విలువ కేవలం రూ.1లక్ష మాత్రమే) భూమి ఇచ్చేవారు. లేదంటే రూ.30వేల వరకు ఆర్థిక సహాయం అందేది. 2013-14లో 75% సబ్సిడీపై రెండెకరాల భూమి లేదా.. రూ.2లక్షల ఆర్థిక సహాయం అందించేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఆ ఇంట్లోని మహిళ పేరుతో మూడెకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం 100% రాయితీతో పంపిణీచేస్తున్నది. దీన్ని నిరంతరం కొనసాగే కార్యక్రమంగా ప్రకటించింది.

వ్యవసాయానికి యోగ్యమైన భూమినిస్తూ..

భూ పంపిణీ చేయడమేకాకుండా పంటల సాగుకు అనువైన పరిస్థితులను కల్పిస్తుండటంతో లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకుంటూ.. తాము ఒకప్పుడు కూలీలుగా పనిచేసినచోట.. వ్యవసాయదారులుగా ఎదుగుతున్నారు. గతంలో బంజరుభూములను ఇచ్చిన సందర్భాలుంటే.. ప్రస్తుతం సాగుకు యోగ్యమైన భూమిని పంపిణీ చేస్తున్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో కసరత్తు చేస్తున్నది. మొదట లబ్ధిదారుల అభీష్టంమేరకు సమాచారం సేకరించి ఆయా గ్రామాల్లో భూములు కొనుగోలుచేసి ఇస్తున్నారు. గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపికచేస్తూ వివాదాలు లేకుండా చూస్తున్నారు. భూములు అప్పగించడంతోపాటు పట్టాలతో బ్యాంకు రుణాలు ఇప్పిస్తుండటంవల్ల లబ్ధిదారులు పంట పెట్టుబడికోసం ఇతరుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది.
Seds

అగ్రస్థానంలో ఆదిలాబాద్ నాలుగేండ్లలో 3029 ఎకరాల పంపిణీ

బాకే రఘునాథ్ రావు, ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లాలో అమలుచేస్తున్న మూడెకరాల భూమి పంపిణీ పథకం పేద ఎస్సీల పాలిట వరంగా మారింది. కూలీ పనులతో కుటుంబాలను పోషించుకొనేవారు.. ప్రస్తుతం ప్రభుత్వం రైతులుగా మారారు. నాలుగేండ్లలో అధికారులు 3029 ఎకరాల భూమిని 1131 మంది లబ్ధిదారులకు అందించారు. ఇందుకు ప్రభుత్వం రూ.126.20 కోట్లను ఖర్చు చేసింది. ఈ భూములు పూర్తిగా వ్యవసాయ యోగ్యమైనవి, ఎలాంటి వివాదాలు లేనివే కావడం గమనార్హం. అంతేకాదు.. గతంలో అక్కడ ఏ పంటలు సాగుచేశారు? నీటి సౌకర్యం ఉందా? లేకపోతే.. బోరు వేసుకుంటే నీళ్లు పడతాయా? అనే విషయాలను పరిశీలించి మరీ కొనుగోలుచేశారు. ఎకరాకు రూ.3.50 లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు చెల్లించారు. కొనుగోలు సమయంలో వ్యవసాయ బావులు, విద్యుత్‌తోపాటు చెరువులు, కాల్వల పారకం ఉన్న వాటికే ప్రాధాన్యం ఇచ్చారు. వీటిల్లో వానకాలం పంటలతోపాటు నీటి సౌకర్యం ఉండడంతో యాసంగి పంటలను సైతం వేస్తూ ఉపాధి పొందుతున్నారు.
Price
ఈ ఫొటోలోని ఈ మహిళ పేరు నామ్‌వాడీ మీనాక్షి. ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రామానికి చెందిన మీనాక్షికి ప్రభుత్వం గతేడాది దళిత బస్తీ పథకంలో భాగంగా మూడెకరాల భూమిని పంపిణీచేసింది. అప్పటిదాకా వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందే మీనాక్షి కుటుంబం.. భూమి రావడంతో రైతుకుటుంబంగా ఎదిగింది. ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిలో భర్త నామ్‌వాడీ బాలాజీతో కలిసి రెండేండ్లుగా పంటలను సాగుచేస్తున్నారు. గతేడాది పత్తి వేయగా రూ.1.05 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రైతుబంధు పథకంలో ప్రభుత్వం రూ.12 వేలు పెట్టుబడి సాయాన్ని అందించింది. దీంతో మూడెకరాల్లో మళ్లీ పత్తి పంట వేశారు. ఎకరాకు 8 నుంచి 9 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని మీనాక్షి కుటుంబం ధీమాతో ఉంది. ఇప్పటికే 4 క్వింటాళ్ల పత్తిని తీశారు. ఈ ఏడాది పత్తి క్వింటాకు రూ.5600 వరకు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో తమ ఆదాయం గతేడాది కంటే అధికంగా ఉంటుందని ఆ కుటుంబం సంతోషం వ్యక్తంచేస్తున్నది. టీఆర్‌ఎస్ సర్కారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని చెప్తున్నది.

2320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles