పండుగ పిలిచె.. పల్లెలు పిలిచె


Sun,January 13, 2019 02:30 AM

Toll gate charges waived

-టోల్‌ప్లాజాల వద్ద వాహనాల బారులు..
-పంతంగి వద్ద 12 టోల్‌గేట్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/కేతేపల్లి/మాడ్గులపల్లి: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారితో ఔటర్ రింగ్‌రోడ్, నాగపూర్, బెంగుళూరు, విజయవాడ హైవేలతోపాటు రాజీవ్హ్రదారి శనివారం వాహనాలతో నిండిపోయాయి. 65వ హైవేపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపాహాడ్ టోల్‌గేట్ల వద్ద వాహనాలు పెద్దసంఖ్యలో క్యూ కట్టాయి. నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై మాడ్గులపల్లి టోల్‌గేట్ వద్దకూడా వాహనాలు బారులు తీరాయి. కొన్ని టోల్‌గేట్ల వద్ద వాహనదారులకు ఇబ్బంది లేకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటుచేశారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద 12 గేట్లు ఏర్పాటు చేశారు.

పొగమంచుతో జాగ్రత్త

పండుగలకు ఊరెళ్లేవారికి పొగమంచు ప్రమాదకరంగా మారింది. వాతావరణంలో వస్తున్న మార్పులతో అప్రమత్తంగా ఉండాలని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. శనివారం ఉదయం మంచుతో ఏర్పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచిస్తున్నారు. అవగాహన కోసం విజయవాడ, వరంగల్ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలతో ఇతర ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. పంతంగి, ఉప్పల్, ఎల్బీనగర్ వద్ద పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేసి జాగ్రత్తగా ప్రయాణించాలని విజ్ఞప్తిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రి వరకు పంతంగి టోల్ ప్లాజా, వరంగల్ మార్గంలో గూడూరు టోల్ ప్లాజా నుంచి సాధారణంకంటే అదనంగా దాదాపు 50 వేల వాహనాలు వెళ్లాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆదివారం మరో 30 వేలకుపైగా వాహనాలు ఈ మార్గాల్లో వెళ్లే అవకాశం ఉన్నదన్నారు. వాహన టైర్లలో గాలి సరిగా ఉండేలా చూసుకోవాలని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్‌రావు సూచించారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ అసలు వద్దన్నారు. మంచు ఎక్కువగా ఉండటంతో రాత్రులు, తెల్లవారుజామున ప్రయాణాలు చాలా ప్రమాదకరమని తెలిపారు. మంచు ఎక్కువగా ఉన్నప్పుడు హైబీమ్ లైట్లను వాడాలని చెప్పారు.

టోల్ వసూళ్లు రద్దు

13, 16 తేదీల్లో అమలుకు సర్కారు నిర్ణయం
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులకు తెలంగాణ సర్కారు తీపి కబురు చెప్పింది. జాతీయ రహదారిపై టోల్‌గేట్ల వసూళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి శనివారం ప్రకటన విడుదల చేశారు. పండుగకు ముందు జనవరి 13న, పండుగ తర్వాత జనవరి 16న రెండురోజులు టోల్ వసూళ్లు ఉండవని స్పష్టంచేశారు. పండుగ వేళ విపరీతమైన రద్దీ ఉండటం, టోల్‌గేట్ల వద్ద ఆలస్యానికి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది.

1591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles